Adsense

Wednesday, June 4, 2025

వాల్మీకి రామాయణం - 18

వశిష్ఠ పురోహితాది కొలువులో ఉన్న దశరథ మహారాజుకు విశ్వామిత్రుడు వచ్చాడని వర్తమానం అందింది.......

దశరధుడు సామాత్యపురోహితంగా ఎదురువెళ్ళి శాస్త్ర ప్రకారం అర్ఘ్యపాద్యాలతో అతిథిపూజలుచేసి భయభక్తులతో లోపలికి తీసుకువచ్చాడు.

అందరూ యథార్హంగా సమావిష్టులయ్యారు. పరస్పర కుశల ప్రశ్నలు అయ్యాయి. అప్పుడు దశరథుడు ఆనందంనుంచి తేరుకుని లేచి వినయ వినమిత త్రుడై నిలిచి

మహామునీ! అమృతం లభించినట్టు, ఎద్దడిలో వాన కురిసినట్టు, అపుత్రకునికి ధర్మపత్నియందు సంతానం కలిగినట్టు, నష్టపోయిన వానికి లాభం చేకూరినట్టు

నీ ఆగమనంవల్ల నాకు అమితానందం కలుగుతోంది. స్వాగతం మహామునీ! స్వాగతం

మహార్షీ! నేనై నిన్ను వెదుక్కుంటూ రావలసింది. అదృష్టవశాత్తూ నీవే వచ్చావు. నేను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు నా జన్మ సఫలం అయ్యింది.

నా జీవితం చరితార్థమయింది. పూర్వం రాజర్షివై తపస్సుతో బ్రహ్మర్షిత్వం పొందినవాడవు నీ రాకతో నా గృహం పవిత్రమయ్యింది.

నీ సందర్శనంతో నేను దివ్యక్షేత్రాలు అన్నీ సందర్శించినవాడను అయ్యాను.
కౌశికా! నీ రాకకు కారణమేమిటో తెలియజెయ్యి.

నీ కోరికను నెరవేర్చి అనుగృహీతుడను అవుతాను. ఇంక ఏమీ ఆలోచించకు, కర్తను నేనున్నాను. నీవు నా దేవుడవు.

నీ రాక నా అభ్యుదయం.
నీ ఆగమనంవల్ల నేను ధర్మపరుడనయ్యాను.
రాజసింహుడైన దశరథుని మాటలకు విశ్వామిత్రుని శరీరం పులకించింది

రాజోత్తమా ! మహావంశంలో పుట్టి వసిష్ఠుని ఉపదేశంతో ప్రవర్తిస్తున్న నీవంటివాడు తప్ప మరొకడు ఇలా మాట్లాడలేడు.

సరే నామనస్సులోని మాట చెబుతున్నాను. దానిని నెరవేర్చి సత్యవాక్కువు కా ! మాట నిలబెట్టుకో..

ఒకానొక సిద్ధినికోరి నేను యజ్ఞదీక్షను స్వీకరించాను. అయితే కామరూప సంచారులు, మహాబలవంతులు సుశిక్షితులు అయిన ఇద్దరు మహారాక్షసులు - మారీచ సుబాహులు, నా యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నారు

రక్తమాంసాలను వర్షించి యజ్ఞకుండాన్ని అపవిత్రం చేస్తున్నారు. దీనితో నా ఉత్సాహం చచ్చిపోయింది. కేవలం శ్రమ మిగిలింది. వెంటనే బయలుదేరి నీ దగ్గరకు వచ్చాను

నేనే వారిని శపించవచ్చు. శపించగలను. కానీ స్వీకరించిన యజ్ఞదీక్ష అటువంటిది. క్రోధం బొత్తిగా పనికిరాదు.

కాబట్టి మహారాజా ! నీ జ్యేష్ఠకుమారుడు, సత్యపరాక్రముడు,  అయిన రాముణ్ని నాకు అప్పగించు. నాతో పంపించు.

నా సంరక్షణలో తన దివ్యతేజస్సుతో రాముడు ఆ రాక్షసులను సంహరించగలడు

ముల్లోకాలలోనూ విఖ్యాతిని గడించే శ్రేయస్సును నేను రామునికి అందిస్తాను.

రాముణ్ని ఎదిరించి ఆ మారీచసుబాహులు నిలువలేరు. రాముడు వారిని సంహరిస్తాడు
పుత్ర ప్రేమతో అడ్డుచెప్పకు.

నాకు బాగా తెలుసు. రాముని చేతిలో ఆ రాక్షసులిద్దరూ సంహరింపబడ్డారనే గ్రహించు.

మహాత్ముడూ సత్యపరాక్రముడూ అయిన రాముణ్ని నే నెరుగుదును. మహాతేజస్వి ఈ వసిష్ఠుడు ఎరుగును ఇదిగో తక్కిన ఈ తపస్వులు ఎరుగుదురు.

అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్ | వసిష్ఠోఽపి మహాతేజా యే చేమే తపసిస్థితా:||

( స‌శేష‌ము )

No comments: