Adsense

Sunday, March 10, 2024

శ్రీకృష్ణదేవరాయల జన్మరహస్యం. The secret of the birth of Sri Krishna Devaraya

ప్రసిద్ధుడైన నరసింహదేవ మహారాజుగా ఆంధ్రదేశాన్ని పాలించి, కవీంద్రుల చేత ఎన్నెన్నో కావ్యాల్ని అంకితం పుచ్చుకున్న సాళ్వ నరసింహరాయల గురించి మీరందరూ వినే ఉంటారు. ఆ వృద్ధ ప్రభువుకు ఎంతకాలానికీ సంతానం కలుగలేదు.

అప్పుడే వారి మంత్రి చాలా ఆలోచన చేసి, జ్యోతిష్య శాస్త్రంలో నిష్ణాతుల్ని రప్పించి “దైవజ్ఞ శబ్దానికి సార్ధకత కలిగించగలిగిన మీవంటి మహనీయులతో ఒక పని పడింది. మీకు భూత భవిష్యత్ వర్తమానకాలాలు మూడూ తెలిసినవే కనుక - ప్రాచీన జ్యోతిష్యగ్రంథాన్ని పరిశీలించి, రాజుగారి జాతకానికి అనుగుణంగా ఉండే కాలగమనం అనుసరించి వారికి సంతానయోగం కలిగే మార్గం చెప్పండి" అన్నాడు.

అప్పుడా సిద్ధాంతులంతా ఆరుమాసాల వ్యవధి కోరారు. ఇళ్లకు వెళ్లి అంతవరకు తాము ఎన్నడూ తిరగేయని శాస్త్ర గ్రంథాలు సైతం తిరగేశారు. ఒక పురాతన జ్యోతిష్య గ్రంథంలో సంతాన జనన సూచక విషయం కనిపించింది.

దాని ప్రకారం - ఆ సంవత్సరం మాఘ బహుళ చతుర్దశీ భానువారం నాటి రాత్రి తులాలగ్నం రెండు ఘడియలు భుక్తి జరిగిన వెనుక ఆ గ్రామానికి ఉత్తరదిశగా రెండుకోసుల దూరంలో ఆకాశం నుండి ఒక నక్షత్రం భూమ్మీద పడుతుందని సిద్ధాంతులు గ్రహించారు. దానిని పుత్రోత్పత్తి కారణంగా తెలుసుకుని, ఆ నక్షత్రాన్ని ఒక కలశంలోని నీటిలోనికి పట్టి, జలాన్ని తీసుకుంటే పుత్రుడు జన్మిస్తాడని మంత్రిగారికి తెలిపారు.

మంత్రి ఆ స్థలంలో ఎత్తుగా ఒక మంచె కట్టించి, దానికి తగ్గ మెట్లు ఏర్పాటు చేసి, మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం చేసే శక్తి గల్గిన వృద్ధ పండితుని దానిమీదకు చేర్చడంతోపాటు పవిత్రోదకంతో నింపిన బంగారు కలశాన్ని అతని చేతికిచ్చారు. రాజు, మంత్రులు, సామంతులు, పౌరులు, గ్రామగ్రామాలవారు ఎందరో నక్షత్ర దర్శనానికి విచ్చేసి, రెప్పవాల్చకుండా ఆకాశం కేసి చూడసాగారు. ఆ సిద్ధాంతులు చెప్పిన వేళకు మిరుమిట్లు గొల్పుతూ ఒక నక్షత్రం బ్రాహ్మణుని చేతిలో ఉన్న కలశంలోనికి తళుకుమంటూ జారింది. మంత్రి ఎంతో సంతోషించి ప్రతిభను రాజుగారికి విన్నవించగా, నరసింహరాయలు ఆ దైవజ్ఞకు చాలా అగ్రహారాలు బహుమతిగా ఇచ్చాడు.

ఆ తర్వాత ఆ కలశంలోని నీటిని రాజు గ్రహించి, తన చిన్న భార్యను పడక సుఖం అందించవలసిందిగా కోరగా ఆమె కాన్పు వల్ల యవ్వనం జారిపోతుందని భయం చేత తనకు బదులుగా తన దాసిని తనలాగానే అలంకరించి ఆ ముసలి రాజును పంచించింది.

పవిత్రకలశోదకం ఆమెక్కూడా కొంత పోసి, నరసింహరాయలు ఆమెతో రతి సుఖం అనుభవించాడు. ఆ తర్వాత కొంతసేపటికప్పుడో, ఆమె దాసీ అని తెలుసుకుని, ఆమెను చంపబోతూ, ఎందుకైనా మంచిదని మంత్రికి కబురు చేశాడు.

అంత అర్ధరాత్రి ప్రభువు కబురు పెట్టాడంటే ఏదో అవాంతరం వచ్చి ఉంటుందని, ఆదరా బాదరాగా వచ్చిన మంత్రి రాజు కోపం చూసి - అతని చేతిలో కత్తి లాగి పారేసి "దేవా! ఆగు! ఎందుకింత సాహసం తలపెట్టావు? ఈమె చేసిన తప్పేమిటి?" అని అడిగాడు. నరసింహరాయల జరిగిందంతా చెప్పి "నీ అభిప్రాయమేమిటి?" అడిగాడు.

అప్పుడా బుద్ధి కుశలుడైన మంత్రి "ప్రభూ! ఈ నేరాన్ని ఈమె కావాలని చేసిందా? ముసలి భర్తతో కులకడానికి వైముఖ్యం చూపిన చిన్నరాణి దగ్గరే ఉంది తప్పు! బాల్యచాపల్యం వల్ల ఆమె అలా ప్రవర్తించిందేమో! ఇక జరిగిపోయినదానికి విచారించి ప్రయోజనం లేదు. ఎంతో ప్రయత్నించి సాధించిన దాన్ని ఊరకే చెడగొట్టుకోవడం వివేకవంతుల లక్షణం కాదు! క్షేత్రం ఏదయినా బీజం ప్రధానం అన్నారు. దైవసంకల్పం ఇలా ఉంటే మార్చడం మన తరమా? పుత్రులలో ఔరసుడు - క్షేత్రజ్ఞుడు ముఖ్యులు. దీనికి పుట్టేవాడు ఔరసుడనబడతాడు.

ధర్మశాస్త్రరీత్యా అతడ్ని మీరు పుత్రుడిగా పరిగ్రహించవచ్చు! కనుక, ఈ సంగతి రెండో కంటికి తెలీకుండా, అంతః పుర సరిహద్దులు దాటకుండా, ఈమెక్కూడా రాణి హోదా కల్పించండి! అది అన్ని విధాలా శ్రేయస్కరం" అని బోధపరిచేసరికి, స్త్రీ హత్య మహాపాతకమనీ - అందునా తనకు రతి సుఖం కలిగించిన స్త్రీని వధించడం ఇంకా పాపం అనీ నరసింహరాయలు ఆ ప్రయత్నాన్ని అంతటితో విరమించుకున్నాడు.

మంత్రి ఇంటికెళ్లేసరికి తెల్లతెల్లవారుతోంది. అప్పటికే అంతఃపుర జనులు రాచనగరి వీధుల్లో గుసగుసలాడు కుంటున్నారు. అయినా అదేమీ పట్టించుకోకుండానే ఇల్లు చేరుకున్నాడు. భార్య ఎదురొచ్చి "రాజుగారు అర్ధరాత్రి పూట కబురు చేశారేం? విశేషమేమిటి?" అని ప్రశ్నించింది.

“రాచకార్యపు తొందర” అన్నాడు మంత్రి పూర్తి నిజం చెప్పడం ఇష్టంలేక. అందుకామె నర్మగర్భంగా నవ్వి "మీరు చెప్పకపోయినా కొంతవరకూ తెలుసులెండి! చిన్నరాణీగారు ప్రభువులను వంచించి, దాసీ దాన్ని అలంకరించి రాజుగారికి పడకసుఖం అందించి రమ్మని పంపిందట కదా! ఇక ఈ రాజ్యానికి దాసీపుత్రుడు వారసుడు కాబోతున్నాడన్న మాట!" అంది.

మంత్రి చాలా ఆశ్చర్యపోయి "ఆహా! లోకం ఎంతటిది? నాకంటే ముందే ఈ వార్త రాణివాసమంతటికీ తెలిసిపోయిందే!" అనుకున్నాడు. ఐతే ఈ విషయం మాత్రం ప్రభువులవారికి చేరకుండా జాగ్రత్తపడ్డాడు.

ఆ దాసికి పుట్టిన శ్రీకృష్ణదేవరాయలే హంపీ విజయనగరాన్ని పరిపాలించాడు. అష్టదిగ్గజాలనే ఘనకీర్తి పొందిన మహాకవుల కృతులు అంకితం పుచ్చుకోగలిగిన ఘనుడా ప్రభువు. ఇదీ శ్రీకృష్ణదేవరాయల యొక్క జన్మరహస్యం.

No comments: