Adsense

Tuesday, January 14, 2025

కోడిపుంజు ఉదయాన్నే ఎందుకు కూత వేస్తుంది.. ఇదీ అసలు రహస్యం..

సాధారణంగా ఉదయాన్నే అంటే సూర్యోదయం సమయంలో కోడి కూస్తుంది. గ్రామాల్లో ఎక్కువ శాతం ప్రజలు కోడి కూతతోనే నిద్ర మేల్కొంటారు.

మరి కోడి ఉదయాన్నే ఎందుకు కూస్తుంది. అసలు సూర్యోదయం అయినట్లు కోళ్లకు అంత ఖచ్చితంగా ఎలా తెలుసు.. కోడిపుంజు సూర్యోదయాన్ని ఎలా పసిగడతాయి.. మనుషుల కంటే ముందే అవి మేల్కోవడం వెనక సైంటిఫిక్ కారణం ఉందా.. అంటే అవుననే అంటున్నారు నిపుణులు. సూర్యోదయం సమయంలో కోడిపుంజు కూత వేయడానికి దాని శరీర నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతే కారణమని చెబుతున్నారు. మరి ఆ సీక్రెట్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

ఉదయాన్నే కోడి కూస్తుందని మనందరికీ తెలుసు. అయితే, కోడి పుంజులు మాత్రమే కూస్తాయని నిపుణులు అంటున్నారు. కోడిపుంజుల మెదళ్లు సున్నితమైన కాంతిని సైతం గ్రహిస్తాయట. కోళ్లు చాలా సున్నితమైనవని.. వీటిలో గ్రహణ శక్తి అధికంగా ఉంటుందట. ముఖ్యంగా కాంతిని త్వరగా గ్రహిస్తాయట.

తెల్లారితే కోడి పుంజులు ఎందుకు అరుస్తాయి..

వాస్తవానికి కోడిపుంజుల కూతలు కాలానికి సంకేతంగా పేర్కొంటారు. కోడి కూతతోనే రోజు ప్రారంభమవుతుంది. పల్లెటూర్లలో చాలా మంది కోడి ఆధారంగానే నిద్ర లేచి తమ తమ పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయం చేసే రైతులు.. కోడి కూతతో నిద్రలేచి వ్యవసాయ క్షేత్రాలకు వెళతారు.

నిపుణుల ప్రకారం.. కోడిపుంజుల్లో జీవ గడియారం ఉంటుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అని కూడా అంటారు. ఇది కోళ్ల శరీరాన్ని 24 గంటల సైకిల్ ప్రాతిపదికన పని చేసేలా చేస్తుంది. సిర్కాడియన్ రిథమ్‌లు ఒక రోజులోని 24 గంటల చక్రంలో ఒక జీవి అనుభవించే శారీరక, మానసిక ప్రవర్తనా మార్పులు. సూర్యోదయం సమయంలో కాంతిలో మార్పు కారణంగా.. కోళ్లలోని సిర్కాడియన్ రిథమ్ సక్రియం అవుతుంది. ఇది కోళ్లకు సిగ్నల్ ఇస్తుంది. అలాగే కోడిపుంజు కళ్లు చాలా సున్నితమైనవి. కాంతిని చాలా

త్వరగా గుర్తిస్తాయి. అందుకే.. సూర్యోదయం సమయంలో వాటి కాళ్లు వెంటనే కాంతిలో మార్పును పసిగడుతాయి. అలా వాటి మెదడుకు సంకేతం చేరుతుంది. తరువాత కోడి కూత పెడుతుంది.

కోళ్ల సమూహాన్ని మేల్కొలపడానికి..

సూర్యోదయాన్ని పసిగట్టే కోడిపుంజు.. తమ సమూహాన్ని మేల్కొలపడానికి అరుస్తుంది. తద్వారా రోజు ప్రారంభమైందని తమ సహచర కోళ్లకు సంకేతం ఇస్తుంది. అంతేకాదు.. ఒక్కోసారి హెచ్చరికలు చేసేందుకు కూడా కోడి పుంజులు కూత వేస్తాయట. మరికొన్నిసార్లు కోడిపెట్టలను ఆకర్షించేందుకు కూడా కూస్తాయట.

No comments: