నామకరణం.... అంతరార్థం.
శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి తత్వదీపిక.
వశిష్ఠులవారు ఇక్ష్వాకు వంశ పురోహితులు. చక్రవర్తికి సంతానము కలిగినందుకు అత్యంత ప్రీతినందినవాడై జ్యేష్ఠునకు 'రాముడు' అను నామధేయముంచెను.
కైకేయి కుమారునకు 'భరతుడు," సుమిత్ర కుమారులకు లక్ష్మణ, శత్రుఘ్నులు అని నామధేయముంచెను,
అవి లోక సామాన్యముగ అర్ధరహితములగు పేర్లు కావు. వశిష్ఠుడు త్రికాలజ్ఞుడగుబచే భవిష్యత్తు నెరింగి అందరిని ఆనందింప చేయువాడు కనుక రమయతి - ఇతి - రామః అని పెద్దవానికి రామనామము ఉంచెను.
అంతియేగాక యోగులు ఈతనివి ధ్యానించి ఆనందించుచుందురు కనుక 'రాముడు' అను అర్ధము కూడ ఆ నామమునందు కలదు.
అట్టి స్వభావము గల మహాత్ముడు శ్రీరాముడు. 'ర' అనునది అగ్ని బీజము కలది. 'మ' అమృతబీజము కలదిగ చెప్పుదురు. 'ర - అను అక్షరమును ఉచ్చరించగనే పాపములు పోయి
'మ' అనుటచే అమృతత్వము సిద్ధించును, అహంకార మమకారములు తొలగుటకు రామనామము శరణము.
ముక్తికి ప్రాపు అది.
రామ అను పేరులో అక్షర సంఖ్యను బట్టి 'ర రెండు 'మ' ఐదు అని లెక్కింతురు. అట్లు అంకెలు వేసి వానిని తలక్రిందులుగ వ్రాయుల శాస్త్రమర్యాద ,
రెండు, ఐదు వేసి ముందు వెనుకలు చేసిన ఏబది రెండు అగును. అక్షరములు ఏబది రెండు. అక్షర సమూహము అంతట చేతను తెలుపబడెడివాడు రాముడు,
అనగా ఏ శబ్దము అయినను బాహ్యమగు ప్రకృతి వికారమగు శరీరములో నున్న జీవులలో నున్న పరమాత్మనే తెలియజేయుము, కనుక సర్వ శబ్దములు భగవంతుని తెలియచేయునవే.
శ్రీ రాముడు శ్రీ మహావిష్ణువే కనుక రామునికి సర్వశబ్దములు నామధేయములే అగునని రామ నామము ఉంచెను.
ఒకరిని ఆనందింపచేయువాడు, తాను ఎల్లప్పుడు ఆనందించువాడు రాముడు, ఇది మానవుల సామాన్యలక్షణమై యుండవలెను.
ఇంక కైకేయి పుత్రునకు 'భరతుడు' అను పేరును ఉంచి తండ్రి మరణించిన తరువాత, రాముడు వనవాసమునకు ఏగిన తరువాత
పదునాలుగు సంవత్సరములు రాజ్యమును రాజు కాకుండ రాజుగ పరిపాలించి నందువలన భారమును మోయగల సమర్ధుడగుటచే భరతుడు అను పేరు సార్ధకమాయెను.
లక్ష్మీ సంపన్నుడను అర్ధముతో 'లక్ష్మణుడు' లను పేరును ఉంచెను. చక్రవర్తి కుమారుడగుటచే ఐశ్వర్యవంతుడు "అగుటయే గాని అతడు భౌతికముగ ఐశ్వర్యమును అనుభవింపలేదు.
అయినను అతనిని లక్ష్మీవర్ధనుడు, లక్ష్మి సంపన్నుడు అని వాల్మీకి వ్యవహరించెను.
లక్ష్మి అనగా లోక ప్రసిద్ధమగు ఐశ్వర్యము కాదు శ్రీరామునిలో నిత్య సన్నిధి కలిగియుండుటయే లక్ష్మణుని ఐశ్వర్యము.
అట్టి ఐశ్వర్యము లక్ష్మణునకే ఉన్నది. లౌకికమైన ఐశ్వర్యము నశ్వరము, కాని భగవత్ సన్నిధానమనెడి ఐశ్వర్యము శాశ్వతము.
సుమిత్ర పుత్రుడగు లక్ష్మణుని సోదరునకు 'శత్రుఘ్నుడు' అని నామధేయము నుంచెను.
గొప్ప' శత్రువులను జయించిన రామ లక్ష్మణులకు లేని బిరుదు
ఇతనికి లభించెను.
మధురలో రాజగు లవణుని ఈతడు చంపినాడు కనుక ఈతడును శత్రుఘ్నుడే అనవచ్చును గాని అదికాదు శత్రువులు అవగా ఇంద్రియములు, ఇవి ఎన్నడును మనను వదలి ఉండవు.
ఇవి విషయములపై ఆకర్షించి మనస్సును పాడుచేయును. వాటిని జయించినవాడు, శత్రుఘ్నుడు ఈతని గొప్పతనము, ఇంద్రియములను లౌకిక విషయములనుండి మరల్చుట కాదు.
భగవంతుని కూడ వీడి భగవద్భక్తువకే అంకితమైన ఇంద్రియములు కలవాడు. భరతుడు రాముని భక్తుడు. అతనిని ప్రేమించినవాడు శత్రుఘ్నుడు లోకమంతయు రాముడు రాముడని ఆదరించుచున్నను
ఆతని (శత్రుఘ్నువి) ఇంద్రియములు మాత్రము రాముని వైపు ప్రసరింపక భరతుని యందేస్థిరపడియున్నవి.
భగవానుని ప్రేమించుటకంటె భగవద్భక్తులను ప్రేమించుట చాల విశేషము. లోకవిషయములను వదలి భగవద్విషయమున ప్రసరించుట ఎంత కష్టమో భగవానుని వదలి
భగవద్భక్తులయందే మనసు నిలచుట అంత కష్టము. అట్టి స్థితి ఆతనికి సహజమున కలిగినది కనుక ఆతడు శత్రుఘ్నుడు.
ఇట్లు నాలుగు నామధేయములు సార్ధకములు...
( సశేషము )
No comments:
Post a Comment