Adsense

Tuesday, June 10, 2025

వాల్మీకి రామాయణం-28

విశ్వామిత్ర ముని ఇక్షవాకు వంశ రాజైన సగర చక్రవర్తి గురించి చెబుతున్నాడు....

ఒకా నొక కాలమున సగర చక్రవర్తి  అశ్వమేధ యాగము నిర్వహిస్తున్నాడు. అతని యజ్ఞాశ్వము దేశాటనకై విడువబడింది.

అంశుమంతుడా అశ్వరక్షకుడుగా వెళ్లాడు. సంవత్సర కాలము సంపూర్ణమైంది. అశ్వము రాజధానికి తిరిగి వచ్చింది

యజ్ఞ సన్నాహాలు పూర్తి అయ్యాయి. క్రతువు ఆరంభము మరుసటి రోజే. రాక్షస' శరీరంతో ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని అపహరించాడు.

రక్షింపబడని అశ్వము యజ్ఞ కర్తకు అనర్ధాన్ని కల్గిస్తుంది. సగరుడు దీక్షాబద్ధుడు -కనుక యజ్ఞ శ్వమును తీసికొని వచ్చుటకు తన అరవై వేల మంది పుత్రులను పంపాడు

వారందరు మహాసంరంభముతో హుటాహుటి బయలుదేరారు. భూమిని తమ వజ్రముష్టులతో బద్దలు కొడుతూ వెళ్లసాగారు.

దారిలో నాగులు అనుర రాక్షసులు మర్ధింపబడ్డారు. భూమి అంతా గుంటలు గుంటలుగా తవ్వబడసాగింది

ఈ హఠాత్ప్రళయానికి దేవదానవ, గంధర్వ, యక్ష రాక్షపాదులు బ్రహ్మకు మొరలిడగా భగవంతుడు "కపిల రూపధారియై, భూమి పైననే ఉన్నాడని ఆయనయే ఈ ఉపద్రవాన్నుండి రక్షిస్తాడని బ్రహ్మవచించాడు

ఆవిధంగా భూమంతా త్రవ్వి, దానిచుట్టూ పరిక్రమించి, ఎక్కడ కూడ యజ్ఞాశ్వం కాన రాక తిరిగి రిక్త హస్తులై సగరుని చేరారు

ఆయన పుత్రులు సగరుడు రోషసాగరుడై మళ్లీ భూమినంతటిని త్రవ్వి, అంతటా వెదికి అశ్వంతోనే తిరిగి రావాలని, కాని ఊరక రాకూడదని గద్దించాడు. .

సాగరులు మార్గ మధ్యములో పూర్వదిశలో "విరూపాక్ష దిగ్గజాన్ని, దక్షిణ దిశలో 'మహాపద్మ' మత్తేభాన్ని, ఉత్తర దిశలో "భద్ర'గజాన్ని, పశ్చిమ దిశలో 'సౌమనస్య "ద్విరదాన్ని దర్శించారు.

మళ్ళీ భూఖననం చేస్తూ వెళ్లి "కపిల మహర్షిని గాంచారు. ఆ మహానుభావుని "అశ్వాపహర్త'గా భావించి, ఆయన పైకి ఉరికారు వారి దుర్వత్తిని గమనించి కపిలుడు హుంకారము గావించాడు. సాగరులందరు భస్మమయ్యారు.

సగరుడు తన షష్టి సహస్ర సుతులు తిరిగి రానందున, అశ్వమును (తిరిగి) తేవడానికై తన మనుమని అంశుమతుని ఆజ్ఞాపించాడు.

ఆయన ఖడ్గధారియై బయలుదేరి, తమ పితరులు త్రవ్విన త్రోవలోనే పయనిస్తూ మార్గస్థుల మర్యాదలను స్వీకరిస్తూ, దిగ్గజాలను దర్శించాడు.

వాటి ఆశీర్వాదంతో చివరదాకా వెళ్లి అక్కడ భస్మీ భూతులైన పితరులను దర్శించి, దుఃఖ పరవశుడయ్యాడు

అక్కడికి సుపర్ణుడు గరుడుడేతించి, " అంశుమంతుని ఓదార్చి వారికి ఉత్తమ లోకావాప్తిని కల్గించడానికి, లోకపావనియైన గంగామతల్లిని అవతరింపజేయుమని ఆనతిచ్చి వెళ్లాడు.

ధైర్యమును చేజిక్కించుకొని, యజ్ఞాశ్వాన్ని తీసికొని సగరుని సమిపించాడంశుమంతుడు.

సగరుడు తన కొడుకుల దుర్మరణాన్ని గురించివిని కూడ యాథావిధిగా యజ్ఞము పూర్తి గావించు కొని ముప్పైవేల సంవ్సరాలు పాలన గావించి, గంగావతరణ విధిని నిర్ణయించకుండానే స్వర్గతుడయ్యాడు.

తరువాతి ఇక్ష్వాకు వంశ చక్రవర్తులు చరిత్రలను విశ్వామిత్రుడు చెప్ప సాగెను...

( స‌శేష‌ము )

No comments: