పంచభూత లింగాలు
పంచభూతాల ఆధారంగానే మనిషి జన్మ, మనుగడ సాధ్యం. అలాంటి పంచభూతాలలో పరమేశ్వరుని దర్శించుకునేలా దక్షిణ భారతంలో అయిదు శైవ క్షేత్రాలు వెలిశాయి. అవే....
కంచి (పృథ్వి లింగం)
శైవ క్షేత్రాలకు పెట్టింది పేరు తమిళనాడు. అందులోనూ కంచి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వందల సంవత్సరాలుగా కంచి ఓ ధార్మిక రాజధాని స్థాయిని అందుకొంది. అలాంటి కంచిలో సాక్షాత్తూ పార్వతీదేవి మట్టితో రూపొందించి పూజించుకున్న లింగమే పృథ్వి లింగం. ఒకానొక సమయంలో గంగమ్మతల్లి ఆమెను పరీక్షించేందుకు ఉరుకులుపరుగులు దీస్తూ లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట. అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని దానిని కాపాడుకుందనీ, అందుకు నిదర్శనగా అక్కడి లింగం మీద అమ్మవారి ఆభరణాలు గుర్తులు కనిపిస్తాయనీ చెబుతారు.
చిదంబరం (ఆకాశ లింగం)
చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. ఏదో మన తృప్తి కోసమూ, సౌలభ్యం కోసమూ భగవంతుని ఒకో రూపంలో పూజించుకుంటామే కానీ... అనంతమైన ఆయన తత్వానికి పరిమితులను గ్రహించడం అసాధ్యం కదా! అందుకనే ఇక్కడ ఆ పరమేశ్వరుని మూలవిగ్రహం ఉండాల్సిన చోట కేవలం ఖాళీస్థలం మాత్రమే ఉంటుంది. ఆ చిదంబర రహస్యాన్ని భక్తులు తమకు తోచిన రీతిలో అన్వయించుకుంటూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు నిరాకారునిగా దర్శనమిచ్చే ఈ క్షేత్రంలోనే ఆయన ఆనందతాండవం చేసే నటరాజస్వామిగా కొలువై ఉంటడం విశేషం.
అరుణాచలం (అగ్ని)
కొండ మీద వెలిసే దేవుని చూశాం కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం (తిరువణ్ణామలై). ఇక్కడి స్వామిని అణ్ణామలైగా పిలుచుకుంటారు. పవిత్రమైన ఆ అణ్ణామలై ఉన్న క్షేత్రమే తిరువణ్ణామలై! బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అన్న సంవాదాన్ని తీర్చేందుకు పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలసిన క్షేత్రమే ఈ అరుణాచలం. అగ్ని తత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎర్రటి (అరుణము) రంగులో కనిపిస్తుంది. ఆ కొండనే పరమేశ్వరునిగా భావించి దాని చుట్టూ గిరిప్రదక్షిణం చేస్తారు భక్తులు. ఇక కొండ దిగువున ఉన్న అణ్ణామలై ఆలయం దేశంలోని ఎత్తైన గోపురాలలో మూడవది. ఆ ఆలయానికి కూతవేటు దూరంలో రమణమహర్షి జీవనంతో పావనం అయిన రమణాశ్రమం గురించి చెప్పేదేముంది.
జంబుకేశ్వరం (నీరు)
తమిళనాట తిరుచ్చి పట్నానికి సమీపంలో ఈ జంబుకేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ ఒకప్పుడు జంబూవృక్షాలు (నేరేడు చెట్లు) ఎక్కువగా ఉండేవి కాబట్టి జంబుకేశ్వరం అన్న పేరు వచ్చిందట. మరో ఐతిహ్యం ప్రకారం శంభుడు అనే మహర్షి తపస్సుకి ప్రసన్నం అయిన శివుడు లింగరూపంలో వెలిశాడనీ... ఆయన ఎదురుగా శంభుడు, జంబూ వృక్షంగా నిలిచి కలకాలం శివుని చూస్తూ ఉండిపోయే వరాన్ని పొందాడని చెబుతారు. కావేరీ నదీ తీరంలో వెలిసిన జంబుకేశ్వరునిది జలతత్వం అనేందుకు తిరుగులేని సాక్ష్యంగా ఆయన పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది.
కాళహస్తి (వాయువు)
తెలుగువారి అదృష్టవశాన మన గడ్డ మీద వెలసిన పరమేశ్వరుడు ఆ శ్రీకాళహస్తశ్వరుడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. పూర్వం ఈ మూడు జీవాలూ ఆ పరమేశ్వరుని ఆరాధనలో తరించాయి కాబట్టి ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందంటారు. ఇక ఇక్కడి స్వామి కోసం తన రెండు కళ్లనూ పెకిలించుకున్న భక్త కన్నప్ప కథ అందరికీ తెలిసిందే. దక్షిణకాశిగా పేరొందిన ఈ క్షేత్రంలో రాహుకేతువులకు సంబంధించిన ఎలాంటి దోషమైనా పరిహారం అయిపోతుందని నమ్మకం. ఇక్కడి స్వామివారు వాయులింగం అనేందుకు నిదర్శనంగా, గర్భగుడిలో లింగం ముందర నిలిపిన జ్యోతి రెపరెపలాడుతూ కనిపిస్తుంది.
No comments:
Post a Comment