Adsense

Sunday, May 14, 2023

శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి, జంగారెడ్డిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా

 శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి, జంగారెడ్డిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా

💠 తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఏడుకొండల్లో వెలసినట్టే ఇక్కడ పారిజాతగిరివాసుడు ఏడుకొండలపై కొలువై ఉన్నాడు.
భక్తుల అభీష్టాలు తీర్చే కల్పవల్లిగా, భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతూ భక్తులతో నిత్యపూజలందుకుంటున్నాడు. తిరుపతిలో జరిగే బ్రహ్మోహత్సవాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు తరహాలో ఇక్కడ శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరిలో నిర్వహిస్తున్నారు.

💠 ' గోకుల తిరుమల పారిజాత గిరి' అనేది ఇక్కడి క్షేత్రం పేరు. అంతా గోకుల తిరుమల అని పిలుస్తూ వుంటారు. నిజానికి ఈ పేరు వినగానే ఒక పవిత్రమైన భావం కలుగుతుంది ... శ్రీ కృష్ణుడే ... శ్రీనివాసుడుగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి.
అలాంటి కృష్ణుడి లీలా విన్యాసాలను గుర్తుకు తెస్తూ శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన ఈ క్షేత్రం మరో తిరుమలగా ప్రసిద్ధి చెందింది.

💠 ఇక్కడి స్వామిని మొదటగా పశువుల కాపరులు కనుక్కున్న కారణంగా 'గోకులం' గా ... శ్రీనివాసుడు కొలువైన కారణంగా 'తిరుమల' గా ... ఈ కొండపై పారిజాత వృక్షాలు విస్తారంగా వుండటం వలన 'పారిజాతగిరి' గా పిలుస్తుంటారు.
ఇలా ఇన్ని కారణాల వలన ఈ క్షేత్రానికి 'గోకుల తిరుమల పారిజాత గిరి' అనే అందమైన పేరు ఏర్పడింది.

⚜ స్థలపురాణం ⚜

💠 పూర్వము చిట్టయ్య అనే భక్తుడికి ఓసారి స్వామి కలలో కనిపించి ఈ పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న ఏడు కొండలలో ఒక కొండపైన పారిజాత వృక్షాల దగ్గర తన పాదాలు ఉన్నాయనీ, అక్కడ ఆలయం నిర్మించమనీ చెప్పాడట. దాంతో ఆ భక్తుడు ఏడు కొండల్ని వెతికితే ఆరో కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిలపైన స్వామి పాదాలు కనిపించాయట. ఆ పాదాలు వెలసిన శిలనే విగ్రహంగా మార్చి, చిన్న మందిరంగా నిర్మించి, క్రమంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి కొండపైకి వచ్చే భక్తుల సహకారంతో మెట్లదారినీ నిర్మించాడట.

💠 భక్తుల కోర్కెలు నెరవేర్చుచూ స్వామి అనతికాలంలో ప్రసిద్ధినొందినాడు.  2003 సంవత్సరంలో శ్రీ పేరిచర్ల జగపతిరాజు గారి ఆధ్వర్యములో అభివృద్ధి కమిటి ఏర్పాడి భక్తుల సహకారంతో ప్రస్తుత ఆలయము నిర్మించి శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి పర్యవేక్షణలో శ్రీవైఖానస ఆగమయుక్తంగా స్వామి వారి పాదాలు వెలసిన ప్రదేశములో ప్రస్తుత విగ్రహము ప్రతిష్టించినారు.

💠 గర్భాలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం సుమనోహరంగా దర్శనమిస్తూ వుంటుంది. ఆయన సౌందర్యం చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు.
ఇక ప్రత్యేక మందిరాలలో కొలువైన శ్రీ దేవి - భూదేవి భక్తులచే పూజలు అందుకుంటూ వుంటారు.

💠 తిరుమల శ్రీవారి తేజస్సు , ఆయన మహాత్మ్యం ఇక్కడి స్వామి కలిగివున్నాడని స్థానికులు చెబుతుంటారు.
స్వామిని దర్శించిన భక్తులు కూడా ఇదే విషయాన్ని విశ్వసిస్తూ వుంటారు.

💠 పర్వదినాల సమయంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ... కొండపై కొలువుదీరిన స్వామివారిని దర్శించి ధన్యులవుతుంటారు.

💠 ఇక్కడ స్వామికి కుడి భాగంలో పద్మావతీ దేవి, ఎడమ భాగాన గోదాదేవి -12మంది ఆళ్వారులు కొలువై కనిపిస్తారు.
కొండపైన ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి దక్షిణముఖంగా దర్శనమిస్తే... శ్రీనివాసుడు వెలసిన కొండకు ఎదురుగా ఉన్న గిరిపైన గరుత్మంతుడిని దర్శనమిస్తాడు. కొండ దిగువన గోకుల ఉద్యానవనంలో లక్ష్మి, దుర్గ, సరస్వతి, గాయత్రీ దేవి ఆలయాలూ, గోశాలా ఉంటాయి.

💠 మెట్ల మార్గంలో గణపతి, గోవింద రాజ స్వామి, నటరాజ ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడున్న మెట్ల మార్గంలోని ఆలయాల వద్ద రాయి రాయి పేర్చి గూడులా కడితే... చాలా తక్కువ సమయంలో సొంత ఇంటి కల నెరవేరుతుందని భక్తుల నమ్మకం.

💠 ధనుర్మాసంలో ఇక్కడి గోదాదేవిని పూజిస్తే వివాహం జరుగుతుందనీ, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయనీ ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

💠 గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, కల్యాణోత్సవాలు, అమ్మవార్లకు సారే సమర్పణ,బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్టి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటారు.

🔅 ఆత్మప్రదక్షణతో పుణ్యం 🔅

💠 ఆగమశాస్త్రం ప్రకారం గిరిచుట్టూ
ప్రదిక్షణలు చేయడం వల్ల మరింత పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఈ పుణ్యఫలాన్ని భక్తులకు అందించేందుకు స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు, కార్యదర్శి కాకాని శ్రీహరిరావు ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 30 లక్షల రూపాయలు వెచ్చించి గిరిప్రదిక్షణ తాత్కాలిక రోడ్డును నిర్మిస్తున్నారు.

💠 రాష్ట్రంలో ఏడుకొండలపైన వెలసిన తిరుమల వెంకటేశ్వరుడు కాగా,రెండవది ఈ పారిజాత గిరివాసుడు.  ఏడుకొండల్లో శేషాద్రి, వృషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, వేంకటాద్రి,
వృషభాద్రి ఉన్నాయి.

💠 ఏలూరు  నుంచి 60 కిమీ దూరంలో  జంగారెడ్డిగూడెం బస్టాండు నుంచి ఆటోల ద్వారా గుడికి చేరుకోవచ్చు.

No comments: