Adsense

Wednesday, December 3, 2025

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 5 వ అధ్యాయం

 శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 5 వ అధ్యాయం ప్రారంభం!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿స్త్రీ చేతిలో మరణాన్ని నీవే కోరుకున్నావుగనక ఈ దివ్యాంగనను ముందర నిలిపి వాళ్లందరూ ప్రచ్ఛన్నంగా నిలిచి నిన్ను బందీని చేయజూస్తున్నట్లున్నారు. అందుకే నీవు అప్పుడే వెళ్లకు  ముందు మన సైన్యంలోని చిక్షురతామ్రాక్షులు , అసిలోమ బిడాలాక్షులు మొదలైన వారిని పంపు వాళ్లూ అవక్రమ పరాక్రమవంతులే ! వాళ్లు ఆమెను ఓడించి తీసుకురాగలరని నా నమ్మకం ’’  అన్నది మహిషి తమ్ముడిని ఆగమని చెబుతూ !

🌸  ఆమె మాటలు సమంజసంగా తోచడంతో సైన్యంలోని ముఖ్యులను తగిన బలగాలతో యుద్ధానికి పంపించాడు మహిషుడు ! వాళ్లందరూ ఆమె చేతిలో మరణించిన వార్త రావడంతో పట్టలేని కోపావేశంతో వూగిపోతూ భయంకర రూపంతో తరలి వెళ్లాడు మహిషాసురుడు సోదరి మాటను లక్ష్యపెట్టకుండా!

🌿అల్లంత దూరంలో నుండే దేవి దివ్య రూపాన్ని చూసి అచ్చెరువు పొందుతూ రాక్షస మాయా విద్యతో సుందర యువకుడి రూపు ధరించి ఆమెను సమీపించాడు మహిషుడు.

🌸‘సుందర రూపంతో నన్ను వివశుడిని చేసిన నీకు నా అభివాదనలు! కాంతామణి !  నీతో యుద్ధం చేయటం నాకు సమ్మతంకాదు ! నన్ను వరించి ,  నా రాణివై నాకు ఆనందాన్ని ప్రసాదించు !’’  అంటూ ప్రాధేయపూర్వకంగా పలికాడు!

🌿  ఆ మాటలకు చిన్నగా నవ్వింది దేవీమాత. ‘‘మహిషాసురా ! సహజంగా మహిషానివైన నీ పశు ప్రవృత్తికి తగినట్లు ఘోర రూపంతోనే నిన్ను వధిస్తాను! కాచుకో!’’ అంటూ రౌద్ర రూపంతో ప్రకటితమై శంఖం పూరించింది!

🌸మహిషాసురుడు సుందర రూపం విడిచి వివిధ క్రూర మృగాల రూపంలో మాతను ఎదుర్కొన్నాడు! అతను ప్రయోగించిన ఆయుధాలను తుత్తునియలు చేసి కొంతకాలం తీలగా యుద్ధం సాగించి చివరకు దేవతలందరి ప్రార్థన మన్నించి త్రిశూలంతో మహిషుని తలను ఖండించివేసింది జగన్మాత!

🌿అతని శరీరాన్ని నాటిన బాణాలు ప్రాణాలను హరించివేశాయి.  తల, మొండెము వేరై రక్తపుటేరులలో దొర్లసాగాయి. నాయకుడి మరణం మిగిలిన కొద్దిమంది రాక్షస భటులు వెనుదిరిగి పారిపోయారు.
  మహిషుని వధించి రౌద్రాకారంతో కళ్లనుండి అగ్నివర్షం కురిపిస్తూ యుద్ధ్భూమిలో నిలిచిన దేవీమాతమీద పూల వృష్టి కురిపిస్తూ జయ జయ ధ్వానాలు కావించారు దేవతలు నారదాది మునులు శ్రావ్యంగా గానం చేస్తూ మాతను ప్రస్తుతించారు! 

🌸🌹‘‘
అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందనుతే!

గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే!

భగవతి హే! శితికంఠ కుటుంబిని, భూరి కుటుంబిని భూరికృతే!

జయ జయహే! మహిషాసుర మర్దిని! రమ్యకపర్దిని శైలసుతే!’’
🌹

🌿మహిషాసురుని సంహరించి లోకాలలో శాంతిని ప్రతిష్ఠించిన దేవీ మాతకు కృతజ్ఞతలు తెలుపుకుని స్వర్గానికి తిరిగి వెళ్లారు దేవతలు. 

🌸  ‘‘శౌనకాది మునులారా ! మహిషాసుర మర్దినిగా అందరి చేత పూజింపబడసాగింది దేవీమాత ఆనాటినుండి ! ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమినాడు మహిషుని మర్దించిన కారణంగా ఆ రోజు మాతను విశేషపూజలతో అర్చించడంవల్ల సర్వశుభాలు ఒనగూడుతాయి !

🌿 పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రోత్సవం భక్తిశ్రద్ధలతో జరిపి దుర్గముడు , శుంభ నిశుంభులు , రక్తబీజుడు మొదలైన ఉగ్రదానవులెందరినో వధించి శాంతి భద్రతలు ప్రసాదించిన ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొంది జన్మలు ధన్యం కావించుకుంటున్నాము గదా! ఏదీ! అందరూ ఒక్కసారి కన్నులరమోడ్చి జగదంబకు నమస్కరించండి.

🌸🌹
‘‘శివే భవాని ప్రమదౌ షడాననే! మృడాని దుర్గే వరదే మహేశ్వరి!
చిదగ్ని కుండాంతర సంభవేంబికే! ప్రయచ్ఛమే మంగళ మంబ సత్వరం

!’’ అంటూ స్తుతించాడు సూత మహర్షి.🌹

🌿అందరూ భక్తితో ప్రణమిల్లిన తర్వాత ‘‘మహర్షి! రాక్షసులలో దైత్య, దానవులన్న రెండు తెగలేవిధంగా ఏర్పడ్డాయో తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను! రంభ, కరంభులు ప్రహ్లాదుని సంతతికి చెందినవారు కాదా?’’ అని అడిగాడు ఒక ముని కుమారుడు లేచి వినయంగా నమస్కరించి! 

🌸  అతని వైపు చిరునవ్వుతో చూశారు సూతమహర్షి ! ‘‘మంచి ప్రశ్న అడిగావు !  కశ్యపుని పద ముగ్గురు భార్యలలో అదితికి దేవతలు జన్మించారు ! దితి , దను , సింహిక అనే ముగ్గురికి తమోగుణ ప్రధానులైన రాక్షసులు జన్మించారు ! దితిపుత్రులు దైత్యులనీ , దను పుత్రులు దానవులనీ పిలవబడ్డారు ! 

🌿దైత్యులు , దానవులు అన్యోన్యంగా కలిసి వుండేవారు !  సింహికకు జన్మించిన పుత్రుడు రాహువు సైన్యాధిపతిగా నియమింపబడ్డాడు. సింహక తపస్సుతో బ్రహ్మను మెప్పించి తన పుత్రుడు అమరత్వం , దైవత్వం పొందేట్లు వరం పొందింది ! 

🌸ఆ కారణంగానే క్షీర సాగర మథన సమయంలో మహావిష్ణువు రాహువుమీద జగన్మోహిని మాయను ప్రసరింపజేయలేదు ! అందువల్ల రాహువు దేవతల పంక్తిని చేరి అమృత పానం కావించాడు !  అతను తమోగుణ ప్రధానుడు , కనుక అతని శరీరాన్ని రెండు భాగాలు చేసి వాటికి సర్పాకృతి అనుగ్రహించి గ్రహ మండలంలో ప్రత్యేక స్థానాలిచ్చి దైవత్వాన్ని ప్రసాదించాడు శ్రీమహావిష్ణువు !

🌿దైత్యులలో వాళ్ల తల్లి తపస్సు ఫలితంగా బలపరాక్రమవంతులైన కుమారులు జన్మించి ముల్లోకాలను జయించి , నిరంకుశంగా పాలిస్తుండటం , వాళ్లను శ్రీమహావిష్ణువు సంహరిస్తుండటం జరిగేది ! 
   దానవులలో దనువు అనే రాక్షసుని పుత్రులైన రంభ ,  కరంభులకు తమ పుత్రులు ముల్లోకాలు జయించాలన్న కోరిక కలగడంతో వారుకూడా తపస్సుకు పూనుకోవటం , మహిషుడు జన్మించటం జరిగింది కదా !

🌸 మహిషుని లాగే దానవ ప్రభువులైన శుంభ నిశుంభులను కూడా జన్మాగతే వధించింది ! వీరందరూ స్త్రీ చేత మాత్రమే మరణాన్ని వరంగా పొందడం కూడా అందుకు కారణం!  ఇక మహిషాసురుని మరణానంతరం అతని సోదరి మహిషి కోరిన చిత్రమైన కోరిక మణికంఠుని అవతరణానికి కారణమైంది !’’  అంటూ చెప్పటం కొనసాగించారు సూతమహర్షి !

🌿‘‘ఓం బ్రహ్మదేవాయనమః! ఓం బ్రహ్మదేవాయనమః!’’ అంటూ సత్యలోకాన్ని చుట్టివేసి ప్రతిధ్వనించసాగాయి. భూలోకం నుండి ఎగిసివచ్చిన తపోజ్వాలలు !  వాటివైపు ఆందోళనగా చూస్తూ ‘‘స్వామీ ! మహిషి కావిస్తున్న తపస్సు అంతకంతకు తీవ్రవౌతున్నది ! 

🌸ఆ తపోజ్వాలలను అరికట్టకపోతే లోకాలను దహించివేయగలవు ! ఆమె తపస్సును విరమించేలా చేయవలసిన బాధ్యత మీదే గదా స్వామీ! ’’ అన్నది సరస్వతీదేవి ఆందోళనగా చూస్తూ! 
  ‘‘అవును ! ఆమె తపస్సును విరమింపజేయడానికి దేవతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు ! 

🌿ఇక నేను తరలి వెళ్లక తప్పదు!’’ అని హంస వాహనరూఢుడై మహిషి ముందర సాక్షాత్కరించాడు బ్రహ్మదేవుడు! ‘‘పుత్రీ !  నీ తపస్సుకు ప్రసన్నుడినైనాను ! ఏం వరం కావాలో కోరుకో!’’ అంటూ బ్రహ్మ పలుకులు వినిపించడంతో కళ్లు తెరిచి చూసింది మహిషి !

🌸భక్తిపూర్వకంగా నమస్కరించి ‘‘హే విధాతా ! నాకు అమరత్వాన్ని ప్రసాదించండి’’ అంటూ కోరింది ! ‘‘అమరత్వం అమృతపానంతోనే లభ్యవౌతుంది ! కనుక అది తప్ప వేరే ఏదైనా కోరిక వుంటే చెప్పు , తప్పకుండా తీరుస్తాను!’’ అన్నాడు బ్రహ్మ శాంత గంభీర స్వరంతో !

🌿 కొద్దిసేపు వౌనంగా ఆలోచించి ‘‘అయితే శివకేశవులకు జన్మించి, పన్నెండు సంవత్సరాలు భూలోకంలో పెరిగిన బాలుడు చేతిలో తప్ప ఇతరులెవరి వల్లా మరణం రాకుండా అనుగ్రహించండి’’ అని వేడుకుంది మహిషి ! ‘

🌸‘తథాస్తు’’ అని అంతర్థానం చెందాడు బ్రహ్మదేవుడు
...సశేషం... 🙏

🌹
తరువాయి భాగం రేపటి శీర్షికలో  తెలుసుకుందాం...

No comments: