Adsense

Friday, December 13, 2024

వల్లెవాటు అంటే

వల్లెవాటు అంటే కొన్ని కోస్తా జిల్లాలలో, హిందూ పెళ్ళికూతురు మధుపర్కంతో పాటు విడిగా వేసుకొనే ఒక ఉత్తరీయం. వల్లెవాటును ఎడమ భుజం పైనుంచి కాక రెండు భుజాలపైనుంచి తీసి, ముందు X ఆకారం వచ్చేలాగ వేసుకొంటారు. ఈ సంప్రదాయం గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కువ కనబడుతుంది. సాధారణంగా వల్లెవాటు మధుపర్కం చీరలాగే ఎర్రటి అంచుతో ఉండే తెల్లటి వస్త్రం. పెళ్ళిబట్టలు అమ్మే దుకాణాలలో వల్లెవాటును మధుపర్కంతో పాటు కలిపి అమ్ముతారు. కొన్ని కుటుంబాలలో పెళ్ళికూతురు తల్లికూడా కన్యాదాన సమయంలో వల్లెవాటు వేసుకొంటుంది.

వల్లెవాటు, మధుపర్కాలలో గాయని గీతామాధురి. © Sumuhurtham Photography

ప్రపంచం చిన్నదయిపోయి, రకరకాల సంస్కృతుల సమ్మేళనం ఎప్పుడూ ఊహించనంత త్వరగా జరిగిపోతున్న ఈరోజుల్లో, పదేళ్ళక్రితం లేని ఎన్నో సంప్రదాయాలు పెళ్ళితంతులో వచ్చి చేరుతున్నాయి, కొన్ని పెళ్ళితంతులోంచి తొలగిపోతున్నాయి. ఇప్పుడు అన్ని తెలుగు పెళ్ళిళ్ళలోనూ సంగీత్, మెహందీ పేరుతో పెళ్ళికి ముందురోజు ఒక వేడుక జరుగుతోంది.

"పెళ్ళి, దాని పుట్టు పూర్వోత్తరాలు" పుస్తకం ముందుమాటలో తాపీ ధర్మారావుగారు అన్నట్లు దేశకాల పరిస్థితులని బట్టి ఇరుగుపొరుగు జాతులవారి ఆచారాలు అనుకరించడం, అవలంబించడం అన్ని సమాజాల్లో జరుగుతుంది. పెళ్ళికి సంబంధించిన అనేక ఆచారాలు అంచెలంచెలుగా (తరతరాలుగా) పరిణామం చెందుతూ వచ్చాయి. ఈ పరిణామ క్రమంలో కింద అంచెలలో (పాత తరాలలో) చాలా ప్రధానంగా ఉన్న అలవాట్లు, ఆచారాలు పై అంచెలలో కూడా జరిపినా, అవి క్రమంగా వాటి ప్రాధాన్యతను పోగొట్టుకొని, అర్థరహితమైన లాంఛనాలుగా మిగిలిపోతాయి. మంగళసూత్రం ధరించే ఆచారం కూడా ఆవులను బంధిచడానికి వాడే గళసూత్రం అవశేషమే అని తాపీ ధర్మారావుగారు అంటారు. తెలుగువారిలో కొందరి వివాహ సంప్రదాయంలో పెళ్ళికూతురు నడుముకు పలుపుతాడువంటి తాడు కడతారు. "వల్లె" అన్న పదానికి అర్థం "పశువులను బంధించే తాడు", "వాటు" అంటే "విధం". వల్లెవాటు ఆచారానికి మూలం సుస్పష్టమే కదా!

No comments: