146 ఏళ్ళు జీవించిన సిక్కా నిజాముల్‌ముల్క్ బహదూర్ అసఫ్జా ఎవరో సుదీర్ఘకాలం జీవించిన నవాబో, నవాబు కుటుంబ సభ్యులో అనుకోకండి మరి. అది హైదరాబాద్ రాజ్యంలో ఒకప్పుడు చలామణిలో ఉన్న కరెన్సీ.
1810లో హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటిసారిగా హాలీ సిక్కా అనే కరెన్సీ ముద్రించడం ప్రారంభించారు. నిజాం నవాబు కింద చాలామంది చిన్నా పెద్దా జాగీర్దారులు, జమీందారులు ఉండేవారు. వీళ్ళు ఎక్కడిక్కడ తమ స్వంత సిక్కాలను తయారుచేసి ముద్రించేవారు. వీరితో పాటు బాగా ధనవంతులకు కూడా టంకసాలలు ఉండేవి. వాళ్ళూ కరెన్సీ ముద్రించేవారు. ఈ రకంగా కరెన్సీ ముద్రించడం అమ్ముకోవడం వారికొక ఆదాయమార్గంగా ఉండేది. ఇలా కరెన్సీ ముద్రించడానికి నిజాం ప్రభుత్వం వీళ్ళకు లైసెన్సులు ఇచ్చేది. ఈ జాగీర్దార్లు తమ అధికారంలో ఉన్న జాగీర్లలో తమ నాణేలే చెల్లుబాటు కావాలని నియమం చేసేవారు. మొత్తానికి ఇన్నిన్ని రకాల నాణాలు ఉండడం వల్ల వ్యాపారస్తులు, సామాన్య జనం అయోమయంలో పడిపోయేవారు. దీనివల్ల మోసాలు, అక్రమాలు జరగడానికి బాగా వీలుండేది. జనం ఎన్నో బాధలకు గురయ్యేవారు.
1853లో ప్రధానమంత్రి అయిన మొదటి సాలార్‌జంగ్ కాలంలో ప్రైవేటు టంకశాలలు అన్నిటినీ రద్దు చేశారు. మొత్తం అన్ని రకాల నాణేలనూ తొలగించి ఒకే కరెన్సీ సీరీస్‌ను నిజాం ప్రభుత్వం తమ స్వంత టంకశాలల్లో ముద్రించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ, తమ ప్రైవేటు టంకసాలల్లో నాణేలు ముద్రించడానికి అలవాటు పడిపోయిన చిల్లర దేవుళ్ళు అంత సులువుగా ఈ కొత్త విధానాన్ని మన్నించలేదు. ఎప్పటికప్పుడు తమ స్వంత నాణాలు తయారుచేసి వ్యాపారస్తులకు బస్తాలు బస్తాల నాణాలు అమ్మి, వాటిని మార్కెట్‌లోకి పంపేసేవారు. చెల్లుబాటు కాకూడనివైన ఈ నాణేలు అలాగ చాలాకాలం చెల్లుబాటులోనే ఉండేవి. దీనికి తోడు కొందరు బ్రిటీష్ అధికారులు, స్థానిక అధికారులు కుమ్మక్కై రాచ టంకసాలలోనే అధికంగా నాణేలు ముద్రింపజేసి, ఆ దొంగ నాణేలు బయటకు తెచ్చి ప్రచారంలో పెట్టేవారు. ఈ తలపోట్లన్నీ ప్రధానమంత్రి తలకు చుట్టుకునేవి. ఆయన నానా రకాల ప్రయత్నాలతో చివరకు అరికట్టారు.
ఈ హాలీ కరెన్సీ విషయంలో మరో విశేషం ఏమిటంటే చాలాకాలం పాటు నోట్ల ముద్రణ లేకపోవడంతో నాణేలే ప్రచారంలో ఉండేవి. ఇందువల్ల పెద్ద పెద్ద అధికారులకు జీతాలు వచ్చే వేళ ఖజానా నుంచి బస్తాలతో నాణేలు తీసుకుని నౌకర్లు ఇంటికి వెళ్ళి ముట్టజెప్పే దృశ్యాలు నాటి హైదరాబాద్ రాజ్యంలో సర్వసాధారణంగా కనిపించేవి.
దేశంలో 500 పైచిలుకు సంస్థానాలు ఉన్నా స్వంత కరెన్సీ పెట్టుకోవడానికి బ్రిటీష్ సామ్రాజ్యం అనుమతించిన ఏకైక సంస్థానం హైదరాబాద్‌యే. ఈ కరెన్సీ విలువ ఎప్పుడూ బ్రిటీష్ ఇండియా రూపాయితో పోలిస్తే తక్కువ ఉండేది. ఉదాహరణకు బ్రిటీష్ కరెన్సీలో వంద రూపాయలు కావాలంటే హాలీసిక్కా కరెన్సీలో 111 రూ - 11 అణాల - 1 పైసలు ఉండేదని ఆంధ్రపత్రిక రాసింది.
1948లో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో భాగం అయినప్పటికీ ఒక ఐదేళ్ళ పాటు అధికారికంగానే ఈ రెండు రకాల కరెన్సీలు (భారత కరెన్సీ, హైదరాబాద్ కరెన్సీ) చలామణిలో ఉండేవి. 1953 ఏప్రిల్లో భారత ప్రభుత్వం ఇకపై హాలీ కరెన్సీ చెల్లదని ప్రకటించింది. అయితే, వెనువెంటనే అమలుచేయడం వల్ల ప్రజలు గందరగోళంలో పడతారని, ఇబ్బందుల పాలవుతారని గ్రహించి దశలవారీగా దీని తొలగింపు అమలుచేశారు. నోట్ల ముద్రణ 1953లోనే ఆపివేశారు, చిల్లర మాత్రం సరఫరా చేస్తూండేవారు. 1955 ఏప్రిల్లో ఏడాదిలో హాలీ కరెన్సీ మొత్తం భారతీయ కరెన్సీలోకి మార్చుకోవాలని, ఆపైన చెల్లదని ప్రకటించారు. ఆ తేదీ వచ్చినా పల్లెల్లో ప్రజలు ఇంకా మార్చుకోలేదని గమనించి 1956 అక్టోబరు 1 వరకూ అవకాశం ఇచ్చి, అంతటితో హాలీ కరెన్సీ కథ ముగించేశారు.
అలా 1956 అక్టోబరు 1 నాటికి హాలీసిక్కా తన 146 సంవత్సరాల చెలామణీ నుంచి చరిత్రలో కలిసిపోయింది. దాన్నే వార్తగా వేసేప్పుడు ఆంధ్రపత్రిక సృజనాత్మకత వాడి ఈ విధంగా హెడ్డింగ్ పెట్టిందన్నమాట!
No comments:
Post a Comment