Adsense

Friday, June 6, 2025

వాల్మీకి రామాయణం - 22

విశ్వామిత్రుని వెంట రామ లక్ష్మణులు సరయూనది దక్షిణాతీరం చేరారు.
రామా..! అని విశ్వామిత్రుడు మధురం గా పిలిచాడు...

వత్సా! త్వరగా నదిలో ఆచమించి రా! ముహూర్తవేళ మించిపోకుండా బల ల అతిబలలు ఉపదేశిస్తాను. స్వీకరించు. ఇవి దివ్య మంత్రాలు,

వీటిని ఉపాసిస్తే నీకు శ్రమ ఉండదు. జ్వరం ఉండదు. రూపంలో మార్పురాదు నిద్రలో కూడా రాక్షసులు నిన్ను ఏమీ చెయ్యలేరు.

బాహుపరాక్రమంలో బుద్ధి నిశ్చయంలో కీర్తిలో నీకు సాటివచ్చే వీరుడు ముల్లోకాలలోనూ ఉండడు. ఈ బల అతిబలలు సర్వజ్ఞానానికీ తల్లులు. వీటిని పఠిస్తే మార్గాయాసమూ క్షుత్పిపాసలూ ఉండవు.

ఇవి బ్రహ్మపుత్రికలు. నీకు ఉపదేశిస్తాను. నీవు అర్హుడవు. సమస్త సద్గుణాలూ నీకు ఉన్నాయి నిన్ను ఆశ్రయించి ఈ విద్యలు రాణిస్తాయి. త్వరపడు. సూర్యాస్తమయం కాకముందే శుచిపై వీటిని స్వీకరించు

రాముడు త్వరత్వరగా సరయూనదిలో దిగి ఆచమించి శుచిగా వచ్చి ఆ విద్యలు స్వీకరించాడు. రామునిలో ఒక కొత్త కాంతి వెల్లివిరిసింది.

శరత్కాల సూర్యునిలాగా ప్రకాశించాడు. మంత్రోపదేశం ఇచ్చిన గురువుకు చెయ్యవలసిన ఉపచారాలన్నీ యథావిధిగా రామలక్ష్మణులు నిర్వహించారు.

గడ్డి పరుచుకొని ముగ్గురూ ఆ రాత్రికి అక్కడే విశ్రమించారు.
తెల్లవారింది. తృణశయనం మీద నిద్రిస్తున్న రాకుమారులను చూసాడు విశ్వామిత్రుడు.

కౌసల్యాసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్||

కౌసల్యానందనా ! రామా! ప్రాతస్సంధ్య నడుస్తోంది, నిద్రలే! నరోత్తమా ! దైవ సంబంధమైన ఆహ్నిక క్రియలు సంధ్యావందనాదులు, నిర్వర్తించాలి గదా!
మేలుకొల్పుతో రామలక్ష్మణులు నిద్రలేచారు.

స్నాన సంధ్యాదులు ముగించారు. ప్రయాణానికి సిద్ధమై మునికి నమస్కరించి నిలిచారు. మార్గదర్శకుడుగా మహర్షి నడిచాడు. రామలక్ష్మణులు యథావిధిగా అనుసరించారు

అల్లంత దూరాన సరయూ సంగమస్థలంలో గంగానది కనిపించింది. ఆ సమీపంలో ఒక ఆశ్రమం కనిపించింది దానిని చూడగానే రామలక్ష్మణులకు అది ఎవరి ఆశ్రమమో ఏమిటో తెలుసుకోవా లనిపించింది.

మహర్షిని అడిగారు
ముని చిరునవ్వులో వివరించాడు.
కందర్పుడూ కాముడూ అని ఒకడున్నాడు. అతడు ఒకనాడు - ఇక్కడ తపస్సు చేసుకుంటున్న శివునిమీద దుర్బుద్దితో విజృంభించాడు.

శివుడు హుంకరించాడు. నేత్రాగ్నిని వెదజల్లాడు. మన్మథుని శరీరాంగాలు ప్రశిథిలమై పోయాయి. అప్పటినుంచీ అనంగుడయ్యాడు. ఆ కారణంగా ఈ ప్రదేశాన్ని అంగదేశం అంటారు.

ఇది అప్పటి ఆ పరమశివుని ఆశ్రమం. ఇప్పుడో ఎవరో శిష్యులు ఉంటున్నారు. వీరు ధర్మపరులూ, పాపరహితులూను.
శుభదర్శనా ! రామా! ఇరువైపులా పవిత్రనదులు.

ఈ రాత్రికి ఈ నడుమభాగాన విశ్రమిద్దాం. రేపు నదిని దాటుదాం
ఆ ఆశ్రమ మునీశ్వరుల సాయం తో గంగా తీరం దాటుతున్నారు నది మధ్య లో పెద్ద ఘోష వినపడింది....

ఈ శబ్దం ఏమని రాముడు ప్రశ్నించాడు...
రామా! కైలాస శిఖరంమీద మానస సరస్సు ఉంది. దానిని బ్రహ్మదేవుడు మనస్సుతో నిర్మించాడు.

అందుకని అది మానస సరస్సు అయ్యింది. దానినుంచి జారిన నది మీ అయోధ్యకు చుట్టూ ప్రవహిస్తోంది. సరస్సునుంచి జారినది కాబట్టి దానికి సరయువు అని పేరు ఏర్పడింది.

ఆ సరయూనది ఇక్కడ గంగానదిలో కలుస్తోంది. అదే ఆ హోరు. ఈ నదీ సంగమ స్థలానికి నియతితో నమస్కరించు.....ఇరువురు నమస్కరించారు

నది దక్షిణ తీరానికి చేరారు...
ఓ దట్టమైన అడవి అందులోకి ప్రవేశించారు. రాముడు ఆశ్చర్యం తో ప్రశ్నించాడు ఏమి ఈ దట్టమైన అడవి? అనేకరకాల పక్షులు,కీచురాళ్లు,సింహ శార్దూల కౄరమృగాల అరుపులు...?

విశ్వామిత్ర మహర్షి సమాధానం చెబుతున్నాడు.......

( స‌శేష‌ము )

No comments: