Adsense

Monday, May 26, 2025

వాల్మీకి రామాయణం-3

నారదమహర్షి చే ఉపదేశం పొందిన సంక్షేప రామాయణాన్ని మననం చేస్తూ మధ్యాహ్న సమయానికి..

తమసానది తీరమునకు తన శిష్యుడైన భరద్వాజుని తో కలసి వెళ్లెను వాల్మీకి మహర్షి.

నిరంతరం  రామకథాగానం చేయడం మూలన మనస్సు నిర్మలమైనది. ఆభావాలే ప్రకృతి లో కనపడ్డాయి....

పక్కనే ఉన్న భారద్వాజునితో నది లో ఉన్న నీటి ని చూస్తూ అనేశాడు కూడా...

ఓ భరద్వాజా బురద లేని స్వచ్ఛమైన నీటి ని చూసావా నిర్మలమైన  ఉత్తమ మనుజుని వలే ఉన్నది అని చెబుతున్న సమయం లో నే ఆశ్చర్యాన్ని కలిగించే ఓ దృశ్యం మహర్షి కంట పడింది.....

ఓ క్రౌంచ పక్షుల జంట...ప్రేమాతిశయముతో ఒకటిని విడచి మరొకటి ఉండని స్థితి....

ఆసమయంలో ఓ బోయవాడు ఆ జంటలో మగ పక్షిని బాణం తో కొట్టేసాడు.....ఆ ప్రదేశం అంతా ఆ పక్షి రక్తం తో నిండినది ఆడ పక్షి  తన రెక్కతో విసురుతూ విల విల లాడుతూ మగ పక్షి చుట్టూ తిరుగుతోంది దీనం గా రోదిస్తోంది.

పక్కనే బోయ వాడు విల్లంబులతో నిలుచు కొని వున్నాడు.....
అత్యంత అల్ప సమయం లో జరిగిన ఈ దృగ్విషయాన్ని వాల్మీకి కన్నులతో కాక హృదయం తో చూసాడు....

అంత వరకు ప్రశాంతం గా ఉన్న మనసు లో ఒక్క సారి అలజడి చెలరేగింది.....ఒక్క సారి హృదయాంతరాలలో నుండి శోకం తో కూడిన మాటలు తన్నుకొని వచ్చాయి.....

శ్లో! మానిషాద! ప్రతిష్ఠాం త్వ! మగమః శాశ్వతీస్సమా: |
యత్ క్రౌంచమిధు నాదేక మవధీఃకామమోహితమ్౹౹

ఓ కిరాతకుడా! నీవు కామవసా న  క్రౌంచపక్షుల జంటనుండి మగ పక్షి ని చంపినావు కనుక నీవు చాలాకాలం లోకం లో అప్రతిష్ఠితను పొందుదువు.

వాల్మీకి నోటి వెంబడి వచ్చిన మాటలు ఏదో శాపం గా కనుబడుతున్నాయి అని చింతిస్తున్నాడు....

పక్కన ఉన్న భరద్వాజుడు గురువాక్కు ను నిశితంగా చూస్తున్నాడు.
4 పాదాలుగా ఉన్నాయి....
ఒక్కో పాదానికి 8 అక్షరాలున్నాయి....
ఒక క్రమబద్దం గా ఉన్నాయి....

గతం లో చదవని విధం గా కనబడుతున్నాయి అని ఆశ్చర్యానికి లోనవుతున్నాడు....
అవును ఈ శ్లోకం ఛందోబద్ద రచనకు మూలం. మొదటి శ్లోకరూప వాజ్ఞ్మయం....

ఆది కావ్యం రామాయణం,
ఆది కవి వాల్మీకి ......
వాల్మీ రామాయణ రచనకు పునాది.....

శ్లోకాన్ని పరిశీలిస్తే ఓ  శాపం గా కనపడుతుంది కానీ కావ్య ఆరంభము మంగళ వాక్యాలతో మొదలు కావాలి మరి ఇదేమిటి ఇలా ఉంది అని మన పెద్దలు విస్తుపోయారు .....

పరికించారు దివ్యదృష్టి తో దర్శించారు అప్పుడు  ఆ శ్లోకమే ఇలా అగుపించింది.

మా నిషాద-లక్ష్మికి నివాసస్థాన మైన విష్ణువా ! త్వమ్=నీవు, యత్ = ఏ కారణమువలన, క్రౌఇ్చమిథునాత్ =రాక్షసదంపతు లైన రావణమండోదరులనుండి కామమోహితమ్=కామపరవశ మగు, ఏకమ్=ఒక డైన రావణుని, అవధీః శాశ్వతీ:,స్థిరము లైన, సమాః సంవత్సరములయందు, ప్రతిష్టామ్=మాహాత్మ్య
మును, అగమః=పొందితివి.

ఓ శ్రీనివాసుడా! రావణమండోదరు లను రాక్షసదంపతులవద్దకు వెళ్లి, వారిలో ఒకడును, మన్మథపరవశుడై
సీతాదేవి నపహరించిన వాడును అగు రావణుని చంపితివి గాన నీవు శాశ్వతకాలము మాహాత్మ్యము పొందితివి.

ఇలా చూస్తే ఓ మంగళకరమైన శ్లోకం గా కనిపిస్తుంది.

ఈ ఛందోబద్ధమైన శ్లోకాన్ని గురుశిష్యులు ఇద్దరూ స్మరణ చేస్తూ వికారానికి లోనైన మనసులతో ఆశ్రమం చేరారు.

వాల్మీకి మహర్షి ఆచమనం చేసి తదేకదృష్టితో   శ్లోకాన్ని స్మరణ చేయడం ప్రారంభించాడు.

అపుడే ఆశ్రమానికి చతుర్ముఖ బ్రహ్మ గారు విచ్చేసారు.

( స‌శేష‌ము )

No comments: