Adsense

Thursday, December 26, 2024

ధనుష్కోటి దేశంలోనే అత్యంత భయంకరమైన గ్రామంగా ఎందుకు పరిగణించబడుతుంది?

ధనుష్కోడి.. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే రామ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జ్‌ ఈ గ్రామంలోనే ఉంది. దనుష్కోడికి చేరాలంటే 2016 వరకు సముద్రంలోనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. పర్యాటకులు, జాలర్లు సముద్రం ఆటుపోటులు చూసుకుని బస్సుల్లో, జీపుల్లో చేరుకొనేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల రోడ్డు మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఉత్తరాన్న హిమాలయాలతో మొదలుకుని.. దక్షిణాన్న సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రెండు సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే.. ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని బాధపడతారు కూడా. ఎందుకంటే.. ఇండియాలోనే చిట్టచివరి గ్రామమైన ఈ ప్రాంత చరిత్ర విషాదంతో ముడిపడి ఉంది.

రామేశ్వరానికి రైలు లేదా బస్సులో చేరుకోవచ్చు. లేదా మధురైలో విమానం దిగి రామేశ్వరం మీదుగా దనుష్కోడికి వెళ్లేందుకు ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. రాత్రి వేళ్లలో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ప్రమాదకరం. వర్షాకాలం, తుఫాన్ల సమయంలో ఈ ప్రాంతం భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో రెండు సముద్రాలు ఉంటాయి. అవి రెండు ఒకే చోట కలుస్తాయి. ఫలితంగా అక్కడ విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో బంగాళాఖాతం నిశబ్దంగా ఉంటే.. హిందూ మహా సముద్రం అలలతో ఎగసిపడుతూ కనిపిస్తుంది. . ఈ రెండు సముద్రాల్లో ఎక్కడ తుఫాన్ ఏర్పడినా.. ఈ ప్రాంతం మునిగిపోతుంది.

శ్రీలంకకు 18 మైళ్ల దూరంలోనే: ఈ ప్రాంతానికి 18 మైళ్ల దూరంలోనే శ్రీలంకలోని తలైమన్నార్ పోర్టు ఉండేది. అక్కడికి చేరుకోవడం కోసం చెన్నై నుంచి పంబన్ దీవి వరకు రైల్లో ప్రయాణించి, అక్కడి నుంచి ఓడల్లో శ్రీలంక చేరుకునేవారు. అయితే, 1964 తర్వాత ఆ మార్గం ధ్వంసమైంది. 1982లో శ్రీలంకలో అంతర్యుద్ధం వల్ల ఓడల రవాణా సేవలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికీ అక్కడ రైల్వే స్టేషన్ గోడలు, చర్చి తదితర శిథిల భవనాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ సారి రామేశ్వరం వెళ్లినప్పుడు తప్పకుండా ఈ చిట్టచివరి గ్రామాన్ని సందర్శించండి (సేకరణ)

No comments: