Adsense

Wednesday, December 3, 2025

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 16వ అధ్యాయం

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప....

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 16 భాగం...ప్రారంభం..!!🌹🙏


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿 వాటి సహాయంతో ప్రయత్నిస్తే నీ కోరిక తప్పక తీరుతుంది ! మరొక విషయం చెబుతాను , విను ! కామ , క్రోథ , లోభ ,మోహ ,మద మాత్సర్యాలనే ఆరు దుర్గుణాలు మనస్సును నిర్మలంగా వుండనివ్వకుండా తమ మాయాజాలంతో వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంటాయి ! ముందుగా ఈ ఆరు దుర్గుణాలు..

🌸మనస్సుమీద ప్రభావం చూపకుండా సంయమనం పాటించడం అలవాటు చేసుకోవాలి ! ఆ సంయమనం అలవడటానికి తపస్సు , ధ్యానం సహాయపడతాయి !

🌿పద్మాసనం వేసుకుని కూర్చుని , ప్రాణాయామం ఆచరించి ఓంకారాన్ని నిశ్చలమైన హృదయంతో ధ్యానిస్తూ వుంటే క్రమంగా మనస్సు నిలకడ పొంది పరబ్రహ్మ దర్శనం లభిస్తుంది ! నీ కోరిక మరికొంతకాలం తర్వాత తప్పక తీరుతుంది !

🌸మణికంఠుడు నిన్ను చూడటానికి తప్పక వస్తాడు ! అప్పటివరకు నేను చెప్పిన విధంగా ఏ విధమైన భావాలకు లోనుకాకుండా ఆత్మసంయమనం పాటించటం అలవాటు చేసుకో !’’  అంటూ ఉపదేశించాడు ! ఆయన చెప్పింది శ్రద్ధగా విన్నది శబరి ! ‘‘నాకు మార్గోపదేశం చేయడానికివచ్చిన గురుదేవులుగా భావించి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరిస్తున్నాను !’’ అంటూ నమస్కరించింది ! ‘‘ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు !’’ అని ఆశీర్వదించి గంభీరంగా సాగిపోయాడు వృద్ధుడు ! 

🌿  ఆ విధంగా గురుమూర్తి రూపంలో వచ్చిన మణికంఠుడు తత్వోపదేశం చేయడంతో శబరిలో జ్ఞాన నేత్రం వికసించింది ! తనలోనే జ్యోతిరూపంలో వెలుగొందుతున్న జీవాత్మ అరిషడ్వర్గాలను జయించడంతో పరమాత్మ ప్రతిరూపంగా వెలుగుతూ ఆ పరమాత్మలోనే విలీనం చెందుతాడని గ్రహించింది ! ఆ సత్యం బోధపడటంతో ఆమె మనస్సు సంయమన స్థితిని పొందింది !

🌸సగుణ రూపంతో తనను చూడటానికి వచ్చే మణికంఠుని చూడాలన్న ఒకే కోరికతో కాలం గడుపుతూ వృద్ధాప్యంలో ప్రవేశించింది ! ఆ సమయంలోనే విజయుడు ఆమెను కలుసుకోవటం , ఆమె అతనికి మార్గోపదేశం చేయడం జరిగాయి ! మణికంఠుడు మహిషిని వధించిన తర్వాత పులివాహనం మీద శబరికి దర్శనం ప్రసాదించాడు !

🌿అంతవరకు ఎంతో ఓపికతో వేచి వున్న శబరి చిరకాల వాంఛితం నెరవేరింది ! ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ భక్తి పారవశ్యంతో తన్మయురాలైంది !
  ‘‘హే ! పరబ్రహ్మరూపా ! నీ దివ్య మంగళ రూపాన్ని దర్శించి ధన్యురాలినైనాను ! నాకింకే కోరికా లేదు ! నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామి !’’ అని ప్రార్థిస్తూ కన్నులరమోడ్చింది !

🌸ఆమెపై కృపావృష్టి కురిపించాడు స్వామి !  ‘‘శబరీ ! నీవు కోరినట్లు నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీ నిర్మలమైన భక్తి విశ్వాసాలను భావి తరాలవారు గుర్తుంచుకునేలా ఈ గిరి ప్రాంతమంతా నీ పేరుతో శబరిగిరిగా ప్రసిద్ధి పొందుతుంది ! దానిపై నేను శబరీశునిగా పిలువబడుతూ వెలిసి భక్తుల పూజందుకుంటాను !’’ అన్న స్వామి పలుకులు అమృతపు జల్లులా సోకాయి శబరి కర్ణపుటాలను ! 

🌿‘‘ధన్యురాలిని స్వామి ! ధన్యురాలిని !’’ అంటూ అంజలి ఘటించింది ! ఆమె ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది ! శబరి పార్థివదేహాన్ని దహనం కావించి చితాభస్మాన్ని ఆ ప్రాంతంలోనే ప్రవహిస్తున్న ఒక కొలనులో నిమజ్జనం కావించారు ఆమె బంధువర్గంవారు ! ఆ కొలను శబరి భస్మకొలనుగా ప్రసిద్ధికాంచింది !

🌸 ‘‘ముని పుంగవులారా ! ఇదీ భక్తురాలు శబరి పుణ్యచరితం ! కాలక్రమేణా భక్తులందరూ శబరి గిరీశునిగా స్వామి వెలిసిన ఆ పవిత్ర ప్రాంతాన్ని దర్శించి తమ జీవితాలు ధన్యం కావించుకోసాగారు !’’ అంటూ చెప్పటం ఆపాడు సూతమహర్షి

🌿 ‘‘మహర్షి ! అగస్తుని ఉపదేశంతో తేరుకున్న రాజశేఖరుడు తర్వాత ఏ విధంగా తన కర్తవ్యపాలన కావించాడో తెలుసుకోవాలన్న ఆత్రుతు కలుగుతున్నది ! దయచేసి ఆ విషయాలను గూడా చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను !’’ అంటూ వింటున్న వాళ్లంతా కోరడంతో చెప్పటం కొనసాగించాడు సూత మహర్షి !

🌹
రాజుకు ధర్మశాస్తా దర్శన ప్రాప్తి - ఆలయ నిర్మాణము🌹

🌸అగస్త్య మహర్షి ఉపదేశంతో స్వస్థుడైన రాజశేఖరుడు నిండు సభ నేర్పాటుచేయమని మంత్రికి ఆదేశించి , ప్రజలను , రాజ పరివారాన్ని ఉద్దేశించి ఆ సభలో తన సంకల్పం గురించి తెలియబరిచాడు ! ‘‘పందల రాజ్య ప్రజలారా ! రాజప్రముఖులారా ! మనకందరికి ప్రియతముడైన మణికంఠుడు మన మధ్య లేకపోయినా , విగ్రహ రూపంలో అవతరించి మనల్నందరిని ఎప్పటిలాగా అనుగ్రహిస్తూ వుంటానని మాట ఇచ్చిన విషయం మీకందరికీ తెలిసిన విషయమే !

🌿నా మూర్ఖత్వంవల్ల ఆ విగ్రహం వెలవడానికి తగిన విధంగా ఆలయ నిర్మాణం కావించడంలో కొంత ఆలస్యం జరిగినందుకు చింతిస్తున్నాను ! ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి మణికంఠుడు సంధించి వేసిన బాణం పడిన చోటును గుర్తించి అక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభించాలని నిశ్చయించుకున్నాను !

🌸ఈరోజే తగిన ముహూర్తం నిర్ణయించటం జరిగింది ! మీరందరూ కూడా నా వెంట రాదలచుకుంటే రావచ్చును !’’ గంభీరంగా రాజు చెప్పింది విని అందరూ హర్షం వెలిబుచ్చారు ! 
🌿  ‘‘మహారాజా ! తగిన నిర్ణయం తీసుకున్నారు ! మేమూ మీ వెంటే వస్తాము ! మా ప్రియతమ నాయకుడే మాకు తండ్రి ! తండ్రిలాగా మా అందరిని వాత్సల్యానురాగాలతో పాలించి వెళ్లిపోయినా మా వెంటనంటే ఎల్లప్పుడు యోగ క్షేమాలు విచారిస్తూ వుంటానని వాగ్దానం చేసిన ఆ స్వామి మాకు అయ్య , అప్ప

🌸(ఆ ప్రాంత వాడుక భాషలో తండ్రిని సంబోధించే పదాలు) ! ఇకపై అయ్యప్ప స్వామిగా మేమందరం భక్తిశ్రద్ధలతో పూజించుకుంటాము మా మణికంఠస్వామిని !’’ అంటూ తమ మనస్సులో మాటను విన్నవించుకున్నారు ! 

🌿‘అయ్యప్పస్వామి అయ్యప్పస్వామి ! ఆ దయాముయుడికి తగిన పేరు సూచించారు. ప్రజాలారా ! పదండి ! ఆ స్వామి ఆలయ నిర్మాణానికి తరలి వెళదాం !’’ అంటూ ఉత్సాహంగా అరణ్యంలోకి దారి తీశాడు రాజశేఖరుడు ప్రజలందరూ వెంటరాగా !

🌸అరణ్య ప్రాంతాన్ని చేరేసరికి రాత్రి అయింది ! మహారాజా !  ఈ రాత్రివేళ బాణం పడ్డ స్థలాన్ని కనుగొనడం కష్టం !  రాత్రికి ఇక్కడ విశ్రమించి , రేపు ప్రొద్దున్నే బయలుదేరడం మంచిది ! అని మంత్రి చెప్పిన సలహా సబబుగానే తోచడంతో సరేనన్నాడు రాజు ! సైనికులు వేసిన శిబిరంలో పడుకుని కళ్ల మూసుకున్నాడు రాజు !

🌿ఆయన మనోఫలకంమీద తాను వేటకు వెళ్లగా పంబా నదీ తీరాన బాలుడు దొరకడం , మణికంఠుడని నామకరణం చేసి ఎంతో వాత్సల్యంతో పెంచుకోవడం , అతని బాల్య చేష్టలు చూస్తూ మురిసిపోవడం మొదలైన దృశ్యాలు కనిపిస్తుంటే వాటితో తాదాత్మ్యం చెంది అలౌకికానందాన్ని పొందుతున్న రాజశేఖరుడు ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు. ఎవరో తనను పిలుస్తున్న అలికిడికి ! తన సమీపంగా నిలిచి వున్న ఆజానుబాహువైన దృఢకాయుడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఎవరు నీవు ? నా శిబిరంలోకి ఎలా ప్రవేశించావు ?’’ అని అడిగాడు !

🌸 ఆ పలుకులలో అనుమానం కూడా వ్యక్తమవడం గమనించి చిన్నగా మందహాసం చేశాడు దృఢకాయుడు !
  ‘‘మహారాజా ! నన్ను చూసి మీకు హాని కలిగించడానికి వచ్చిన శత్రువుగా భావించకండి ! నేను భూతనాథుడు , ధర్మశాస్తా అయిన మణికంఠుని ఆంతరంగిక సేవకుడిని ! భూతగణాలలో ముఖ్యుడిని , నా పేరు వపర ! తమరిని తన సన్నిధికి తీసుకురావలసిందగా ఆదేశించి నన్ను పంపారు మా నాయకుడు !

🌿మీరు నా వెంట బయలుదేరి రావలసిందిగా మనవి చేస్తున్నాను !’’ అంటూ అతను చెప్పింది వినగానే ఆనందంతో ముఖం వికసించగా దిగ్గున శయ్యపైనుండి దిగాడు రాజశేఖరుడు !
  ‘‘ఏమిటి ? నన్ను తీసుకురమ్మని నా తండ్రి , నా వరాల పాపడు , నా మణికంఠుడు మిమ్మల్ని పంపాడా ? పదండి ! వెంటనే వెళదాం !’’ అంటూ సిద్ధమైనాడు.

🌸 పుత్రవాత్సల్యం తిరిగి ఆయనను మాయలో పడవేయడం గమనించిన వపర పెదవులమీద వ్యాపించింది చిరునవ్వు ! గంభీరంగా వుండటానికి ప్రయత్నిస్తూ ‘‘ పదండి !’’  అన్నాడు. ఇద్దరూ శిబిరం బయటకు వచ్చారు ! పరివారం, ప్రజలు అందరూ గాడనిద్రలో వుండటం గమనించి నిశ్శబ్దంగా ముందుకు కదిలారు !

🌿చాలా దూరం నడిచివచ్చాక ఒక చోట ఆగాడు వపర ! రాజు ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు ! అక్కడంతా పట్టపగలులాగా వెలుగుతో నిండి వుంది ! ఒక గిరిమీద బంగారంతో చేయబడిన ఆలయంలో సింహాసనం ఒకటి జాజ్వలమానంగా వెలుగుతూ స్పష్టాస్పష్టంగా కనిపించింది !  ఆ సింహాసనం వరకు కొన్ని మెట్లు కూడా అమరి వుండటం గమనించాడు రాజు ! ‘‘ఇవన్నీ ఏమిటి ? మణికంఠుడెక్కడ ?’’ అని అడిగాడు    వపర వైపు కుతూహలం నిండిన కళ్లతో చూస్తూ !

🌸 ‘‘చెబుతాను! జాగ్రత్తగా విను రాజా ! ఈ ప్రదేశంలోనే పులి పాలకోసం అన్న నెపంతో మణికంఠస్వామి బయలుదేరి వచ్చి మొదటగా విశ్రమించారు ! వారి సేవ కోసం పరమేశ్వరుని ఆజ్ఞతో నేను మరికొందరు భూతగణాలతో వచ్చి వారిని కలుసుకున్నాను ! దేవతలు , ఋషిగణాలు కూడా ఇక్కడికి  వచ్చి మహిషిని సంహరించమని ప్రార్థించారు !

🌿వారి మొరలాలకించి వెంటనే ఆ ప్రాంతంలో నివశిస్తున్న ఆ రాక్షసిని ఎదుర్కొని , భీకరంగా రణం కావించి స్వామి దాని శరీరాన్ని మర్థించి వధించివేశారు. ఇంద్రాది దేవతలు ఆనందంతో హర్షధ్వానాలు కావిస్తూ స్వామి మీద పుష్పవృష్టి కురిపించారు !

🌸తమ కృతజ్ఞత తెలుపుకోవడానికి అప్పటికప్పుడే ఈ గిరిమీద స్వర్ణమందిరం ఒకటి నిర్మింపజేశాడు ఇంద్రుడు దేవశిల్పి విశ్వకర్మతో ! వారందరి ప్రార్థన మన్నించి స్వామి ఆ ఆలయంలో దేవతల ఆరాధనలను , సేవలను స్వీకరించారు ! రాజా ! ( మానవుల కళ్లకు కనిపించని ఈ ఆలయాన్ని ) నీకు దర్శింపజేయాలనే స్వామి నిన్ను ఇక్కడకు రప్పించటం జరిగింది ! పద ! వెళ్లి ! అప్పటి ఆ దృశ్యాన్ని చూసి ఆనందించుదువుగాని !’’ అంటూ వపర చెప్పింది విని ఆనందబాష్పాలతో నిండిపోయాయి రాజు కళ్లు ! 

🌿 ‘‘నామీద ఎంతటి దయ నీకు నా తండ్రీ !’’ అంటూ వణుకుతున్న కంఠంతో అనుకుంటూ వపర వెంట ఆలయానికి వెళ్లే సోపాన మార్గాన్ని చేరుకున్నాడు రాజు ! ‘‘ఈ మెట్ల మార్గం కూడా దేవతలు స్వయంగా ఏర్పరచినది ! రాజా ! ఆలయం మధ్యగా దేవతలు రత్నఖచిత సింహాసనం వంటి పీఠాన్ని అమర్చారు ! ఆ పీఠం బాలుని రూపంలో వున్న స్వామికి ఎక్కి కూర్చోవడానికి ఎత్తు ఎక్కువగా వున్నట్లు తోచడంతో ఇంద్రుడు కొందరు దేవతలను మెట్లలాగా అమరి స్వామికి ఎక్కడానికి వీలు కల్పించమని ఆదేశించాడు !

🌸అప్పుడు పద్ధెనిమిది మంది దేవతలు మెట్లలాగా పడుకుని స్వామిని తమపై పాదాలు మోపి ఎక్కి రావలసిందిగా ప్రార్థించారు !........సశేషం... 🙏

🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో  తెలుసుకుందాం...🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸🌿
🌸🌿🌸🌿🌸🌿


No comments: