Adsense

Thursday, September 7, 2023

శ్రీకృష్ణుని జననం



మధురా నగరాన్ని శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన యాదవ వంశానికి చెందిన వాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమతో కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే ఆకాశవాణి దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. అది విన్న వెంటనే కంసుడు కుపితుడై దేవకిని సంహరించబోతాడు.

అప్పుడు వసుదేవుడు అడ్డుపడి, "కంసా! నీకు అత్యంత ప్రియమైన సోదరిని చంపుతావా? ఆమె కాదు కదా నిన్ను సంహరించేది. ఆమెకు జన్మించిన కుమారుడు కదా నిన్ను సంహరించేది. దేవకి ప్రతి సంతానాన్ని తీసుకొని నీకు సమర్పిస్తాను" అని చెబుతాడు.

ఆ తరువాత దేవకివసుదేవులని, అడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహారాజును కూడా చెరసాలలో పెడతాడు. దేవకి వసుదేవుల ఆరుగురు పుత్రులను కంసుడు సంహరిస్తాడు.

దేవకి ఏడవ మారు గర్భం ధరించినప్పుడు, భగవంతుడు యోగమాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో  రోహిణి గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు.

శ్రీకృష్ణుడు తొలుత వసుదేవుని హృదయంలో నిలిచి తరువాత దేవకి హృదయంలోకీ చేరుతాడు దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరించినప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యు భీతి కలుగుతుంది. లక్ష్మీనాథుడు దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు చెరసాలకు వచ్చి దేవదేవుని స్తుతిస్తారు.

భగవంతుని ఆవిర్భావసమయంం రాగానే నక్షత్రాలన్ని పరమ మంగళకరంగా అయ్యాయి. శ్రావణ శుద్ధ అష్టమి తిథి నాడు  శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలో దేవకి వసుదేవులకు చతుర్భుజ  రూపంలో జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, యమునా నది వైపు బయలుదేరుతాడు. యమునానది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలిపోతుంది. యమునా నది నుండి బయలుదేరి నందనవనంలో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి యశోద ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశంలో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువును తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు.

ఆ విధంగా దేవకీవసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరసాలలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లె లోని యశోదాదేవి ఒడిని చేరి, అక్కడే పెరిగాడు...

🙏🙏🙏🙏🙏🙏
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
🙏🙏🙏🙏🙏🙏

No comments: