Adsense

Wednesday, May 24, 2023

ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీశ్రీ ధీనామవిత్స్ర వతుశ్రీ

ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీ
వతీశ్రీ ధీనామవిత్స్ర వతుశ్రీ

ప్రణమిల్లే సకలజనులకూ జ్ఞానాన్ని ప్రసాదించి కాపాడే సరస్వతి మనందరిని కాపాడుగాక! వాక్‌ శక్తులను ప్రేరేపించి యావన్మందినీ జాగృతం చేయుగాక! అనే అర్థాన్నిచ్చే యీ వేదమంత్రం ఆ మహాదేవి కరుణాకటాక్షాలు మానవాళికి అత్యావశ్యకమని ఉపదేశించింది. వాక్‌ శక్తి జాగృతమైతేనే మనిషి చైతన్యాన్ని పొందుతాడన్నది సర్వవిదితం. ఆ శక్తినిచ్చే తల్లి మహా సరస్వతి. ‘సరస్వతి’ అనే పదానికి ప్రవహించేది అనే అర్థం ఉంది. జ్ఞానం ఒకరి నుండి మరొకరికి గురుశిష్య సంబంధ రూపంలో ప్రసరిస్తుంది. అప్పుడే జాతి చైతన్యవంతమైన జ్ఞానాన్ని పొందుతుంది. జ్ఞానం బయటికి కనిపించదు, అది అంతర్వాహిని. సరస్వతిని అంతర్వాహినిగా పేర్కొనడంలో ఈ విషయమూ పరిగణింపదగినది. సృష్టి చైతన్యమంతా జ్ఞానాధారం కనుక జ్ఞానాన్ని ఆశించేవారు సరస్వతిని ఆరాధిస్తారని ధర్మం చెబుతున్నది.

శరన్నవరాత్రులు శక్తిని ఆరాధించేవిగా గణుతికెక్కాయి. సృష్టి, స్థితి, లయకారులకు తోడుగా వాణీరమాపార్వతుల శక్తి ఉన్న కారణంగా ఈ నవరాత్రులలో ముగురమ్మలను కూడా ప్రత్యేంగా ఆరాధించే సంప్రదాయం ఏర్పడింది. మూలానక్షత్రం రోజు ప్రత్యేకించి మహా సరస్వతిని పూజించడమంటే జగచ్చైతన్యాన్ని ప్రసాదించి లోకాన్ని కాపాడాలని వాంఛించడమే. బ్రహ్మాండపురాణం, దేవీ భాగవతం వంటి మహా గ్రంథాల్లో సరస్వతీ స్తుతులున్నాయి. పాంచారాత్రాగమ విధానంలో సరస్వతీదేవిని స్తుతించే ఒక శ్లోకం ఆమె రూపంలోని తత్త్వాన్ని అందిస్తోంది..

సుదండం దక్షిణేహస్తే వామహస్తీతు పుస్తకమ్‌శ్రీశ్రీ
దక్షిణేచాక్షమాలాంచ కుండికాంవామహస్తికేశ్రీశ్రీ
తల్లికున్న నాలుగు చేతుల్లో నాలుగు వస్తువులున్నాయి. రెండు కుడి చేతుల్లో ఒక దాన్లో అక్షమాల, రెండోదాన్లో దండం, ఎడమ చేతుల్లో ఒక దాంట్లో పుస్తకం మరో దాంట్లో కమండలం. దీన్ని బట్టి గ్రంథజ్ఞానం కన్నా ఆధ్యాత్మిక జ్ఞానం గొప్పదన్న విషయం అర్థమౌతున్నది. ఎడమ చేతిలో పుస్తకం గ్రంథజ్ఞాన సంకేతమైతే, కుడిచేతిలోని అక్షమాల ఆధ్యాతిక జ్ఞానానికి సంకేతంగా భావించవచ్చు. ఈ శరన్నవరాత్రులలో ఆ మహాశక్తిని సరస్వతీ దేవిగా సేవించి శరణు పొందడం ప్రపంచానికి శ్రేయోదాయకమైనదిగా భావించి

‘జ్ఞానక్రియాద్యువనతోప చితాత్మశక్తిమ్‌శ్రీ
వాగ్దేవతాం శృతి మయీం శరణం ప్రపద్యేశ్రీశ్రీ
అంటూ మహనీయులంతా ఆరాధించి తరించారు.

No comments: