Adsense

Saturday, July 10, 2021

🌺 ఆషాఢమాసం ప్రాముఖ్యత 🌺

🌺 ఆషాఢమాసం ప్రాముఖ్యత 🌺
ఆషాఢ మాసము తెలుగు సంవత్సరంలో నాలుగవ నెల. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల. పూర్వాషాఢ నక్షత్రంతో పౌర్ణమి వస్తుంది కనుక ఆషాఢ మాసం అంటారు. 

ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. శుభకర్యాలకు అవకాశం లేదు. ఆషాఢమాసంలో గృహనిర్మాణానికి ఆరంభించిన భృత్య రత్న పశుప్రాప్తి అని చెబుతుంది మత్స్య పురాణము.

ఈ మాసంలో తెల్లవారు జామున నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకుని పుణ్య నదులను స్మరిస్తూ స్నానమాచరించి నిత్యానుష్టానాలు, ఇష్టదేవతారాధనలతో పాటూ శివకేశవులను, పార్వతీదేవిని, శ్రీమహాలక్షిని పూజించాలని శాస్త్ర వచనం.

ఆషాడంలో చేసే సముద్ర నదీస్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢమాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు, ఉసిరికలను దానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. 

ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తను తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు, వ్రతాలుతో, నవ దంపతులకు ఆషాఢ నియమం పాటించమని చెబుతారు. ఆషాఢమాసంలో ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు. ఆడవారు ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలంటారు. కొత్త దంపతులకు, అత్త అల్లులకు, అత్త కోడళ్లకే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాశస్త్యం కలిగినది ఆషాఢం.  


ఆషాఢ మాసం విశేషాలు:

సూర్యుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుంచే దక్షిణాయానం ప్రారంభమవుతుంది. 

పూరి క్షేత్రంలో ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు జగన్నాధ రథయాత్రను నిర్వహిస్తారు. అదే అధిక ఆషాఢమాసము వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాధ ఆలయంలోని మూలవిరాట్టుల్ని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని 'నవకళేబర ఉత్సవం' అంటారు.

ఈ మాసంలోనే స్కందపంచమి, సుబ్రమణ్యషష్టి వస్తాయి. 

మహాభారతాన్ని రచించిన వ్యాసుభగవానుడిని ఆరాధించే రోజే వ్యాస పూర్ణిమ. ఆషాఢ శుద్ద పౌర్ణమి దీన్నే గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. 

ఈ నెలలో వచ్చే ఏకాదశిని తొలిఏకాదశిగా జరుపుకొంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు. దీంతో తొలి ఏకాదశిగా భక్తితో దీక్ష చేపడుతారు. ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు ప్రారంభమవుతాయి.

సికింద్రాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతుంది. ఆషాఢమాసంలో తెలంగాణలో బోనాలు ప్రారంభమవుతాయి.

ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికం కలిసిన విశిష్టమైన మాసం ఆషాఢమాసం.

🌸🌹🌸🌹🌸🌹🌸🌹🌸🌹🌸🌹

No comments: