Adsense

Friday, May 26, 2023

ఓం శ్రీ షష్ఠీ దేవియే నమః

ఓం శ్రీ షష్ఠీ దేవియే నమః

సంతానం లేనివారు షష్ఠీదేవిని వ్రత విధానమున పూజించిన వారికి సంతానం కలుగుతుంది.

షష్టీ దేవి ప్రకృతి దేవి యొక్క షష్టా౦శ (ఆరవ కళ) వల్ల అవతరించినది గనుక ఆమెకు షష్టీ దేవి అని పేరు వచ్చినది.ఈమె కుమార స్వామికి ప్రియురాలు.పిల్లలలకి తరుచుగా అనారోగ్యాలు కలుగుతున్న,ఆపదలు వస్తున్నా,బాలారిష్టాలు ఉన్నా షష్ఠిదేవి కధ విన్న,చదివిన,వ్రాసిన షష్ఠిదేవి శిశువులకు పక్కనే ఉండి వారి ఆయువుని అభివృద్ధి చేస్తుంది.గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా షష్ఠిదేవి స్తోత్రం చదివితే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. సంతానం లేనివారు షష్ఠిదేవి స్తోత్రం శ్రద్ధగా పఠిస్తే దీర్ఘాయుష్మంతులు అయిన సంతానం పొందుతారు.

వినటానికి ఇది చాలా విచిత్రంగానే ఉంటుంది. సృష్టిలోని చిన్నపిల్లందరికీ జన్మనిచ్చిన తల్లిగాక, కష్టాల నుంచి గట్టెక్కించి కాపాడే మరో తల్లి ఉంది. ఆమే షష్ఠీదేవి. ఈ దేవతకు సంబంధించిన కథ దేవీభాగవతం తొమ్మిదో స్కంధంలో వివరంగా కనిపిస్తుంది.

ప్రతి భాద్రపద శుక్లచవితిని వినాయక చవితి పండుగగా ఎలా చేసుకుంటారో అలాగే ప్రతి భాద్రపద శుక్లషష్ఠిని షష్ఠీదేవి పండుగగా కూడా జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. ఈ దేవత చరిత్రే ఓ విచిత్రంగా, గొప్పగా కనిపిస్తుంది. ప్రకృతి మాతలో ఆరో అంశగా ఈమె అవతరించిన కారణంగా షష్ఠీదేవి అని పేరు వచ్చింది. బ్రహ్మ మానస పుత్రిక అయిన ఈ దేవత యుద్ధసమయాలలో దేవతల సేనను నిరంతరం కాపాడుతూ దేవతలకు విజయం చేకూర్చిపెడుతున్న కారణంగా దేవసేన అని పేరు వచ్చింది. ఈ దేవసేన కుమారస్వామిని వివాహమాడింది. బాలబాలికలకు మంచి ఆయువును ఇచ్చి పెంపుడు తల్లిలా రక్షిస్తూ యోగమాయా రూపంలో పురిటింట్లో పిల్ల పక్కనే ఉంటుంది. పిల్లలకు అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఈ దేవతను ఆర్తితో స్తుతిస్తే వారికి ఆరోగ్యాన్ని చేకూర్చిపెడుతుంది. దీనికి సంబంధించిన పూర్వకథ నొకదానిని కూడా దేవీభాగవతం పేర్కొంటోంది.

పూర్వం స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు అనే ఓ కుమారుడు జన్మించాడు. ప్రియవ్రతుడు పెరిగి పెద్దయ్యాడు కానీ ఎందుకో ఆయనకు వివాహం మీదకు మనస్సు పోలేదు. నిరంతరం తపస్సుకే తన జీవితాన్ని అంకితం చేశాడు. అయితే బ్రహ్మదేవుడు కలగజేసుకొని గృహస్థాశ్రమ ప్రాముఖ్యాన్ని వివరించి ప్రియవ్రతుడికి మాలినీదేవి అనే కన్యతో వివాహం జరిపించాడు. అయితే ఆ దంపతులకు ఎంత కాలానికీ సంతానం కలగలేదు. ఈ పరిస్థితిని గమనించిన కశ్యప ప్రజాపతి వచ్చి పుత్రకామేష్ఠి యాగాన్ని ప్రియవ్రతుడి చేత చేయించాడు. ఆ తర్వాత మాలినీదేవి గర్భవతి అయింది. ఓ శుభముహూర్తాన పండంటి బిడ్డను ప్రసవించింది. కానీ ఆ శిశువు మృతశిశువు. దాంతో ఆ దంపతులు ఎంతో శోకించారు. ప్రియవ్రతుడు మృతశిశువును తీసుకొని అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతడికి దుఃఖం ఆగలేదు. దారుణంగా విలపించాడు. అలా విలపిస్తూనే కూర్చున్నాడు తప్ప శిశువును ఖననం చేయటానికి పూనుకోలేదు. ఇంతలో ఓ దివ్యవిమానం అక్కడకు వచ్చి ఆగింది. ఆ విమానంలో నుంచి తెల్లని వస్త్రాలతో, పుష్పమాలికలతో ప్రకాశిస్తున్న ఒక దేవత అక్కడ నిలిచింది.

ప్రియవ్రతుడు ఆమెను చూసి శిశువును కిందకు దించి లేచి నిలుచొని నమ్కరించాడు. ఆమె ఎవరో? తన దగ్గరకు ఎందుకు రావల్సి వచ్చిందో చెప్పమన్నాడు. అప్పుడు ఆ దేవి తన విషయాలన్నింటినీ చెప్పింది. తాను ఆదిపరాశక్తిలోని ఆరో అంశనని, తన వివరాలన్నీ చెప్పి శిశువును చేతిలోకి తీసుకొని ఒళ్ళు నిమిరింది. ఆ బాలుడు కిలకిలా నవ్వుతూ జీవం పోసుకొని కళకళలాడాడు. పునరుజ్జీవితుడైన ఆ పిల్లవాడు సూరతుడు అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడని, ఎంతో యోగ్యుడుగా ఉంటాడని గొప్ప కీర్తిని కూడా గడిస్తాడని షష్ఠీదేవి ప్రియవ్రతుడికి చెప్పింది. తాను పసిపిల్లలను నిరంతరం రక్షిస్తూ ఉంటానని, అయితే కర్మవిపాకం బలీయమని పూర్వజన్మలో చేసుకున్న కర్మం ప్రకారం ఎవరికైనా కష్టాలు రాసుంటే వాటిని తప్పించటం అంత సులభసాధ్యం కాదంది. అలాకాక మరి ఏ ఇతర కారణాంతరాల వల్లైనా శిశువులకు కష్టాలు కలిగితే వాటిని తాను తొలగిస్తానని చెప్పింది.

ప్రియవ్రతుడు రోదిస్తూ ఉండటాన్ని పక్కనే మృతశిశువు ఉండటాన్ని చూసి తాను తట్టుకోలేక అలా వచ్చానని చెప్పింది. ఆ తర్వాత ఆమె ప్రియవ్రతుడికి తిరిగి బతికిన బిడ్డను ఇచ్చి అంతర్థానమైంది. అప్పటినుంచి ప్రతినెల శుక్లషష్ఠినాడు అందులోను భాద్రపద శుక్లషష్ఠినాడు ప్రియవ్రతుడు షష్ఠీదేవికి పూజలు జరిపించటం ప్రారంభించాడు. పురిటిళ్ళల్లో ఆరో రోజున, పదకొండో రోజున, అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యం సందర్భంలోను షష్ఠీదేవి పూజలుచేయటం ఆనాటినుంచే మొదలైంది. సాలగ్రామంలోనో, మంగళకలశంలోనో, వటవృక్షం మూలనో షష్ఠీదేవిని ఆవాహన చేసి పూజలు జరిపిస్తారు. పుష్పాలతోను, షోడశ ఉపచారాలతోను పూజచేసి నైవేద్యం పెడతారు. ఇలా పూజలు చేసినవారి ఇంట శిశువులకు మంచి ఆరోగ్యమే కాక పెద్దవారికి కూడా సుఖభోగాలు ప్రాప్తిస్తుంటాయన్నది నమ్మకం. పిల్లలను తల్లిలా కాపాడే ఓ ప్రత్యేక దేవత షష్ఠీదేవి గురించి దేవీభాగవతం వివరిస్తోంది.
నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమః
శుభాయై దేవసేనాయై షష్ట్యై దేవ్యై నమో నమః
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖ దాయై మోక్షదాయై షష్ట్యై దేవ్యై నమో నమః

సృష్టె షష్ఠాంశరూపాయై సిద్ధాయైచ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీ దేవ్యై నమో నమః
సారయై శారదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్ఠా తృ దేవ్యై చ షష్ఠీ దేవ్యై నమో నమః

కల్యాణ దేవ్యై కల్యాణ్యై ఫల దాయైచ కర్మణాం
ప్రత్యక్షా యై సర్వభక్తానాం షష్ఠ్యై దేవ్యై నమో నమః
పూజ్యాయై స్కందకాంతాయై సర్యేషాం సర్వ కర్మసు
దేవ రక్షణ కారిణ్యై షష్ఠీ దేవ్యై నమో నమః

శుద్ధ సత్వ స్వరూపయై వందితాయై నృణాం సదా
హింసా క్రోధ వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః
ధనం దేహి జయం దేహి పుత్రందేహి సురేశ్వరీ !
మానం దేహి జయం దేహి ద్విషోజహి మహేశ్వరి

ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవి నమో నమః
దేహి భూమిం ప్రజాం దేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ జయం దేహి విద్యా దేవి నమో నమః
నమోస్తుతే నమోస్తుతే షష్ఠీ దేవి నమో నమః

No comments: