Adsense

Friday, March 14, 2025

ఫాల్గుణ పూర్ణిమ శ్రీ మహాలక్ష్మి జయంతి

ఫాల్గుణ పూర్ణిమ శ్రీ మహాలక్ష్మి జయంతి

*పూర్వం ఒకసారి దూర్వాస మహాముని అడవులలో తపస్సు చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి కల్పవృక్ష మాలను పట్టుకొని అటువైపుగా వెళ్ళాడు. దానిని యోగ దృష్టితో గమనించిన దూర్వాసుడు ఆ వ్యక్తిని అడిగి ఆ మాలను తీసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి దూర్వాసుడు ఒకసారి స్వర్గలోకానికి వెళ్ళాడు. కల్పవృక్ష మాలను దూర్వాసుడు ఇంద్రుడికి బహుమానంగా ఇచ్చాడు. దానిని తీసుకొని దేవేంద్రుడు ఆ మాలను నిర్లక్ష్యంగా ఐరావతం మెడలో వేశాడు. ఐరావతం ఆ మాలను కింద వేసి కాళ్లతో తొక్కి ముక్కలు చేసింది. ఇదంతా చూసిన దూర్వాసుడు కోపోద్రిక్తుడై "మీ ఐ రాజ్యం నుంచి లక్ష్మి వెళ్లిపోవు గాక" అని శపించాడు.*

*శాపం వల్ల స్వర్గలోకం యొక్క ఐశ్వర్యం నశించింది. రాక్షసులు దండయాత్రలు చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనితో ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి జరిగినదంతా వివరించాడు. బ్రహ్మదేవుడు వారందరినీ వెంటబెట్టుకుని శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించి రాక్షసుల నుంచి స్వర్గాన్ని తిరిగి పొందే మార్గాన్ని చెప్పమని కోరాడు. అందుకు క్షీరసాగరాన్ని మధించిమనీ, అందులో నుంచి జన్మించే అమృతమును స్వీకరించి దేవతలు రాక్షసులను ఓడించవచ్చు అని శ్రీ మహావిష్ణువు సలహా ఇచ్చాడు.*

*క్షీరసాగర మథనం దేవతలకు ఒక్కరికే సాధ్యం కాదు కనుక రాక్షసుల సహాయం తీసుకుని అందుకు సిద్ధమయ్యారు. క్షీరసాగరాన్ని మథించేందుకు భూమధ్యలో ఉన్న మంధర పర్వతాన్ని కవ్వంగా, దానికి తాడుగా వాసుకీ సర్పాన్ని సిద్ధం చేసుకున్నారు. మంధర పర్వతాన్ని క్షీరసాగరం లోనికి దించగానే అది పట్టుతప్పి పడిపోయింది. దీనితో శ్రీ మహావిష్ణువు కూర్మరూపాన్ని ధరించి తన మూపుతో ఆ పర్వతాన్ని ఎత్తగా దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మథించడం ప్రారంభించారు. మధిస్తున్న సమయంలో ముందుగా హాలాహలం జన్మించింది. శివుడు దానిని సేవించి కంఠంలో ధరించి గరళకంఠుడు అయ్యాడు. అనంతరం సురభి అనే గోవు జనించగా మహర్షులు దానిని స్వీకరించారు. తర్వాత ఉచ్చైశ్రవం అనే తెల్లని అశ్వం జనించగా దానిని బలిచక్రవర్తి స్వీకరించాడు. అనంతరం కల్పవృక్షం, కామధేనువులు జనించగా ఇంద్రుడు స్వీకరించాడు, తరువాత చంద్రుడు జన్మించాడు, అనంతరం కొంతసేపటికి క్షీరాబ్ది నుంచి శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవించింది. సౌందర్యంతో ఉన్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. ఆమెను మణిమయ పీఠంపై ఆశీనురాలిని చేశారు. ఏనుగులు తొండముల నెత్తి కలశాలతో అభిషేకం చేశాయి. సముద్రుడు పట్టువస్త్రాలను సమర్పించాడు. వరుణుడు వైజయంతీమాలను, విశ్వకర్మ కేయూరాదులను, సరస్వతీదేవి తారక హారమును అందించగా, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పద్మమును అందించగా ఆమె ఆ పద్మంపై ఆసీనురాలయింది. అక్కడకు శ్రీమహావిష్ణువు విచ్చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు.*

*విష్ణు పురాణం ప్రకారం శ్రీ మహాలక్ష్మి భృగుమహర్షి పుత్రిక, భృగు మహర్షి భార్య ఖ్యాతి. వీరికి పుత్ర సంతానం కలిగింది కానీ కుమార్తెలు కలగలేదు, ఖ్యాతికి కుమార్తె కావాలనే కోరిక అధికంగా ఉండేది. దీనితో ఖ్యాతి భర్త అనుమతి తీసుకుని కూతురి కోసం ప్రార్ధన చేసింది. దేవిని గురించి తపస్సు చేసింది. తపస్సును మెచ్చి దేవి వరం కోరుకోమనగా, కుమార్తెను ప్రసాదించమని వరం కోరింది. జగన్మాత ఇచ్చిన వరం ప్రకారం భృగు మహర్షి ఖ్యాతి దంపతులకు ఒక కుమార్తె జన్మించగా ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పెంచుకున్నారు. ఆమె విష్ణువు తన భర్త కావాలని కోరి తపస్సు చేసింది. విష్ణువు ఆ తపస్సుకు మెచ్చి. లక్ష్మీదేవికి ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగా విష్ణువు తన భర్త కావాలని కోరింది.*

*ఈ విధంగా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు భార్యయై సంపదలకు అధిదేవతగా అయినట్లు విష్ణుపురాణం వెల్లడిస్తున్నది.*

*అటువంటి లక్ష్మీదేవి సంపదకు, ఐశ్వర్యానికి, ధనానికి ప్రతీక, అధిష్టానదేవత. ఆమె నివసించే ఇల్లు అమృతపథము. ఆమె చూపు ప్రసరిస్తే చాలు సంపదలు కలుగుతాయి... విజయాలు వరిస్తాయి.. ఆమె చిరునవ్వు సమస్త దుఃఖాలను హరింపజేసి ఆనందాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలు ధరించినప్పుడు శ్రీ మహాలక్ష్మి కూడా అవతారాలను ధరించి ఆయన వెంట వచ్చింది.*

*'లక్ష్మి' అనే పదానికి ఋగ్వేదం అనేక అర్ధాలను పేర్కొంది. లక్ష్మి అంటే సంపద, ప్రయోజనం, క్షేమం, యోగం, లాభం మొదలైన అర్థాలు ఉన్నాయి. లక్ష్మీదేవి నివాస స్థానాలు ఐదుగా చెప్పబడ్డాయి. ఏనుగు కుంభస్థలం, బిల్వదళ వెనుకభాగం, గోమాత పృష్ట భాగం, స్త్రీ పాపిటస్థానం, పద్మం అనేవి లక్ష్మీదేవి ఐదు స్థానాలు. వీటిని పూజించడం, గౌరవించడం వల్ల లక్ష్మీకటాక్షం కలుగుతుంది. అమ్మవారు సంపదకు చిహ్నం కనుక ధనాన్ని లక్ష్మీ అని అంటాము. ధనమే కాదు విద్య, సంతానం, విజయం వంటివన్నీ లక్ష్మీ స్వరూపాలే. అవన్నీ ప్రసాదించేందుకు ఆ చల్లని తల్లి ఆష్టరూపాలను ధరించింది. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి
అనేవి అష్టలక్ష్మి రూపాలు,*

*అటువంటి శ్రీ లక్ష్మీదేవిని లక్ష్మి జయంతి సందర్భంగా షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించడం, శక్తిమేరకు నైవేద్యం సమర్పించడం చేయవలెను. అలాగే కనకధారా స్తోత్రం, దేవేంద్రుడు చెప్పిన లక్ష్మీస్తోత్రాలను ఈనాడు పారాయణం చేయడం మంచిది. ఈ విధంగా లక్ష్మీ జయంతి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సకల దారిద్ర్యాలు నశించి, సకల సంపదలు, అష్టశ్వర్యాలు కలుగుతాయి.*

`శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే`
`జగస్థితేజగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే!!`


No comments: