Adsense

Sunday, October 20, 2024

మహాభారతం ప్రకారం సనాతన ధర్మం అంటేఅశ్వమేధీక పర్వం అధ్యాయము 18

మహాభారతం ప్రకారం సనాతన ధర్మం అంటే
అశ్వమేధీక పర్వం అధ్యాయము 18

 శుక్రం శోణితసంసృష్టం స్త్రీయా గర్భాశయం గతమ్ |
క్షేత్రం కర్మజమాప్నోతి శుభం వా యది వాశుభమ్ ॥

జీవుడు మొదట పురుషుని వీర్యంలో ప్రవేశిస్తాడు. తరువాత గర్భాశయంలో రజస్సుతో కలుస్తాడు. తరువాత ఆతని పాపపుణ్యాలకు తగిన శరీరం ధరిస్తాడు.

సాక్ష్మ్యాదవ్యక్తభావాచ్చ న చ క్వచన సజ్జతి।
సంప్రాప్య బ్రాహ్మణః కామం తస్మాత్ తద్ బ్రహ్మ శాశ్వతమ్

జీవుడు తన ఇచ్ఛానుసారం ఆ గర్భంలో ప్రవేశించి, సూక్ష్ముడు, అవ్యక్తస్వరూపుడు కావటం వల్ల ఎక్కడా ఆసక్తుడు కాడు, అతడు సనాతన పరబ్రహ్మమే కావటం అందుకు కారణం.

తద్ బీజం సర్వభూతానాం తన జీవంతి జంతవః ॥
స జీవః సర్వగాత్రాణి గర్భస్యావిశ్య భాగశః ॥ 7
దధాతి చేతసా సద్యః ప్రాణస్థానేష్వవస్థితః।
తతః స్పందయతే గాని స గర్భ శ్చేతనాన్వితః ॥ 8

ఆ జీవుడే సర్వప్రాణులకు బీజం అవుతాడు. ఆతని వలననే సర్వప్రాణులు బ్రతుకుతుంటాయి. ఆ జీవుడు సమస్త అంగాల్లో ప్రవేశించగానే వాటి ప్రతి ఒక్క అంశంలో చేతన కలిగిస్తాడు. అతడే ప్రాణాలు స్థానంలో-వక్షః స్థలం లోనే ఉండి సమస్తావయవాలను కదిలిస్తాడు. అప్పుడే గర్భం చైతన్య వంతం అవుతుంది.

యద్ యచ్చ కర్మ శుభం వా యది వాశుభమ్ |
పూర్వదేహకృతం సర్వమ్ అవశ్యముపభుజ్యతే II

త జీవుడు వెనుకటి దేహంతో చేసిన పుణ్యం గాని, పాపం  గాని సమస్తమూ తప్పక అనుభవిస్తాడు.

తతస్తు క్షీయతే చైవ పునశ్చన్యత్ ప్రచీయతే |
యావత్ తన్మోక్షయోగస్థం ధర్మం నైవావబుధ్యతే ॥

అనుభవించటం చేత వెనుకటి కర్మ నశిస్తుంది. మళ్ళీ క్రొత్త క్రొత్త కర్మలను పోగుచేసుకొంటాడు. మోక్షప్రాప్తికి సహాయకరమయిన ధర్మం తెలియనంతవరకు ఆ కర్మ పరంపర నశించదు.

తత్ర కర్మ ప్రవక్ష్యామి సుఖీ భవతి యేన వై ॥
ఆవర్తమానో జాతీషు యథాన్యోన్యాసు సత్తమ ||

సాధుశ్రేష్ఠా! ఈ రీతిగా భిన్నభిన్నమయిన యోనులలో భ్రమించే జీవుడు ఎలాంటి కర్మలు చేస్తే సుఖపడతాడో చెపుతాను. (14)

దానం వ్రతం బ్రహ్మచర్యం యథోక్తం బ్రహ్మధారణమ్ |
దమః ప్రశాంతతా చైవ భూతానాం చానుకంపనమ్ ॥
సంయమాశ్చానృశంస్యం చ పరస్వాదానవర్జనమ్ |
వ్యలీకానామకరణం భూతానాం మనసా భువి ||
మాతాపిత్రోశ్చ శుశ్రూషా దేవతాతిథిపూజనమ్।
గురుపూజా ఘృణా శౌచం నిత్యమింద్రియసంయమః
ప్రవర్తనం శుభానాం చ తత్ సతాం వృత్తముచ్యతే |
తతో ధర్మః ప్రభవతి యః ప్రజాః పాతి శాశ్వతీః ॥

దానం చేయటం, వ్రతాచరణం, యథావిధిగా వేదాధ్యయనం, ఇంద్రియ నిగ్రహం, శాంతి, సర్వప్రాణులయందు దయ, మనోనిగ్రహం, మృదుస్వభావం, ఇతరుల సొత్తు తీసుకోకపోవటం, లోకంలోని ప్రాణులకు మనస్సుతో గూడా కీడు చేయకుండటం, తల్లిదండ్రుల సేవ, దేవతలను అతిథులను పూజించటం, గురువులను గౌరవించటం, కనికరం, పవిత్రత, నిత్యమూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవటం, మంచి విషయాలను ప్రచారం చేయటం అనేవి సత్పురుషుల ప్రవర్తన అని చెపుతారు. వీటిని అనుష్ఠించటం వల్లనే ధర్మం ఏర్పడుతుంది. అలాంటి ధర్మాత్ముడే చిరకాలం ప్రజలను రక్షిస్తాడు. 

ఏవం సత్సు సదా పశ్యేత్ తత్రాప్యేషా ధ్రువా స్థితిః।
ఆచారో ధర్మమాచష్టే యస్మిన్శాంతా వ్యవస్థితాః ॥

సత్పురుషులలో ఇలాంటి ధర్మాచరణం ఎల్లప్పుడు
కన్పిస్తుంది. వారిలోనే ధర్మం నిశ్చలంగా ఉంటుంది. సదాచారమే ధర్మాన్ని తెలుపుతుంది. శాంతచిత్తు అయిన మహాత్ములు ఎల్లవేళలా సదాచారం పాటిస్తుంటారు.


తేషు తత్ కర్మ నిక్షిప్తం యః స ధర్మః సనాతనః।
యస్తం సమభిపద్యేత న స దుర్గతిమాప్నుయాత్ ॥

వారియందే వెనక చెప్పిన ధర్మాదులు ఉన్నాయి. ఆ కర్మలే సనాతన ధర్మం అనే పేరుతో ప్రసిద్దాలు. ఆ ధర్మాన్ని ఆచరించేవాడు దుర్గతి పాలు కాడు.

అతో నియమ్యతే లోకః ప్రచ్యవన్ ధర్మవర్త్మను
యశ్చ యోగీ చ ముక్తశ్చ స ఏతేభ్యో విశిష్యతే ॥

కాబట్టే ధర్మమార్గం నుంచి భ్రష్టులు కాకుండా
నియంత్రణం ఉంటుంది. యోగి అయినవాడు, ముక్తుడు, వీరికంటే శ్రేష్ఠుడు.

వర్తమానస్య ధర్మేణ శుభం యత్ర యథా తథా
సంసారతారణం హ్యస్య కాలేన మహతా భవేత్ ॥

ధర్మానుసారం ప్రవర్తించేవాడు ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ఆతనికి అతని కర్మానుసారం ఉత్తమ ఫలం ప్రాప్తిస్తుంది. అతడు మెల్లమెల్లగా చాలాకాలం తరువాత
సంసార సాగరాన్ని దాటుతాడు.

No comments: