Adsense

Monday, September 23, 2024

దేవాలయాల ముందు ధ్వజస్తంభాలు ఎందుకు ఉంటాయో తెలుసా?


అశ్వమేధ యాగం సంధర్బంగా తామ్రధ్వజునితో పోరాడుతున్న అర్జునుడి కథాసారం నుంచి..
మణిపుర పాలకుడు,
మయూర ధ్వజుడు. వీరు మహా పరాక్రమవంతుడు, గొప్ప దానశీలి. . మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు.

మయూర ధ్వజుడు  పాండవుల యాగాశ్వమును బంధిస్తాడు. ఆగ్రహించిన పాండు కుమారులు   అర్జునుడు భీముడు సహదేవుడు  మయూర ధ్వజనితో యుద్ధానికి దిగుతారు.తనతో యుద్ధం చేసిన నకుల సహదేవ భీమార్జునుల్ని మయూరధ్వజుడు  ఓడిస్తాడు. పట్టు వదలని పాండు కుమారులు  ఆగ్రహోదగృలై ఉంటారు

తన తమ్ముళ్ళు ఓడిపోయిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా మణిపురం వైపు బయలుదేరతాడు. అది గ్రహించిన కృష్ణుడు ధర్మరాజును వారిస్తాడు. మయూరధ్వజుణ్ణి జయించేందుకు ఒక కపటోపాయాన్ని చెబుతాడు.

పన్నాగం ప్రకారం   శ్రీకృష్ణుడు, ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుకుంటారు.. అతిథులను  చూసిన మయూరధ్వజుడు వారికి ఆహ్వానం పలికి ,  దానం ఇవ్వదలచి,  ఏమి కావాలో కోరుకో మంటాడు.

అందుకు శ్రీకృష్ణుడు కల్పించుకుంటూ  " మహారాజా! మేము తమరి దర్శనార్ధమై బయలుదేరి వస్తుంటే.... అరణ్య మార్గంలో   ఒక మృగరాజు దురదృష్టవశాత్తు
ఇతడి కుమారుడిపై  దాడి  చేసింది.  ఈ హఠాత్పరిణామానికి  మేము మిక్కిలి చింతిస్తూ.... అన్యం పుణ్యం ఎరుగని  బాలుడిని విడిచిపెట్టవలసిందని మృగరాజును ప్రార్థించాము. అప్పుడా మృగరాజు  విచిత్రంగా మానవ భాషలో  మాట్లాడుతూ.... " ఈ బాలుడు  మీకు దక్కాలంటే  మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా  ఇప్పించండి " అని కోరుకుంది . దానకర్ణులైన  ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరమున సగభాగం దానమిచ్చిన  యెడల  ఆ పసి బాలుడిని .... భవిష్యత్తు ఉన్న బాలుడిని కాపాడుకున్న వారిని అవుతాము... " అని హృద్యంగా  చెప్పుకుపోయాడు .

ఆ మాటలు విని మయూరధ్వజుడు  ఏ మాత్రం వెనక ముందు ఆలోచించనివాడై  తన శరీరాన్ని బాలుడి ప్రాణాల్ని రక్షించడం  కోసం   దానం ఇచ్చేందుకు ఒప్పుకుంటాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు... " తమరి భార్యాపుత్రులే మీ శరీరాన్ని  స్వయంగా కోసి ఇవ్వాల్సింది " అనే నియమాన్ని కూడా విధిస్తాడు. అందుకు కూడా మయూరి ధ్వజుడు వెనకడుగు వేయకుండా, అతిథిదేవోభవ  అని గౌరవిస్తూ,  తన శరీరాన్ని తన భార్య సుతులే స్వయంగా ఖండించేందుకు తగిన ఏర్పాట్లు చేయించి, భార్యాసుతుల్ని రప్పించి , త్యాగానికి సిద్ధమై కూర్చుంటాడు . మయూరధ్వజుడి  భార్య పిల్లలు  గుండె నిబ్బరం చేసుకుని ఆదేశించిన కార్యానికి  కుడి దిశ  నుండి సిద్ధమవుతారు.

దానధర్మాలో గొప్పవాడైన ధర్మరాజు, మయూరధ్వజుని దాన గుణానికి   నివ్వెర పోతాడు.
ఇంతలో మయూరధ్వజుని ఎడమ కన్ను నుంచి నీరు రావటం  ధర్మరాజు గమనిస్తాడు . అందుకు వెంటనే స్పందిస్తూ....
"తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు " అంటాడు
అందుకు మయూరధ్వజుడు  కూడా వెంటనే స్పందిస్తూ  .....
" మహత్మా ! తమరు పొరబడుతున్నారు.  నేను చింతిస్తూ బాధపడుతూ  వేదన చెందుతూ  నా శరీరాన్ని  మీకు దానంగా ఇవ్వడం లేదు . నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది. ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ నేత్రం మిగుల బాధపడుతున్నది " అంటూ వివరిస్తాడు.

అది విని కృష్ణుడు, ధర్మరాజు,  మిక్కిలి ఆశ్చర్యపోతారు. మయూరధ్వజుని దానశీలతకు
ఉప్పొంగి పోతారు. వెంటనే తమ నిజరూపాన్ని ప్రదర్శిస్తారు.
" నీ దానశీలతకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో " అంటూ మయూరిధ్వజుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.
మహానుభావుల నిజరూపాలు చూసి  మయూరధ్వజుడు వుక్కిరిబిక్కిరవుతూ
"పరమాత్మా! నా ఈ శరీరం అశాశ్వతమైనది.. కార్యక్రమం లో ఈ శరీరం  నశించినా,   నా ఆత్మ పరోపకారార్ధం ఉపయోగపడేలా.... నిత్యం మీ ముందుండేలా....దీవించండి" అని హస్తాలతో  ముకులళిత కోరుకుంటాడు . అందుకు శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తూ  ....

" మయూరధ్వజా!  తథాస్తు! నేటి నుండే భూలోకంలో  ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజ స్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ చీరంజీవియై....నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది.
పరోపకారార్థం నీవు ప్రకాశిస్తావు....
ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మసఫలం అవుతుంది.  నీ శిరస్సున వుంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపుతుంది..... " అంటూ అనుగ్రహిస్తాడు.

అందుకే ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజ స్తంభాలు విధిగా ప్రతిష్టించడం ఆచారమయింది.

* AI Generated Picture.

No comments: