మనకు బజారు లో దొరికే ఆన్నివ్యాపార వస్తువుల పైన రెండు రకాల కోడ్ లు కనిపిస్తాయి. మొదటిది బార్ కోడ్. ఒక యంత్రం చదవగల కోడ్ ఇది. దీన్ని ఏకమితీయ కోడ్ గా భావిస్తారు (1D – వన్ డైమెన్షనల్) .వీటిలో చాలా రకాలు ఉన్నాయి. సమాంతర నలుపు తెలుపు గీతల సమాహారమే ఈ కోడ్. వీటిని కామన్ ప్రోడక్ట్ కోడ్ అని అంటారు. ఇందులో కొన్ని సంఖ్యలు,అక్షరాలూ అలాగే నలుపు తెలుపు గీతాల మధ్య మారే దూరం వల్ల ఈ కోడ్ రూపొందుతుంది. అది ఇలా ఉంటుంది….
ఇక రెండోది మీరడిగిన QR కోడ్.ఇందులో QR అంటే క్విక్ రెస్పాన్స్ (Quick Response) అంటే శీఘ్ర ప్రతిస్పందన సంకేతం అందామా. కాబట్టి ఈ శీ.ప్ర .సం. గురించి కొంచెం తెలుసుకుందాం.
1994 లో టొయోట కార్ల ఫేక్టరీ కి అనుబంధ సంస్థ అయిన “డెన్సోవేవ్ “(Denso wave ) కి ఒక క్లిష్టమైన పని అప్పచెప్పారు. అదేమిటంటే వాహనాల తయారీ స్వయంచాలిత తయారీ వ్యవస్థలో ఉన్న వాహనాల,విడిభాగాల ను ఆచూకీ తీసే సులభ పద్దతి ,త్వరిత విధానం కనుక్కోవడం. ఇలా మొదలైన ఈ శీ.ప్ర .సం. ఇప్పుడు వెబ్ సైట్ లలోకి వెళ్లేందుకు దారి చూపేలా, మొబైలు ద్వారా చెల్లింపులు ,ఇంకా విమాన,రైలు,బస్సు ప్రయాణ టికట్ లకూ ,ఇక వినియోగ దారుల వస్తువులు అన్నిటి పైనా తప్పనిదై పోయింది. 2000 సం. లో జపాన్ లో బాగా ప్రాచుర్యం లోకి వచ్చి, 2002 కి ప్రపంచం అంతా పాకేసింది. డెన్సోవేవ్ కి హక్కులు ఉన్నప్పటికీ ఇది అందరికీ ఉచితం గానే ( కొన్ని షరతులకు లోబడి) అందుబాటులో ఉంది. దీన్ని వాడటం చాలా సులభం . మన మొబైలు కున్న స్కాన్ చేసే ఆప్ తో దీన్ని కేమేరా ద్వారా స్కాన్ చేస్తే, అది మనకు కావలసిన చోటికి ,తీసుకుని వెళ్లడమో లేదా, అప్పగించిన పని ఏదైనా చేసిపెడుతుంది. ఇంతేనా, వాట్స్ అప్ మన కంప్యుటర్ లో చూడాలంటే ఇలాంటి కోడ్ మనం వాడాల్సిందే.
ఇంతకీ ఏముంటాయి ఇందులో. 21 x 21 మాడ్యుల్స్ తో మొదలైన, ఈ శీ.ప్ర .సం ఇప్పుడు 177 x 177 మాడ్యుల్స్ దాకా పెరిగింది. మొదట్లో నాలుగు గుర్తుల సమాచారం ఇప్పుడు 4296 సంఖ్య వరకు ఎదిగింది (characters of ASCII).
ప్రధానంగా నలుపు తెలుపు చదరాల తో ఉండే ఈ శీ.ప్ర .సం, ని ద్విమితీయ కోడ్ (2D) గా వర్గీకరిస్తారు.
ప్రధానంగా దీనిలో నాలుగు భాగాలు ఉంటాయి.
1.స్థాన చిహ్నం : (position marking)
కోడ్ ఏ దిశలో చదవాలి అనేది ఈ చిహ్నం నిర్ణయిస్తుంది.పైన చిత్రం లో నారింజ రంగు చదరాలు మూదిటిని కలిపి ఒక కోణం ని ఏర్పరుచుకుని ఈ పని స్కేనర్ చేస్తుంది.
2.అమరిక చిహ్నం :(alignment marking)
మొబైల్ కెమరా ఏ కోణం నుండి స్కాన్ చేసినా అది సవ్య దిశలో చూపేలా ఈ చిహ్నం తోడ్పడుతుంది.
3.టైమింగ్ ఆకృతి :(timing pattern )
నిక్షిప్తమైన సమాచారమాతృక (data matrix) ని తప్పులు లేకుండా అంచనా వేయడానికి సహకరిస్తుంది.
4. నిశ్చల మండలం: (quiet zone)
ఇదొక రకంగా శీ.ప్ర .సంకేతానికి గుండెకాయ వంటిది. కోడ్ ఉన్న ప్రాంతం,లేని ప్రాంతం నడుమ సరిహద్దు లాంటిది ఈ ప్రదేశం.
మళ్ళీ ఇందులో క్రియాశీల ,నిష్క్రియా శీల అని ,రెండురకాల కోడ్ లు ఉన్నాయండి. మొదటి దానిలో, ఒకసారి చేసిన దానిలో మార్పులు ఎప్పుడైనా చేసుకుంటూ ఉండవచ్చు. అదే రెండో దానిలో ఒక సారి చేసి వేస్తె ,ఇక మార్చలేము.
ఉపయోగాలు: ఇవి బోలెడు అందులో కొన్ని మాత్రమె రాయగలం.ఎందుకంటే ఇది సర్వత్రా వ్యాపించిన విరాట్ స్వరూపం అయ్యి కూర్చొంది మరి.
లగేజ్ టేగులు,అడ్రెస్సులు,మొబైల్ చెల్లింపులు,హోటల్ లో వైఫై షేరింగ్ ,ఫోన్ నం .,ఈమెయిలు, ప్రత్యెక వెబ్సైట్ లు, సరుకుల వివరాలు,అడ్వర్టైజ్మెంట్లు,వస్తువు టో పాటు అమ్మే షావు వివరాలు...ఇలా ఎన్నో ఉన్నాయండి.
**నెట్ చిత్రాలు వాడటం జరిగింది **
(సేకరణ)
No comments:
Post a Comment