ప్రజలకు అందుబాటు ధరల్లో అత్యవసర మందుల సరఫరా
దేశవ్యాప్తంగా 7,733 జనఔషధి కేంద్రాల కృషి
దేశంలో కోవిడ్-19 మహమ్మారి ఉధృతిని కట్టడి చేయడంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు (పి.ఎం.బి.జె.కె.లు), ఔషధ ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (బి.పి.పి.ఐ.), పంపిణీ దార్లు, ఇతర భాగస్వామ్యవర్గాలు సమష్టిగా పోరాటం సాగిస్తూ వస్తున్నాయి.
ఈ పోరాటంలో భాగంగా ఈ ఏడాది మే నెల 13వ తేదీనాటికి దేశంలో 7,733 పి.ఎం.బి.జె.కె.లు పనిచేస్తూ ఉన్నాయి. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం (పి.ఎం.బి.జె.పి.) కింద, 36రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లోనూ ఈ కేంద్రాలు తమ విధులను నిర్వహిస్తూ ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా 1,449 రకాల మందులు, 204రకాల సర్జికల్ పరికరాలు, వినియోగ వస్తువులను విక్రయిస్తున్నారు. అత్యవసరమైన మందులు, ఫేస్ మాస్కులు, శానిటైజర్లు వంటివి దేశవ్యాప్తంగా ఈ కేంద్రాల ద్వారా సులభంగా అందుబాటులోకి తెచ్చారు. పి.ఎం.బి.జె.పి. పథకం కింద అత్యుత్తమ నాణ్యత కలిగిన ఫేస్ మాస్కులను ఈ కేంద్రాల్లో ఒక్కొక్కటి 25 రూపాయల ధరకే విక్రయిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో, ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీ నాటికి బి.పి.పి.ఐ. రూ. 80.18 కోట్ల విలువైన అమ్మకాలు జరిపింది. దీనితో దేశ పౌరులకు మందులపై దాదాపు రూ. 500కోట్ల మేర ఆదా అయ్యింది.
ఆయా కేంద్రాలకు మందుల సరఫరాకు సంబంధించిన రవాణా, తదితర మౌలిక సదుపాయాల వ్యవస్థను కూడా ఇపుడు బలోపేతం చేస్తున్నారు. ప్రస్తుతం గురుగ్రామ్, గువాహటి, చెన్నై ప్రాంతాల్లోని మూడు అధునాతన గిడ్డంగులు మందుల నిల్వకు, పంపిణీకి ఉపయోగపడుతున్నాయి. సూరత్ లో నాలుగవ అధునాతన గిడ్డంగి కూడా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇక దేశంలో మారుమూలన ఉన్న ప్రాంతాలకు, సుదూర గ్రామీణ ప్రాంతాలకు మందుల సరఫరా కోసం 37 పంపిణీ సంస్థలను కూడా నియమించారు.
2020-21వ సంవత్సరంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి సమస్య మొదలైనపుడు ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన పథకం (పి.ఎం.బి.జె.పి.) దేశానికి అత్యంత ఆవశ్యకమైన సేవలను అందించింది. లాక్ డౌన్ సమయంలో కూడా ఈ విక్రయ కేంద్రాలు (స్టోర్లు) పనిచేశాయి. నిత్యావసర మందులు నిరాటంకంగా అందుబాటులో ఉండేలా కార్యకలాపాలను నిర్వహించాయి. పి.ఎం.బి.జె.పి. పథకం కింద సరఫరా చేసే మందుల ధరలను మూడు అగ్రశ్రేణి బ్రాండులకు చెందిన మందుల సగటు ఖరీదులో గరిష్టంగా 50శాతంగా నిర్ణయించారు. దీనితో, ఔషధి మందుల ధర ఇతర మందులతో పోల్చితే కనీసం 50 శాతం తక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భంగాల్లో బ్రాండెడ్ మందుల మార్కెట్ ధర కంటే 80నుంచి 90శాతం వరకు తక్కువగా కూడా ఉంటుంది.
2020-21 ఆర్థిక సంవత్సరంలో లాక్ డౌన్, తదితర ఆంక్షలు ఎదురైనప్పటికీ, బి.పి.పి.ఐ. గణనీయమైన స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. రూ. 665.83 కోట్ల మేర వ్యాపారాన్ని సాగించింది. దీనితో దేశంలోని సామాన్య పౌరులు మందులపై దాదాపు రూ. 4,000కోట్ల మేర ఖర్చును ఆదా చేయగలిగారు. ప్రజలకు అత్యవసరమైన, డిమాండ్ ఎక్కువగా ఉన్న ఫేస్ మాస్కులు, హైడ్రాక్సీ క్లోరోక్వీన్, ప్యారాసిటమాల్, అజిత్రో మైసిన్ వంటి మందులు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా బి.పి.పి.ఐ. చర్యలు తీసుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 25లక్షల ఫేస్ మాస్కులను, లక్షా 25వేల శానిటైజర్లను, కోటీ 37 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్వీన్ మాత్రలను, 32కోట్ల ప్యారాసిటమాల్ మాత్రలను బి.పి.పి.ఐ. విక్రయించింది. దేశవ్యాప్తంగా పనిచేసే 7,500కిపైగా జన ఔషధి కేంద్రాల ద్వారా అందుబాటు ధరల్లో వీటిని విక్రయించింది. ఇక ప్రపంచంలోని మన మిత్ర దేశాల్లో పంపిణీ కోసం రూ. 30 కోట్ల విలువైన మందులను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా బి.పి.పి.ఐ. సరఫరా చేసింది. కోవిడ్ చికిత్సలో వినియోగించే చాలా వరకు మందులతోపాటు, ప్రిస్కిప్షన్ లేకుండా విక్రయించే పలు రకాల మందులన్నీ పి.ఎం.బి.జె.పి. పరిధిలోకి తీసుకువచ్చారు. మహిళలు, పిల్లలతో సహా అందరికీ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి దోహదపడే అనేక పౌష్టకాహార ఉత్పాదనలను కూడా పి.ఎం.బి.జె.పి. తన పరిధిలోని విక్రయ జాబితాలో చేర్చింది. ఈ ఉత్పాదనలన్నింటినీ మార్కెట్ ధరలతో పోల్చితే 50నుంచి 90శాతం తక్కువ ధరల్లోని పి.ఎం.బి.జె.పి. పరిధిలో అందుబాటులో ఉంచారు.
గత ఏడాది, లాక్ డౌన్ సమయంలో కూడా ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు తమ సేవలను అందించాయి. సామాన్య ప్రజలందరికీ నాణ్యమైన జనరిక్ మందులను అందుబాటు ధరల్లో ఇంటి ముంగిళ్ల వద్దకే సరఫరా చేశాయి. “స్వస్థకీ సిపాహీ” లుగా ప్రజల్లో పేరు పొందిన ఈ కేంద్రాల ఫార్మాసిస్టులు వయో వృద్ధులైన రోగులకు ఇళ్ల ముంగిళ్లకే మందులను సరఫరా చేశారు.
Release Id :-1718663
No comments:
Post a Comment