Adsense

Tuesday, June 10, 2025

వాల్మీకి రామాయణం -27

రామలక్ష్మణులు విశ్వామిత్ర బృందం తో గంగా నదీ తీరం చేరారు...గంగా నది గాధ ను విశ్వామిత్రుడు వివరింప సాగాడు....

హిమవంతునికి మేరు తనయ అయిన మనోరమ యందు గంగా,పార్వతులనే తనూజలు కలిగారు.

హిమవంతుని యాచించి దేవతలు గంగామతల్లిని తమ లోకానికి తీనికవెళ్లారు. అక్కడ సురనదీ రూపంలో గంగాదేవి స్వర్లోక వాసులను సంతృప్తి గావించింది.

పార్వతి మహోగ్ర తపము ద్వారా పరమశివుని సంప్రీతునిగావించి ,ఆ పరమేశ్వరునే పరిణయము చేసికొంది...

శివ పార్వతులు బహుకాలము భోగింప సాగారు. శివుని అమోఘ వీర్యమును కాలము గడిచిన కొలది భరించుట దుష్కరమని, దానివలన ప్రళయమే సంభవించునని భీతులై దేవతలు వారి ఏకాంతమునకు భంగము కలిగించారు

సురుల కోరిక పై శివుడు తన తేజాన్నిసర్వక్షమాశీలయైన భూమిలో విడిచాడు. ఆమహాతేజము భూమియావత్తునిండి పర్వతాలను, వనాలను వ్యాపిస్తూ వసుంధరకు దుర్భరం కాసాగింది

ఆదితేయులు  అగ్ని దేవుని అవనితో పాటు శివ వీర్యమును ధరింపుమని ప్రార్థించారు. అగ్నిదేవుడు అందుకు అనుమతించాడు.

శ్వేత పర్వతము , దివ్యశరవణము మొదలైనవి శివ వీర్యప్రభవములయ్యాయి.
దేవతలు సంప్రీతులై ఉమామహేశ్వరుల నారాధించారు.

అయితే శర్వాణి వారి పరిచర్యలకు సంతుష్టురాలు కాలేదు. తనకు మహేశ్వరతేజము దక్కలేదనే కనుకతో స్వర్గ వాసులందరు సంతాన హీనులుగా మిగిలిపోతారని శపించింది.

తనకు దక్కని శివ వీర్యాన్ని ధరించిన భూమి నిరంతరము మార్పులను చెందుతూ స్థిరత్వము లేక అనేకులకు భార్యగా నుంటుందని కఠినోక్తి గావించింది

దేవతలకు రాక్షసులతో జరిగే యుద్ధాలలో సరియైన సేనాధిపతి లేక ఘోరబాధలు సంభవించాయి.

వారి మొరను వినిన పరమేశ్వరుడు అగ్నిదేవునితో తన తేజాన్ని గంగానదిలో విడువుమని ఆదేశించాడు.

గంగా,హుతవాహనుల సంగమం వలన కుమార సంభవము జరుగుతుందని ఆ బాలుడు పార్వతి సంప్రీతికి కూడ పాత్రుడౌతాడని-ఆయన దేవ సేనాని యై అనురులనణచుతాడని అభయ మొసగాడు మహేశ్వరుడు

సురల ప్రార్థనతో స్వర్గంగ స్త్రీరూప ధారిణియై అగ్నిదేవుని నుండి ఆ శివతేజాన్ని గ్రహించింది. కాని అఖిలలోకములకు ఆహ్లాదాన్ని కలిగించే అనదీమతల్లికి కూడ ఆతేజము దుస్సహమయింది.

ఆతల్లి ఆ వీర్యాన్ని తన జలాలలో వదిలింది. ఫలితంగా, బంగారము, సీసము, మొదలైన అతి మూల్యమైన లోహము లేర్పడ్డాయి.

చివరకు ఆతేజము నుండి హిమాలయ పాదస్తానములో గంగానది తీరములోని రెల్లు గడ్డిలో శివకుమారుడావిర్భవించాడు.

ఆ కుమారునికి పాలివ్వడానికి ఆరుగురు కృత్తికలు ముందుకొచ్చారు. ఆరుగురు తల్లుల పాలు ద్రావినందుకా కుమారుడు షాణ్మాతురుడయ్యాడు.

కృత్తికల చేపెంచబడినందు వలన కార్తికేయుడని ఖ్యాతి వహించాడు - ఆరు ముఖములలో ఏక కాలంలో ఆరుగురు తల్లుల స్తన్యము గ్రోలినందువలన

"షణ్ముఖుడు"అని ప్రసిద్ధినందాడు. శివతేజము స్కన్నమగుట ద్వారా సంభవించినందుల కాయన "స్కంధుడనే పేరును పొందాడు.

శివ వీర్యానికి కారణమైన పార్వతీదేవి ,దేవతలందరిలో శ్రేష్టత్వమును పొందింది, శివతేజము ధరించినందు వలన గంగానది నదులన్నిటిలో శ్రేష్ఠ వాహిని అయింది

శివ వీర్యాన్ని దేవతలు ఎంత భగ్నము చేయాలనుకొన్నా అది ఎన్ని స్థానాలలో పతనమైనా ,చివరకు ఆతేజము కుమారస్వామి సంభవానికి కారణమైంది.

కుమార సంభావాన్ని తెలిపిన విశ్వామిత్రుడు కొంత విరామము తరువాత ఇక్ష్వాకు వంశం లో శ్రేష్ఠుడైన సగర చక్రవర్తి గురించి చెప్ప సాగెను......

( స‌శేష‌ము )

No comments: