Adsense

Thursday, May 11, 2023

శ్రీ గాంగేశ్వర స్వామి ఆలయం, తడికలపూడి, పశ్చిమ గోదావరి


శ్రీ గాంగేశ్వర స్వామి ఆలయం, 
తడికలపూడి, పశ్చిమ గోదావరి


💠 మహాభారత యుద్ధంలో భీష్ముడు కీలకమైన పాత్రను పోషించాడు. విశ్వమానవ కల్యాణానికి గాను ఈ లోకానికి విష్ణుసహస్రనామాలను అందించాడు. తన తండ్రి సుఖసంతోషాల కోసం తాను వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసిన త్యాగశీలి ఆయన. ఇప్పటికీ తిరుగులేని ప్రతిజ్ఞను 'భీష్మ ప్రతిజ్ఞ'గా చెప్పుకుంటూ వుంటారు.

💠 కోరిన కోర్కెలు తీర్చే పరమశివుడు కొన్ని చోట్ల స్వయంభువుగా వెలిస్తే మరికొన్ని ప్రాంతాల్లో దేవతలూ, మునులూ శివలింగాలను ప్రతిష్ఠించారని అంటారు.
అలా ధర్మానికి ... ధైర్య సాహసాలకు ప్రతీకగా కనిపించే భీష్ముడు, ఓ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. అదే పశ్చిమ గోదావరి జిల్లా తడికలపూడిలో ఉన్న 'శ్రీ గాంగేశ్వర స్వామి క్షేత్రం'.

💠 గాంగేయమనే ప్రత్యేక శిలతో ఇక్కడ శివలింగాన్ని రూపొందించారట, అలానే
భీష్ముడుకి గాంగేయుడు అనే పేరు కలదు,
భీష్ముడు ప్రతిష్ఠ చేయడం వల్లే ఇక్కడ స్వామిని గాంగేశ్వరుడిగా పూజిస్తారు.

💠 అలా భీష్ముడిచే ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం, కాలక్రమంలో ఎంతోమంది మహర్షులచే ... రాజవంశీకులచే పూజలు అందుకుంది.
ఆ తరువాత ఈ శివలింగం అంతర్ దానమైపోయింది.

⚜ స్థలపురాణం ⚜

💠 స్వామివారి మహాలింగంపైన ప్రతిబింబించే సూర్యకాంతుల తళుకుల వల్ల గ్రామానికి మొదట తళుకులపూడి అనే పేరు వచ్చిందనీ కాలక్రమంలో అదే తడికలపూడిగా మారిందనీ చెబుతారు.

💠 భీష్ముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించినా... ఆలయం లేకపోవడంతో అది కొన్నాళ్లకు భూమిలోకి కూరుకుపోయిందట. అది జరిగిన కొన్నేళ్ల తరువాత... జిలకర్ర గూడెంలో ఉన్న రాజావారిని కలిసేందుకు వెళుతున్న కరణం గుర్రం కాలి గిట్ట శివలింగంపైన పడిందట.

💠 దాంతో ఆ గుర్రం ముందుకు కదల్లేకపోయిందట.
కరణం అక్కడే ఆగిపోయి స్థానికుల సాయంతో ఆ ప్రాంతాన్ని తవ్విచూడగా అప్పుడే ఉద్భవిస్తున్న శివలింగం కనిపించిందట.
ఆ రాత్రి శివుడు కరణానికి కలలో కనిపించి ఆలయం నిర్మించకపోతే తాను లింగరూపాన ఎదిగిపోతానని చెప్పాడట.

💠 మర్నాడు కరణం ఆ ఊరి ప్రజలతో కలిసి స్వామికి ఓ ఆలయాన్ని కట్టించాడట. అప్పటినుంచీ ఈ ఆలయం గురించి అందరికీ తెలిసిందని అంటారు.


💠 ఈ ఆలయంలోని రాజగోపురం... దానిపైన ఉన్న ఐదు కలశాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయని అంటారు.

💠 ఈ ఆలయంలో 41 రోజులు క్రమం తప్పకుండా ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

💠 శివరాత్రి, కార్తిక పౌర్ణమి రోజుల్లో స్వామికి సహస్ర బిల్వార్చన నిర్వహిస్తారు.
ఆ సమయంలో కొందరు భక్తులు నాగస్వరం ఊదుతూ చేసే శివతాండవాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. వీటన్నింటితో స్వామి ప్రసన్నుడయాడనడానికి ప్రతీకగా శివలింగం పై నుంచి పువ్వులు కిందకు జారతాయట.

💠 వేంగి చాళుక్యులూ, విజయనగరం ప్రభువులూ ఈ మహా శైవక్షేత్రాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది.
ఈ ఆలయంలో 10, 11 శతాబ్దాల నాటి అపురూప శాసనాలు కూడా ఉంటాయి.

💠 వాటిని బట్టి ఒకప్పుడు స్వామిని అరణ్యేశ్వరస్వామి, అయ్యనేశ్వరస్వామి, అరుణేశ్వర మహాదేవుడిగా కీర్తించినట్లు తెలుస్తోంది. వేంగి రాజుల పాలనలో స్వామికి ఎంతో వైభవంగా పూజలు జరిగేవట.

💠 ఇక్కడ స్వామికి శైవ ఆగమ ప్రకారం పూజలు నిర్వహిస్తారు.

💠 నిర్మాణపరంగా ఆలయం ప్రాచీనతకు అద్దంపడుతూ వుంటుంది. గర్భాలయంలో శివలింగం దివ్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ వుంటుంది. స్వామివారితో పాటు పార్వతీ అమ్మవారు ... గణపతి ... నాగదేవత ... వీరభద్రుడు పూజలు అందుకుంటూ వుంటారు. అటు ఆధ్యాత్మిక వైభవం ... ఇటు చారిత్రక నేపథ్యం కలిగిన ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి బాగానే వుంటుంది.

💠 ఇక్కడి స్వామి అడిగినంతనే కరిగిపోయి కరుణిస్తూ ఉంటాడని భక్తులు చెబుతుంటారు. ఆయన అనుగ్రహంతో తాము సాధించిన వాటి గురించి అనుభవపూర్వకంగా వివరిస్తూ వుంటారు.

💠 విశేషమైన పర్వదినాల్లో ఆ స్వామిని మరింత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ తరిస్తుంటారు.

💠 ఈ ఆలయంలో కార్తికమాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బిల్వార్చన, సహస్ర బిల్వార్చన, సహస్ర కుంకుమార్చన, లక్ష దీపార్చన సహస్ర లింగార్చన నిర్వహిస్తారు.

💠 కార్తికమాసంలో 30రోజులు నిత్య మహన్యాస పూర్వక రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుందిక్కడ.

💠 శ్రావణమాసంలో నాలుగు శుక్రవారాలు కుంకుమ పూజలు, సహస్ర నామాలు అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారు.
అలాగే దేవీ నవరాత్రుల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

💠 శివరాత్రి రోజున స్వామి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారిక్కడ.

💠 కాల సర్పదోష నివారణార్థం జంటనాగుల ప్రతిమల మండపం కూడా ఈ ఆలయంలో కనిపిస్తుంది.

💠 ఏలూరు నుంచి 25 కిమీ దూరం

No comments: