దశరథునికి జన్మించిన నలుగురు కుమారులలో రాజీవలోచనుడైన రాముణ్ని చూస్తే సకల ప్రజలూ చంద్రుణ్ని చూసినంతగా ఆహ్లాదం పొందుతున్నారు.
అందరికీ ఇష్టుడయ్యాడు.
తేషామపి మహాతేజా రామస్సత్యపరాక్రమః
ఇష్ట: సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మలః.
లక్ష్మణుడు ఎప్పుడూ రాముణ్ని విడిచిపెట్టడం లేదు. సమస్తసేవలు అందిస్తున్నాడు. ఆనందం కలిగిస్తున్నాడు.
రామునికి బహిఃప్రాణమే అయ్యాడు. రాముడుకూడా లక్ష్మణుడు లేనిదే నిద్రించడం లేదు! లక్ష్మణుడు లేనిదే భుజించడం లేదు.
బాల్యాత్ర్పభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః
రామస్య లోకరామస్య భ్రాతుః జ్యేష్ఠస్య నిత్యశః|
సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః
లక్ష్మణో లక్ష్మి సంపన్నో బహిఃప్రాణ ఇవాపర:||
న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమ: మృష్టమన్నముపానీత మశ్నాతి న చతం వినా
రాముడు ఎప్పుడన్నా హయారూఢుడై వేటకువెడితే లక్ష్మణుడుకూడా ధనుర్బాణాలు ధరించి సంరక్షకుడుగా
వెంటవెడుతున్నాడు.
రామునిపట్ల లక్ష్మణుడు ఎలా ఉంటున్నాడో భరతునిపట్ల శత్రుఘ్నుడు అలా ఉంటున్నాడు. భరతునికి ప్రాణాలకంటే ఇష్టుడయ్యాడు.
భరతస్యాపి శత్రుఘ్నో లక్ష్మణావరజో హి సః
ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్తథా ప్రియః
గుణవంతులు, జ్ఞానవంతులు, కీర్తిమంతులు, హ్రీమంతులు, సర్వజ్ఞులు, దీర్ఘదర్శులు అయిన నలుగురు కుమారులనూ చూసుకొని దశరథుడు బ్రహ్మానందం పొందుతున్నాడు.
నలుగురూ ప్రాప్తయౌవనులయ్యారు. మరింక వివాహాలు చెయ్యాలి అనుకున్నాడు.
వసిష్టాది పురోహితులను, గురువులను, మంత్రులను, బంధువులను సమావేశ పరిచాడు. సమాలోచనలు ప్రారంభించాడు.
అంతలో ద్వారపాలకుడు పరుగు పరుగున, వచ్చి విశ్వామిత్ర మహర్షి వచ్చిన వార్తను విన్నవించాడు.
( సశేషము )
No comments:
Post a Comment