Adsense

Wednesday, May 24, 2023

దేవీ వైభవం

దేవీ వైభవం

ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతిచ
సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతి చాష్టమం
నవమం సిద్ధిదా ప్రోక్తా నవదుర్గాః ప్రకీర్తితాః
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా

త్రిశక్తి స్వరూపిణి.. అష్టాదశభుజ.. అయిన మహాదేవి ఆ దుర్గమ్మ తల్లి నవ దివ్య రూపాలు ఇవి. దక్షిణాదిన జరిపే నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని కనకదుర్గ, బాలా త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీమహాలక్ష్మి, దుర్గ, మహిషాసుర మర్దిని అలంకారాల్లో పూజిస్తాం. ఉత్తరాదిన జరిపే శరన్నవరాత్రి వేడుకల్లో అమ్మవారిని ఇలా శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి రూపాల్లో నవదుర్గలుగా ఆరాధిస్తారు. ఈ తొమ్మిది నామాలనూ సాక్షాత్తూ బ్రహ్మదేవుడే చెప్పినట్టు పురాణ ప్రతీతి. ఈ శ్లోకాన్ని భక్తిపూర్వకంగా తొమ్మిదిసార్లు పఠిస్తే సకలశుభాలూ కలుగుతాయి. అవతార పురుషుడైన శ్రీరాముడు సైతం.. రావణునితో యుద్ధానికి ముందు ఆ జగన్మాతను పూజించాడు. అజ్ఞాతవాసం విజయవంతం కావాలని పాండవులు వేడుకున్నదీ అమ్మవారినే. శ్రీకృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడిని శంభరాసురుడు ఎత్తుకుపోతే అతణ్ని కాపాడి కృష్ణుడి వద్దకు చేర్చిన తల్లి ఆ జగదీశ్వరియే. నిరక్షర కుక్షి అయిన పూర్వాశ్రమపు కాళిదాసు.. కాళికాదేవి అపార అనుగ్రహంతో ‘‘మాణిక్యవీణా ముపలాలయంతీం’’ అంటూ ఆదిలోనే అమ్మవారిని కీర్తించి అనేక కావ్యాలు నాటకాలు రచించి ఖ్యాతుడైనాడు. బెంగాల్‌లో రామకృష్ణుడు.. శ్రీరామకృష్ణ పరమహంసగా పరిణతి చెందినది కాళికా రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారి అనుగ్రహం వల్లనే. జగన్మాత దయవల్లనే.. ఆయనచేత ప్రభావితుడైన వివేకానందుడు ఆధ్యాత్మికతను, ఆధునికతను మేళవించి భారతీయ తత్వాన్ని, సంస్కృతిని, సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఇతర దేశాలకు ప్రబోధించాడు. భద్రకాళిగా అభయప్రదానం చేసే ఆ తల్లి.. దుష్టులు విజృంభించినప్పుడు కపాలం ధరించి ఉగ్రరూపిణిగా దుష్టశిక్షణ చేస్తుంది. అతి క్రూరులైన రక్త బీజుడు, మధుకైటభులు, శుంభనిశుంభులు, చండముండులు.. ఇలా ఎందరో రాక్షసులను సంహరించి లోకహితంగావించింది. ఆ జగన్మాత త్రిమూర్తులకు మూల విరాట్టు అని శ్లాఘింపబడింది. సాక్షాత్తూ విష్ణుమూర్తే ఒక సందర్భంలో ‘ఆ దివ్య శక్తికి మేం స్వాధీనులం’ అని ప్రకటించాడు. ఉగ్రరూపంలోని అమ్మవారిని అష్టోత్తరాలతో, సహస్రనామాలతోనూ.. శాంతి రూపిణిగా శ్రీ లలితా సహస్రనామాలతోను కొలవడం కద్దు. ఎవరు ఎలా పూజించినా.. భక్తుల కోర్కెలను అవ్యాజమైన ప్రేమతో, అపారమైన కరుణతో తీరుస్తున్న ఆ తల్లి.. కోరి కొలిచినవారి కొంగుబంగారం.

No comments: