Adsense

Thursday, July 15, 2021

పొలానికి చేనుకు తేడా ఏమిటి ?

పొలానికి చేనుకు తేడా ఏమిటి ?
------------------
స్నేహితులకు శుభోదయం!!
నేడు జులై 14 వ తేదీ. 
తిథి ఆషాఢమాస శుద్ధ చవితి. 
నేటి తేదీపైన తిథిపైన తెలుగు శాసనం లభించలేదు కానీ..
(1) శక 1167 విశ్వావసు సంవత్సర ఆషాఢమాస శుక్ల పక్షంలో యివ్వబడిన సంతరావూరు (గుంటూరు జిల్లా)శాసనంలో కాకతీయ గణపతిదేవుని పాలనలో రామనాథదేవర అంగరంగ భోగాలకు కరణం మారయ రావూరి దగ్గుంబాటి పొలమున చేనును యిచ్చినట్లుగా చెప్పబడ్డది.[ద.భా.దే.శా X నెం 303].
(2) అట్లే శక 1242 (1320 క్రీ.శ)రౌద్రి సంవత్సర ఆషాఢమాసంలో యివ్వబడిన అల్లూరు (ప్రకాశం జిల్లా)శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో బమ్మయనాయనింగారు అరలూరు ఇష్టకామేశ్వర దేవరకు వ్రిత్తి 400 గుంటలు అర్చన వ్రిత్తిగా 100 గుంటలు భూమినిచ్చినట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు II ong 9].
కొన్ని పదాలకు నాకు తెలిసిన, సేకరించిన వివరాలు.
(అ) ఆషాఢమాసం =ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథునరాశి నుంచి కర్కాటకరాశి లోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పర్ణమి రోజును గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు.
ఆషాఢమాసంలో రైతులఇంట  ఆహారధాన్యాలు నిండుకుంటాయి అంటే ఖాళీఅవుతాయన్నమాట. అప్పటికే విత్తువేసివుంటాడు. వర్షాలు సరిగా కురవవు. పోనీలే చేన్లోనుంచి ఇంటికి వచ్చేధాన్యమైనా వుంటుందాంటే అదీ వుండదు. వర్షాలు సరిగా కురవవు కాబట్టి రైతులకు కూలీలకు పనిదొరకదు. ఇంట్లో గింజలుండవు. అంచేత ఆకలి ఒకటే ఆకలి. ఆకలికి తట్టుకోలేక సామాన్యజనం అడవిలో దొరికే ఈతగడ్డలను, భూచక్రగడ్డలను, తామరగడ్డలను* తింటారు, బందరాకు, చెంచలిఆకు, పాలవాకులను మాదరించి** తింటారు. ఆకలికి తట్టుకోలేక, బిడ్డల అవస్థలు చూడలేక తల్లులు తాళిబొట్టలను ఇంట్లోవున్న చెంబుతపేలాలను, చివరకు గొడ్డుగోదాను కూడా అమ్మేసుకొంటారు. తిండిలేక డొక్కలు లోపలికి పీక్కుపోయివుంటాయి. కండ్లలోగుంతలు వస్తాయి. ఓ ముద్ద కో వెట్టిచాకిరిలు చేయాల్సివుంటుంది. ఈ పరిస్థితి ఒక్కపుడు రాయలసీమకు ప్రత్యేకం.
(ఆ) శుక్లపక్షం =శుక్ల పక్షమంటే అమావాస్య నుంచి పున్నమి వరకు,రోజు రోజుకూ చంద్రుడి తో బాటే వెన్నెల పెరిగి రాత్రుళ్ళు తెల్లగా, కాంతివంతంగా అవుతాయి. శుక్ల అంటే తెల్లని అని అర్థం.
(ఇ) వ్రిత్తి = వృత్తి, ఇంకా ప్రత్యేకహక్కు (ప్రివిలేజ్) అనే అర్థం కూడా వుంది.
(ఈ) పొలమున చేను = సామాన్యార్థంలో పొలానికి చేనుకు ప్రత్యేక అర్థమేమి లేదు. రెండింటి అర్థం వ్యవసాయక్షేత్రమే. కాని విస్తృతార్థంలో రెండు వేరువేరే. ఒక గ్రామానికి చెందిన మొత్తంవ్యవసాయ భూభాగాన్ని కొన్ని సందర్భాలలో గ్రామానికి చెందిన మొత్తం భూభాగాన్ని పొలమనే అంటారు.
మీరు ఇంటిస్థలం లేదా వ్యవసాయభూమిని కొన్నాలన్నా సబ్ రిజిస్ట్రారుకు ఇచ్చే పత్రాలలో పొలంవివరాలు వ్రాస్తాం. ఉదా॥ అనంతపురం జిల్లా హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాలోని చిలమత్తూరు సబ్ డివిజన్ కు చెందిన గోరంట్లపొలంలోని సర్వే నెంబరు 99లోని 13 ఎకరాలపైకి 10 ఎకరాల చేను.
ఇక్కడ పొలం అంటే రెవెన్యూగ్రామమని భావం.ప్రతి రెవెన్యూగ్రామానికి ప్రస్తుతం 3 నుండి 10 వేల ఎకరాల భూమి కలదు.
ఈ శాసనంలోని దాత సంతరావూరు రామనాథదేవుడికి దగ్గుబాటి పొలంలో చేనును దానం చేశాడు.
(ఉ) అర్చకవ్రిత్తి = అర్చకత్వాన్ని వృత్తిగా కలిగివుండడం.
(ఊ) గుంటలు = ఆనాడు అమలులోనున్న భూమి కొలమానం. ప్రస్తుతం ఒక ఎకరానికి నలభై గుంటలు.ఎకరానికి 4800 చదరపు గజాలు. 
(ఎ) రామనాధదేవర = రామనాథదేవర అని శాసనంలో వుండాలి. ధ వుంది. థ అని వుండాలి. విశ్వనాధ, విశ్వనాథ్, సూర్యకుమార్, అమరనాథ్ అని తెలుగులో వ్రాయరాదు.విశ్వనాథ, సూర్యకుమార, అమరనాథ అనే ఖచ్చితంగా వ్రాయాలి. ఆంగ్లం, తమిలం, హిందీ భాషలలో ఈ తప్పనిసరిలేదు. తెలుగులో తప్పనిసరి.తామరగడ్డలు = తామరలు కొలనులో మడుగులలో వికసిస్తాయి.మడుగులు చెరువులు ఎండినపుడు ముందుతామర చెట్లు పెరిగినచోట తవ్వితే గడ్డలు దొరుకుతాయి. ఇవే తామర గడ్డలు.వర్షాలకు దరువులు, తలిపెరలు, కాలువలు వాగులు నిండితే ఈ గడ్డల నుండే తామరలు మరలా మొలకెత్తుతాయి.మావూర్లో తామరఒడ్డనే రెండు మూడు ఎకరాలలో జలాశయం ఉండేది. అది తామరలకు కమలాలకు నీటికోళ్ళకు, రకరకాల నీటిపక్షులకు నిలయంగా వుండేది. ఇపుడు ఆక్రమణలకు గురై మసీదు, గుడి, నివాసాలు పెరిగాయి.తామరొడ్డులో ఈ గడ్డలు నేను తిన్నాను.** మాదిరించి = మనం తాళింపుగా పిలుచుకొంటున్న ఈ పదానికి అసలైన అచ్భమైన తెలుగుపదం మాదరింపు. మేము మాదరింపనే అంటాం.
-సేకరణ

No comments: