Adsense

Thursday, September 7, 2023

శ్రీకృష్ణాష్ట‌మి విశిష్టత

♦️ శ్రీకృష్ణాష్ట‌మి విశిష్టత ♦️

హిందూమతస్థులు శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరి, శ్రావణగౌరి వ్రతాలు చేస్తారు. ఈ మాసంలో వచ్చే మరో విశిష్టమైన పండగ శ్రీకృష్ణాష్ట‌మి. ఇది శ్రీకృష్ణుని జన్మదినం. దీన్నే జన్మాష్టమి గోకులాష్టమి, శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటారు. గీతాచార్యుని జన్మనదినానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజును తల్లులందరూ తమని తాము దేవకీ,యశోదలుగా భావించుకుంటూ తమ బిడ్డలనే శ్రీకృష్ణుడి ప్రతిరూపాలుగా భావిస్తారు.

తమ చిన్నారులను చిన్నారి కృష్ణుడుగా అలంకరిస్తారు. పంచె కట్టి, తలపై కొప్పు వేసి నెమలి ఫించంతో అలంకరిస్తారు. అంటే ఈ పండగకు ఎంత ప్రాధాన్యమిస్తారో అర్థం చేసుకోవచ్చు. తన లీల ద్వారా భక్తి, జ్ఞానం, యోగం, మోక్షాల గురించి ప్రపంచానికి తెలియజేశారు శ్రీకృష్ణపరమాత్మ. దుర్గుణాలను వదిలి.. ధర్మమార్గాన్ని అనుసరించి జీవితానికి సార్థకత ఏర్పరచుకోవాలని దివ్యోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు.

చెప్పడం మాత్రమే కాదు.. అనుసరించి చూపించారు. అందుకే వాసుదేవుడి బోధనలకు విలువ ఎక్కువ. ఈ రోజు శ్రీకృష్ణుణ్ని  పూజిస్తే సకల సౌభాగ్యాలు లభిస్తాయని నమ్ముతారు. అంతేకాదు.. సంతానం లేనివారు గోపాలున్ని పూజిస్తే సంతానప్రాప్తి  లభిస్తుందని విశ్వసిస్తారు.

కృష్ణాష్ట‌మి పూజా విధానం:
శ్రీకృష్ణుడు శ్రావ‌ణ మాసంలో వ‌చ్చే బ‌హుళ అష్ట‌మి రోజు  జ‌న్మించాడు. ఆ రోజునే మ‌నం కృష్ణాష్ట‌మిగా జ‌రుపుకుంటాం. మిగిలిన పూజ‌ల‌న్నీ ఉద‌య‌మే ప్రారంభ‌మైతే.. ఈ రోజు మాత్రం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ప్రారంభ‌మ‌వుతాయి. కృష్ణుడు అర్థ‌రాత్రి జ‌న్మించాడు. కాబట్టి కృష్ణాష్ట‌మి పూజ‌ను కూడా రాత్రి స‌మ‌యంలో చేసే ఆచారం కొన్నిచోట్ల ఉంది.  

కాబ‌ట్టి ఎలాంటి హడావుడి లేకుండా పూజ‌కు అవ‌స‌ర‌మైన‌వ‌న్నీ సిద్ధం చేసుకోవ‌చ్చు. ఆ రోజు ఉద‌యాన్నే నిద్ర‌లేచి అభ్యంగ‌న స్నానం చేసి, గుమ్మానికి మామిడి తోర‌ణాలు క‌ట్టి, గ‌డ‌ప‌ల‌కు ప‌సుపు  రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. బాలకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్న‌ట్లుగా కృష్ణ పాద ముద్ర‌లు వేయాలి.

జన్మాష్టమి రోజు మనం చిన్నికృష్ణుణ్ని ఆరాధిస్తాం. అంటే చిన్న పిల్లలకు ఒంటికి నూనె రాసి, నలుగు పెట్టి, స్నానం చేయించి, అలంకరించి ఎంత మురిపెంగా చూసుకుంటామో.. ఈ రోజు చిన్ని కృష్ణున్ని కూడా అలాగే ఆరాధించాలి. చిన్ని కృష్ణుడి విగ్రహానికి పంచామ పంచామృతాల‌తో ఆ త‌ర్వాత‌ గోరువెచ్చ‌ని నీటితో అభిషేకం చేయాలి. అనంత‌రం నూత‌న వ‌స్త్రాలు క‌ట్టి, ఆభ‌రణాలు అలంక‌రించాలి.

కృష్ణుడికి తుల‌సీ  ద‌ళాలంటే మ‌క్కువ. కాబ‌ట్టి తుల‌సిమాల‌ను మెడ‌లో వేయాలి. పూజ కోసం పొన్న పూల‌ను వినియోగించాలి. ప్రసాదాలను నైవేద్యంగా  సమర్పించాలి. ఆ త‌ర్వాత ఊయ‌లలో విగ్ర‌హాన్ని ఉంచి లాలి పాట పాడుతూ ఊయ‌ల‌ను ఊపాలి. ముత్త‌యిదువ‌ల‌ను పిలిచి వాయినాలివ్వాలి. ఆ తర్వాత కాసేపు గీతాపఠనం చేయాలి.

కృష్ణాష్ట‌మి వ్రతం విధి విధానాలు:
కృష్ణుడంటేనే బాల‌త‌త్వం. బాల కృష్ణుడు పుట్టిన కృష్ణాష్ట‌మి రోజు.. కృష్ణాష్ట‌మి వ్ర‌తం చేయ‌డం హిందూ సంప్ర‌దాయంలో ఉంది. సాధార‌ణంగా శ్రావణ మాసంలో వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం, మంగ‌ళ గౌరీ వ్ర‌తం ఎక్కువ‌గా చేస్తుంటారు. వాటితో స‌మాన‌మైన ప్రాధాన్యం కృష్ణాష్ట‌మి వ్ర‌తానికి సైతం ఉంది. అష్ట‌మీ తిథి రోహిణీ నక్షత్రం అర్థరాత్రి  స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఈ వ్ర‌తాన్ని చేస్తారు.

ఆ రోజు ప్ర‌తి త‌ల్లి త‌నను తాను య‌శోద‌గా భావించుకుని..  ప‌గ‌లంతా క‌టిక ఉప‌వాసం ఉండాలి. కృష్ణుడు ఇంట్లోకి వ‌స్తున్న‌ట్టుగా పాదముద్ర‌లు వేసుకోవాలి. అర్థ్ర‌రాత్రి వేళ కృష్ణుడు పుడుతున్నాడ‌నే స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ప్పుడు కాయం పంచిపెడ‌తారు. కాయం అంటే బాలింత‌ల‌కు  పెట్టే కారం. దీన్నే కొన్ని ప్రాంతాల్లో కట్టెకారం అని కూడా పిల్లుస్తారు. కాల్చిన శొంఠితో దీన్నిత‌యారు చేస్తారు. ఆ త‌ర్వాత ఆ కాయాన్నే కొంచెం  తింటారు.

ఆ రోజు వారికి అదే ఆహారం. మ‌రునాడు ఉద‌యం కృష్ణుడికి పూజ చేసిన త‌ర్వాత ప‌దిమందికీ భోజ‌నాలు పెట్టి  ఆ త‌ర్వాత భోజ‌నం చేస్తారు. అలాగే పిల్ల‌లు ఇష్టంగా తినే ఆహార ప‌దార్థాలైన జంతిక‌లు, చేగోడీలు, పాల‌ముంజెలు.. వంటివి యథాశ‌క్తి త‌యారు చేసి పిల్ల‌ల‌కు పంచిపెడతారు.

శ్రీకృష్ణాష్టమి నైవేద్యాలు:
కృష్ణుడికి వెన్న అంటే బాగా ఇష్టం. కాబట్టి కృష్ణాష్ట‌మి రోజు దాన్నే కృష్ణుడికి నైవేద్యంగా పెడ‌తారు. అయితే శాస్త్రం ప్ర‌కారం కృష్టాష్ట‌మి నాడు 102 ర‌కాల పిండి వంట‌లు చేయాలి. ఆరు ర‌కాల పానీయాలు త‌యారు చేసి నైవేద్యం పెట్టాలి. వాటిని ముందు మనం ఆర‌గించి ఇత‌రుల‌కు పంచిపెట్టాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, అటుకులు, శెనగపప్పు వంటి వాటిని కూడా నివేదన చేస్తారు.
అలాగే  శొంఠితో తయారుచేసిన కట్టెకారం, పంచదార కలిపిన మినప్పిండి కూడా ప్రసాదంగా పెడతారు. ఈ రెండూ బాలింతలకు పెట్టే ఆహారం కావడం గమనించదగిన విషయం. ఎందుకంటే శ్రీ‌కృష్ణుడు అప్పుడే జన్మించాడు. అంటే ఆయనకు జన్మనిచ్చిన దేవకీ దేవి, మాయకు జన్మనిచ్చిన యశోదా దేవి ఇద్దరూ బాలింతలే. కాబట్టి ఇలాంటి ఆహారం పెట్టడానికి వారే కారణమై ఉండచ్చు.

కృష్ణాష్ట‌మి రోజు ఇంట్లో కృష్ణ పాదాలు ఎందుకు వేస్తారు?

కృష్ణాష్ట‌మి పూజలో భాగంగా గుమ్మం దగ్గరి నుంచి.. పూజ మంటపం వరకు శ్రీ కృష్ణ పాదాలను వేస్తుంటారు. ఈ ప్రక్రియ భారతదేశమంతటా కనిపిస్తుంది. దీని కోసం ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని పాటిస్తారు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల పాద ముద్రలను కాగితంపై తీసుకుని.. దాన్ని కట్ చేస్తారు. ఇప్పుడు దీన్ని నేలపై ఉంచి చుట్టూ సుద్దతో గీసి తర్వాత సున్నంతో వేస్తారు. మరికొందరు చేత్తోనే పాద ముద్రలు వేస్తారు. ఇప్పుడైతే మార్కెట్లో పాదముద్రలు వేయడానికి వీలుగా మౌల్డ్స్ దొరుకుతున్నాయి.

అసలు ఇలా వేయడం వెనక ఉన్న అంతరార్థం ఏమిటి? నేలపై పాదముద్రలు వేసి వాటిని అలంకరించడం ద్వారా బాల కృష్ణుణ్ని ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి సుఖసంతోషాలు ప్రవేశిస్తాయని నమ్ముతారు. అలాగే పాదాలను బయట నుంచి లోపలికి వస్తున్నట్టుగా వేస్తారు. పూజా మందిరాన్ని మన అంతరంగంగా భావిస్తే.. కృష్ణ పాదాలు మన అంతరంగాన్ని తెలుసుకొనేలా చేసే దిక్సూచిగా చెబుతారు.

ఉట్టి కొట్టడం:
కృష్ణాష్ట‌మి స‌మ‌యంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా సంద‌డి క‌నిపిస్తుంది. ఆ రోజు ఉట్టి కొడ‌తారు. దీన్నే ఉత్త‌ర భార‌తంలో ‘ద‌హీ హండి’ అని పిలుస్తారు. ఇంటింటికీ వెళ్లి మ‌ట్టి కుండ‌లో పెరుగు, పాలు, చిల్ల‌ర‌డ‌బ్బులు సేక‌రించి దాన్ని ఉట్టిలో పెట్టి.. ఆ తర్వాత పొడ‌వైన తాడు క‌ట్టి లాగుతూ ఉంటారు. సాధారణంగా ఉట్టిని ఒకరు పైకి కిందకు లాగుతుంటే.. మరొకరు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకరి తర్వాత ఒకరు అలా ప్రయత్నిస్తూనే ఉంటారు.  ఒక్కరిగా కొట్టడం విఫలమైతే సమష్టిగా దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు.

చేయీ చేయీ కలిపి ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి  దాన్ని పగలగొడతారు. ఈ ప్రయత్నాన్ని చెడగొట్టడానికి ముఖాలపై వసంతం నీళ్లు పోస్తుంటారు. అయినా పట్టు వదలకుండా ఉట్టి కొడతారు. దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటంటే.. సమష్టిగా కృషి చేస్తే ఎంత‌టి అవ‌రోధాన్నైనా అధిగ‌మించ‌వ‌చ్చు. కృష్ణాష్ట‌మి రోజున ఉట్టి కొట్టడానికి ఉన్న మరో కారణం చిన్న‌త‌నంలో గోపాల కృష్ణుడు ఉట్టిపై దాచిన వెన్న కుండ‌ల‌ను ప‌గ‌ల‌గొట్టి.. దాన్ని గోప బాల‌కులకు పంచిపెట్టేవాడు. న‌లుగురితో పంచుకోవ‌డంలో ఉన్న ఆనంద‌మేమిటో లోకానికి చాటి చెప్పాడు. దాన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు.

No comments: