విశ్వామిత్రుడికి కోపం వస్తోందన్న విషయాన్ని విశిష్టుల వారు గ్రహించి దశరథుని తో.....
మహారాజా! దశరథా ! ఇక్ష్వాకు వంశలో జన్మించావు. సాక్షాత్తు ధర్మస్వరూపుడుగా జీవిస్తున్నావు.
స్థిరచిత్తం కలవాడవు. నీవు ధర్మాన్ని విడిచిపెట్టడం తగని పని సుమా ! ముల్లోకాలలోనూ ధర్మాత్ముడుగా నీవు ప్రసిద్ధుడవు.
ఆ పేరు నిలబెట్టుకో. అధర్మాన్ని అప్రతిష్ఠనూ నీవు భరించలేవు. యజ్ఞయాగాలు చేసి సప్త సంతానాలు స్థాపించినా ఆడినమాట తప్పితే అంత పుణ్యమూ నిష్ఫలమైపోతుంది. అందుచేత రాముణ్ని పంపించు.
కృతాస్తుడో అకృతాస్త్రుడో రామునికి
ఏ కీడూ ఏ ఆపదా కలగదు. అగ్నిసంరక్షితమైన అమృతంలాగా విశ్వామిత్రుని సంరక్షణలో ఉన్న రాముణ్ని రాక్షసులు ఏమీ చెయ్యలేరు.
ఈ విశ్వామిత్రుడెవ రనుకుంటున్నావు? రూపు దాల్చిన ధర్మం. బలవంతులలోకెల్లా బలవంతుడు బుద్ధిమంతులలో కెల్లా బుద్ధిమంతుడు.
తపస్సుకు పరాకాష్ఠ.ముల్లోకాలలోనూ సచరాచర సర్వ ప్రకృతిలోనూ విశ్వామిత్రునికి తెలియనిది లేదు.
ఇతడు ఎరుగని అస్త్రం లేదు ఇతడిని తెలుసుకొన్నవాడుగానీ ఇతనికి తెలిసినన్ని తెలిసినవాడుగానీ మరొకడు లేడు, ఉండబోడు.
ఇక్ష్వాకువంశవర్ధనా ! మరొక విశేషం ఆలకించు. ఈ కుశికనందనుడు రాజ్యం ఏలుతున్న సమయంలో భృశాశ్వుడు తన సంతానమైన వంద దివ్యాస్త్రాలనూ ఇతనికి సమర్పించాడు.
దక్షప్రజాపతికి దౌహిత్రులైన ఆ దివ్యాస్త్రాల శక్తి వర్ణనాతీతం. జయ-సుప్రభ అనే దక్ష ప్రజాపతి పుత్రికలు ఈ అస్త్రాలకు మాతృమూర్తులు.
అసురసైన్య వినాశనం కోరి ఏబదేసి అస్త్రాలను వీరు ప్రసవించారు. అవన్నీ ఈ విశ్వామిత్రునికి వశంవదమై ఉంటాయి. వాటి ప్రయోగోప సంహారాలు నేర్చినవాడూ నేర్పగలవాడూ ఇతడొక్కడే.
ఇటువంటి మహాతేజస్సంపన్నుడైన విశ్వామిత్రుని వెంట రాముణ్ని పంపడానికి సంశయించకు.
ఇలా వసిష్ఠుడు చెప్పగా దశరథుని మనస్సు కలత దేరింది.
సంతోషంగా రామలక్ష్మణులకు కబురు పంపించాడు కౌసల్య ఆశీర్వదించి పంపింది. సుమిత్రా కైకా ఆశీర్వదించారు.
వసిష్ఠుడు మంత్రరూపంలో శుభం పలికాడు. ఒక్కసారి గట్టిగా కౌగిలించుకొని శిరస్సు ఆఘ్రాణించి దశరథుడు రాముణ్ని విశ్వామిత్రునికి సంతుష్టాంతరంగుడై అప్పగించాడు.
రాజీవలోచనుడైన రాముడు ఇప్పుడు విశ్వామిత్రుని పక్షాన నిలబడ్డాడు. శుభసూచకంగా దుమ్మూ ధూళీ లేని చల్లనిగాలి వీచింది.
పుష్పవృష్టి కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి. శంఖారావాలు వినిపించాయి. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు బయలుదేరారు.....
ముందు విశ్వామిత్రుడు అతివేగంగా - వెనక్కు తిరిగి చూడకుండా నడుస్తున్నాడు. కాకపక్ష ధరుడై ధనుర్బాణాలు ధరించి రాముడు అనుసరిస్తున్నాడు.
అతని వెంట లక్ష్మణుడు నడుస్తున్నాడు. బ్రహ్మదేవుని వెంట అశ్వినీ దేవతల్లాగా, శివునివెంట అగ్నిశిఖల్లాగా నడుస్తున్నారు.
మూడుతలల పాములాగా నడక చరచరా సాగుతోంది యోజనమూ మరో అర్ధయోజనమూ నడిచి సరయూ దక్షిణతీరం చేరారు.....
( సశేషము )
No comments:
Post a Comment