Adsense

Wednesday, May 24, 2023

చిత్రగుప్త వ్రతం

చిత్రగుప్త వ్రతం

మనుషులు తెల్లవారి లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు పాపాలు చేస్తుంటాడు. ఈ పాపాలు ఎవరూ చూడరు అనుకుంటారు, కానీ ఇదంతా భ్రమ. మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది. ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ. మనం చేసే ప్రతి పాపపు పనికీ లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది. ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది
యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడా దేవాలయాలు ఉన్నాయి....
రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది.స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి. దీన్ని ధర్మ హరి చిత్రగుప్త దేవాలయం అని అంటారు
దీపావళి రెండో రోజు యమద్వితీయ ఉంటుందని ఆరోజు చిత్రగుప్తుడి పుట్టిన రోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది.దీన్నే భాయ్‌ దూజ్‌ అంటారు. చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం
సృష్టి కర్త బ్రహ్మకు ఎందరో పుత్రులు, పుత్రికలు ఉన్నట్టు పౌరాణిక కథలు చెబుతున్నాయి. అతని మానసపుత్రులు వశిష్ట, నారద, ఆత్రిలతో పాటు మాయా, కామం, యమ ధర్మ, భరత ఇలా ఎందరికో జన్మనిచ్చిన బ్రహ్మకు చిత్రగుప్తుడు సైతం సంతానమే. కానీ మిగతా సంతానంతో చిత్రగుప్తుడు వైవిధ్యమనే చెప్పాలి. బ్రహ్మకు పుట్టిన పిల్లలకు చిత్రగుప్తుడికి చాలా తేడా ఉంది.
బ్రహ్మ శరీరంలో నేరుగా పుట్టిన బిడ్డ చిత్రగుప్తుడు. గరుడ పురాణంలో లిఖితపూర్వ కంగా ఆయన ప్రస్తావన ఉంది. పుట్టిన ప్రాణి గిట్టక మానదు. ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికీ మరణం తప్పదు. ఎందుకంటే విధి విధానం అది. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. మృత్యు ఒడిలో ఎప్పుడయినా సేదతీరాల్సిందే. మరణించిన తర్వాత ఏమవుతుంది ఇది ఎప్పటికీ రహస్యమే. ఈ రహస్యాన్ని కూడా చేధించడం ఇంతవరకు సాధ్యం కాలేదు. కానీ వేదాలు,బపురాణాల్లో మాత్రం ఈ భూలోకం మీద దివ్య లోకం ఉంటుంది. అక్కడ మృత్యుశోకమే ఉండదు.ఆ దివ్య లోకంలో దేవతలు నివాసముంటారు. ఆ దివ్యలోకం పైన బ్రహ్మ, విష్ణు, శివ లోకాలు ఉంటాయి. ఎప్పుడయితే కర్మఫలానుసారం పాప కార్యాల వల్ల దోషులవుతారో వారు యమలోకం వెళ్లాల్సి ఉంటుందట.
జీవుల పాప పుణ్యాలకు సంబంధించిన వివరాలు సేకరించడానికి బ్రహ్మకు ప్రత్యేకమైనది ఏదీ లేదు. ఇందుకు పరిష్కారం వెతికే క్రమంలో బ్రహ్మ 11వేల సంవత్సరాలు ధాన్య ముద్రలోకి వెళ్లాడు. ధ్యానముద్రలో ఉన్న బ్రహ్మ కళ్లు తెరిచి చూసేసరికి ఆజానుబాహుడు కనిపిస్తాడు. చేతిలో పుస్తకం, పెన్ను, నడుం భాగంలో కత్తి కనిపిస్తుంది. అపుడు బ్రహ్మ పురుషా నీవు ఎవరివి. ఎచటి నుండి వచ్చావు అని అడిగాడు. అపుడు ఆ పురుషుడు మీ చిత్ర్‌ (శరీరం)లో గుప్త్‌(రహస్యం)గా నివాస మున్నాను. ఇపుడు నాకు నామకరణం చేయండి, నా కార్యకలాపాలు ఏమిటో చెప్పండి అని ప్రాధేయపడతాడు. అపుడు బ్రహ్మ ఈ విధంగా అన్నారు. " నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త. అదే పేరుతో వెలుగొందుతావు. అంతే కాదు జీవుల శరీరాల్లో తలదాచుకుని వారి మంచి చెడుల గూర్చి తెలుసుకుని పాపాత్ములకు శిక్షలు పడే విధంగా కృషి చేయి" అని ఆశీర్వదిస్తాడు బ్రహ్మ.
చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సూర్యదక్షిణ నందిని. ఈమె బ్రాహ్మణ స్త్రీ, నలుగురు కొడుకులు. వారి పేర్లు భాను, విభాను, విశ్వభాను, వీర్యభాను. నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారి పేర్లు పక్షిణి, మాలతీ, రంభ, నర్మదా. రెండో భార్య పేరు పార్వతీ శోభావతి. ఈమె క్షత్రియ స్త్రీ, ఎనిమిదిమంది కొడుకులు ఉన్నారు. వారి పేర్లు చారూ, సుచారు, చిత్రాఖ్య, మతిమాన్‌, హిమవన్‌, చిత్ర్‌చారు, అరుణ, జితేంద్రలు. కూతుళ్లు ఎనిమిది మంది. వారి పేర్లు భద్రకాళిని, భుజ్‌ గాక్షి, గడ్‌ కీ, పంకజాక్షి, కొకల్సూత్‌, సుఖ్‌ దేవి, కామ కాల్‌, సౌభాగ్యినిలు.
వేదాలలో కూడా చిత్రగుప్తుడి గూర్చి ఉంది. చిత్రగుప్తుడి పూజలో పెన్ను, పేపరు, ఇంక్‌, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం చెక్క, ఆవాలు, నువ్వులు, తమలపాకులు ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్ర గుప్తుడి పూజా సామాగ్రిలో ఉంటాయి.
అకాలమృత్యువును జయించొచ్చు వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు పెద్దలు. వాన వచ్చే విషయాన్ని అయినా కొంతవరకు చెప్పవచ్చుగానీ ప్రాణం పోకడ గూర్చి ఎవరూ చెప్పజాలరు.

చిత్రగుప్త వ్రత కథ:
పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని పేరు సదాస్‌. ఈ రాజు పాపాలు చేసేవాడు. ఈ రాజు ఎవ్వరికీ పుణ్యకార్యం చేయలేదు. ఒకసారి వేటకు వెళ్లిన సమయంలో అడవిలో తప్పిపోతాడు. అక్కడ ఓ బ్రాహ్మ ణుడు కనిపిస్తాడు. అతను పూజ నిర్వహి స్తుంటాడు. రాజు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి ఓ బ్రాహ్మణా నీవు ఎవరి పూజ చేస్తున్నావు. ఇందుకు ఆ బ్రాహ్మణుడు సమా ధానమిస్తూ ఇవ్వాళ కార్తిక శుక్ల ద్వితీయ (యమ ద్వితీయ). ఈ రోజు నేను యమ రాజు, చిత్రగుప్తుడి పూజ చేస్తున్నాను. ఈ పూజ చేయడం వల్ల నరకం నుంచి విముక్తి పొందొచ్చు. అపుడు ఆ రాజు పూజా విధానం తెలుసుకుని ఇంటికి వెళ్లి పూజ చేస్తాడు.

విధి ప్రకారం ఒక రోజు యమ దూత రాజు ప్రాణం తీసుకోవడానికి వస్తాడు. రాజు ఆత్మను గొలుసులతో బంధించి తీసుకెళ్తాడు. యమరాజు దర్బార్‌ కు వచ్చిని రాజును యమధర్మరాజు ముందు ప్రవేశ పెడ్తారు. అపుడు చిత్ర గుప్తుడు తనదగ్గరున్న విధి పుస్తకాన్ని తెరిచి చదువుతాడు. యమ ధర్మరాజా ఈ రాజు చాలా పాపాలు చేశాడు. కానీ ఇతను కార్తిక శుక్ల ద్వితీయ తిథి రోజు వ్రతమాచరించాడు. అతని పాపాలు నివారణమయ్యాయి. ధర్మానుసారం ఈ రాజుకు విముక్తి ప్రసాదించాలి. అని ప్రాధేయపడ తాడు చిత్రగుప్తుడు. దీంతో ఆ రాజు నరకలోకం నుంచి విముక్తి పొందుతాడు. ప్రస్తుతం ఈ కథ ప్రాశస్త్యంలో ఉంది.
ఈ వ్రతము స్త్రీలు, పురుషులు లేక ఇద్దరూ చేసుకొనవచ్చును. స్త్రీలు చేసుకొనుట విశేషముగా చెప్పబడినది. ఈవ్రతము చేసుకొనుట వలన సమస్త పాపములు తొలగి, సమస్త సంపదలు లభించును. దేహానంతరము నరకలోక ప్రాప్తి కలుగకుండుటకు, యమబాధలు తొలగుటకు ఈ వ్రతమును చేసెదరు. ఎన్ని వ్రతములు చేసినను ఈ చిత్రగుప్త వ్రతము చేయనిదే అవి ఫలవంతములు కావని ఈవ్రతములో తెలుపబడినది.
చిత్రగుప్తుడు అనగా గుప్తంగా మనలోనే ఉంటూ చిత్రంగా మన పాపపుణ్యాలను లిఖించువాడు. అంటే మన మనసే చిత్రగుప్తుడు. ఎన్ని వ్రతములు చేసిననూ చిత్రగుప్త వ్రతమును చేయకపోవుట అనగా ఎన్ని పుణ్యకర్మలను చేసినప్పటికీ మనోనియమము లేకుండుట. మనోనియమము చేయకుండుట వలన అవి అన్నియు వ్యర్థములగును. కనుక ఈవ్రతమును చేయుట వలన మనోనిశ్చలత చేకూరి సర్వకర్మలను పరిపూర్ణము చేయు శక్తి చేకూరునని గూఢార్థము. ఇది తెలుసుకుని ఆచరించిన నాడు వ్రతము ఫలవంతమగును.

సూచనలు:
మెదటిసారి మాఘ సప్తమినాడు ప్రారంభించవలెను. ప్రతి సంక్రమణమునాడు పూజించవలెను. చివరికి మకరసంక్రమణము నాడు ఉద్యాపన చేసుకున్నచో బాగుండును. మొదటి నెలనే కానీ, మధ్యలో కానీ చివరన కానీ ఎవరి వీలును బట్టి వారు ఉద్యాపన చేసుకొనవచ్చును. బంగారు ప్రతిమలు, సువర్ణాలంకృతమైన గోదానం, వస్త్రదానాదులు, దశదానాలు, షోడశ మహాదానాలు, 30 మంది బ్రాహ్మణులకు భొజనం అంటే భారీఖర్చుకదా మరి పేదవారి సంగతి ఏమిటి? అని సందేహ పడనవసరం లేదు. ఎవరి వైభవాన్ని అనుసరించి వారు చేయవచ్చును. కానీ శక్తి ఉండికూడా లోభగుణముతో చేయవలసినవి చేయకుండ ఉండరాదు.ఆర్థిక స్థితి కలిగిన వారు యథావిధిగా చేయవలసినదే! శక్తిలేనివారు ఆర్తితో పరమేశ్వరునికి తమ స్థితి తెలుపుకుని పురోహితుల సూచన మేరకు నడుచుకొనవలెను. దానం అన్నదమ్ములకు, గ్రామ కరణానికి ఇవ్వాలా? అనికొందరు అడుగు చున్నారు. నిజానికి కల్పములో అలా లేదు. గృహస్థుడైన బ్రాహ్మణునకు దానమిమ్మని తెలిపిరి కనుక ఆవిధంగానే జేయవలెను.ప్రతినిత్యమూ భుజించు అన్నమును ముందుగా ”చిత్రాయనమః, చిత్రగుప్తాయనమః, యమాయ నమః” అనుచూ మూడు బలులను సమర్పించుట వలన చిత్రగుప్తుడు,యముడు ప్రీతి చెందుదురు. ఉపనయనమైన వారు ఔపోసనుము చేసినప్పుడు ఈవిధముగా విస్తరాకు ప్రక్కన మూడుసార్లు అన్నమును పెట్టుట నేటికీ కలదు.


No comments: