Adsense

Monday, September 2, 2024

ముక్తినిచ్చే క్షేత్రాలు

ముక్తినిచ్చే క్షేత్రాలు
                
*'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికాపురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః'*

*ఈ శ్లోకం అర్థం: అయోధ్యా, మధుర, మాయ (హరిద్వార్), కాశీ, కాంచీపురం, అవంతిక (ఉజ్జయిని), ద్వారక ... ఈ ఏడు ముక్తినిచ్చే స్థలాలు (నగరాలు). ఈ ఏడు ముక్తి క్షేత్రాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం…*

*1) అయోధ్య:-* అయోధ్య అంటే శత్రువులు చొరబడటానికి వీలులేని సురక్షిత స్థానం అని అర్థం. ఇది మానవోత్తముడు, మర్యాదపురుషోత్తముడూ అయిన శ్రీరాముడి జన్మభూమి. సరయూ నదీతీరంలో వెలసిన ఈ మోక్షధామం దర్శనమాత్రంగా జన్మను చరితార్థం చేస్తుందంటారు.

*2) మధుర:-* మధుర అంటే తీయనైన అని అర్థం. పూర్ణావతార పురుషుడైన శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్రస్థానం.

*3) మాయ:-* దీనినే హరిద్వార్‌ అని పిలుస్తారు. విష్ణువు సన్నిధికి చేర్చే ముఖద్వారం ఈ పుణ్యస్థలం. హిమవత్పర్వతాల నుంచి ప్రవహించే గంగానది మొట్టమొదట నేలపై అడుగుమోపే విశిష్ట పుణ్యక్షేత్రం ఈ మాయానగరం.

*4) కాశీ:-* భూలోక కైలాసంగా ప్రసిద్ధి చెందిన         ఈ పుణ్యక్షేత్రం పవిత్ర గంగానదీ తీరంలో వెలసిన పరమ శివసన్నిధానం. వరుణ, అసి అనే రెండు నదులు ఇక్కడే గంగా నదిలో సంగమించడం వల్ల ఈ పట్టణానికి *‘వారణాసి’* అని కూడా పేరు.

*5) కాంచీపురం:-* దక్షిణ భారతంలోని పవిత్ర నగరం ఇది. కంచి, కాంచీపురం, కాంజీపురం అనే పేర్లతో అలరారే ఈ పుణ్యధామం *శివుడికి, విష్ణువుకు, శక్తికి* నెలవు. అద్వైత తత్త్వాన్ని ప్రవచించిన ఆదిశంకరులు స్థాపించిన కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మోక్షం సంప్రాప్తిస్తుందని ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్న విశ్వాసం.

*6) అవంతిక:-* భారత భూమిలోని మధ్యప్రదేశంలో విరాజిల్లే *‘ఉజ్జయినీ’ నగరానికే ‘అవంతిక‘* అని ప్రాచీననామం. శిప్రా నదీతీరంలో వెలుగొందే ఈ పట్టణం మహాకాళనాథుడైన శివుడికి నిలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఈ నగరాన్ని గురించి మహాకవి కాళిదాసు ఎంతో అద్భుతంగా వర్ణించాడు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి.

*7) ద్వారవతి:-* అంటే *‘ద్వారకానగరం.’* శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పునీతమైన దివ్యధామం ఇది. కృష్ణుడు నివసించిన ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. తీరంలో నూతనంగా నిర్మించిన ఆధునిక ద్వారకానగరం *ద్వారకానాథ్‌గా* ప్రసిద్ధం. ఇక్కడ ద్వారకాధీశుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలోకి స్వర్గద్వారం ద్వారా ప్రవేశించిన భక్తులు మోక్షద్వారం ద్వారా వెలుపలికి వస్తారు. ఈ కారణంగా ఇది ముక్తిదాయక నగరంగా ప్రసిద్ధి చెందింది.
                   
         *లోకాహ్ సమస్తా సుఖినోభవన్తు!*

No comments: