💠 ఏ గుడికైనా స్వామి వారి పూజలు బ్రాహ్మణులచే పూజింపబడతారు.
కానీ, ఈ ఆలయంలో స్వామి వారి పూజలు హరిజన మాలదాసులచే నిత్యం స్వామి వారి మేల్కొల్పుచే ప్రారంభంతో భక్తులు పగలు రేయి అనకుండా ఎప్పుడు వచ్చినా స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తారు.
మాల దాసుల మంత్రోచ్చారణకు శ్రీ చిన్నజీయర్ స్వామి కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి మంత్రాలు, ఉచ్ఛరణ కేవలం తిరుమలలో ఆగమ వేదం పండితులు మాత్రమే పాటిస్తారు. మీకు ఎలా అబ్బినాయి అని అరా తీసి వారిని కొనియాడారు.
అలాంటి గొప్ప సాంప్రదాయం గల ఆలయం పశ్చిమగోదావరి జిల్లా ఉప్పులూరు గ్రామంలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం.
💠 ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే వేదమంత్రాలు చెవులకి ఇంపుగా వినిపిస్తాయి. అయితే ఈ మంత్రోచ్చారణ చేసేది బ్రహ్మణ పండితులు కాదు, హరిజన ( దళిత ) పండితులు.
స్వామివారికి నిత్య నైవేద్య ధూపదీపాలు వారే నిర్వహిస్తారు. ఇలా దేవాలయాలకు హరిజన దాసులు అర్చకులుగా ఉండటం చాలా అరుదు.
💠 దళితులు హిందూ దేవాలయాల్లోకి రాకుండా ఇప్పటికీ చాలా చోట్ల ఆంక్షలున్నాయి. పశ్చిమ గోదావరిజిల్లాలోని ఉప్పులూరు చెన్నకేశవ ఆలయంలో మాత్రం పదకొండు తరాలుగా దళితులే అర్చనలు చేస్తూ సామాజిక సమానత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు.
అదెలా సాధ్యమైందంటే...
⚜ ఆలయ చరిత్ర ⚜
💠 పల్నాటి యుద్ధంలో కీలక పాత్ర పోషించిన బ్రహ్మనాయుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన రామానుజాచార్యుల స్ఫూర్తితో సంస్కరణశీలిగా మారతాడు. కులమతాలకు అతీతంగా సమాజంలో సమభావాన్ని పెంపొందించాలని యోచిస్తాడు. అందుకు చాపకూడు పేరుతో అన్ని కులాల వారికీ సహపంక్తి భోజనాలు పెట్టేవాడు.
ఈ కార్యక్రమాల్లో బ్రహ్మనాయుడి అనుచరుడైన కన్నమదాసు(దళితవర్గానికి చెందినవాడు) చురుగ్గా పాల్గొనేవాడు. ఈ క్రమంలో అతని గుణగణాలకు ముగ్ధుడైన బ్రహ్మనాయుడు మాచర్ల, మార్కాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయాల అర్చకత్వ బాధ్యతలను కన్నమదాసుకి అప్పగించాడు.
అనంతరం కన్నమదాసు వారసుడు అయిన తిరువీధి నారాయణదాసు ఆ బాధ్యతల్ని తీసుకున్నాడు.
💠 పల్నాడులో ధూప, దీప, నైవేద్యాలతో నిత్య పూజలందుకునే చెన్నకేశవస్వామి ఆలయంలో పల్నాటి యుద్ధ సమయంలో దాడులు జరిగాయని... ఆ సమయంలో స్వామిని కాపాడుకోవడానికి కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు, అతని సోదరులు కలిసి స్వామి ప్రతిమను సింహాచలం తరలించి స్వామికి అప్పల స్వామి అని పేరు మార్చారు.
💠 అక్కడే కొన్నాళ్లు ఆశ్రయం పొంది మళ్లీ పల్నాడుకు తిరుగు ప్రయాణమవుతాడు. మార్గమధ్యలో ఉప్పులూరులోని ఓ చెట్టు కింద స్వామివారి విగ్రహాన్ని ఉంచి... చుట్టుపక్కల గ్రామాల్లో ఆయవారానికి వెళతాడు.
💠 అదే సమయంలో ఈ గ్రామంలో కొందరు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అప్పుడు హరిజనులు మన గ్రామంలోకి అడుగుపెట్టినందుకు ఇలా జరిగిందని భావించిన గ్రామస్థులు నారాయణదాసు, అతని సోదరులను నిర్బదించారు. ఇక ఆ రోజు రాత్రే సింహాచల అప్పన్న గ్రామ పెద్దలకు కలలో కనిపించి వారు నిరపరాదులు వారిని విడిచిపెట్టమని, గ్రామంలోని మర్రిచెట్టు క్రింద తన ప్రతిమ ఉందని, స్వామి వారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించి తనకు దీప నైవేద్యాలు హరిజన దాసులే అర్చకులుగా ఉండాలని ఆదేశించారట.
💠 అలా 1280 ప్రాంతంలో చెన్నకేశవస్వామి ఉప్పులూరులో శ్రీ లక్ష్మీ చూడికుడుత్త నాచ్చియార్ ఆండాళ్ సమేతంగా స్వయంభూగా వెలిశారనీ, తరవాత నారాయణదాసు కూడా ఆ గ్రామంలోనే స్థిరపడి స్వామిని సేవించడం మొదలుపెట్టారు.
💠 నిజానికి విగ్రహాం చెన్నకేశవుడిదే కాబట్టి 1868 లో ఈ అప్పలస్వామికి పూర్వపు నామమైన చెన్నకేశవస్వామిగా మరల నామకరణం చేసారు.
💠 అలా తరతరాలుగా కన్నమదాసు వారసులు వంశ పారంపర్యంగా వేద, ద్రావిడ, సంస్కృత భాషల్లో మంత్రోచ్ఛరణలూ, తిరుపూజ, యాజ్ఞిక హోమాలు, శాస్త్రీయ పరిజ్ఞానంతో పాటు స్వామి వారి కల్యాణోత్సవాల నిర్వహణ తదితర పూజా విధానాలు నేర్చుకుని చెన్నకేశవుడి సేవలో తరిస్తున్నారు.
💠 ప్రస్తుతం 9 కుటుంబాల వారున్నారక్కడ. వీరంతా పలు ఉద్యోగాలు చేస్తూనే నెలకొకరు చొప్పున అర్చన చేస్తుంటారు.
💠 ధనుర్మాసం, వైశాఖంలో మాత్రం అందరూ కలిసి స్వామివారికి సేవచేస్తారు.
స్వామికి చెందిన నలభై ఎకరాల్లోని పాతిక ఎకరాల్లో వీరు సాగు చేసుకుంటారు. మిగతా పదిహేను ఎకరాల్లోని ఆదాయాన్ని ఆలయం అభివృద్ధికి కేటాయిస్తున్నారు.
అందుకే ఆ ఆలయంలో హుండీలుండవు. కానుకలు స్వీకరించరు.
💠 ధనుర్మాసంలో ప్రత్యేకంగా పూజలు చేస్తారు.సుప్రభాత సేవతోపాటు తిరుప్పల్లాణ్డు, తిరుపళ్లియొళుచ్చి, తిరుపావై నిర్వహిస్తారు.
వైశాఖ మాసం శుద్ధ చవితి నుంచి బహుళ పాడ్యమి వరకూ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి.
💠 స్వామి వారికి ఎంతో ఇష్టమైన అరటిగెలను నైవేద్యంగా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. ఎవరైనా మొక్కుకున్నా అరటిగెలనే చెల్లించి మొక్కు తీర్చుకుంటారు.
No comments:
Post a Comment