Adsense

Wednesday, August 4, 2021

నేడు కామిక ఏకాదశి

 నేడు కామిక ఏకాదశి
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

ఆషాఢ మాసములో కృష్ణ పక్ష ఏకాదశిని  *కామిక ఏకాదశిగా* జరుపుకుంటారు. 
ఈ ఏకాదశికి పేరుకు తగినట్లే మనసులోని కోరికలను సిద్ధింపచేసే శక్తి ఉందని భావిస్తారు. 
శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లిన నాలుగు నెలల కాలంలో వచ్చే మొదటి ఏకాదశి కావటంతో దీనిని విశేషంగా పరిగణిస్తారు.

శ్రీహరిని ఆరాధించటం , తులసీ దళాలతో పూజ చేయటం , వెన్నను దానం చేయటం ఈ ఏకాదశి  ప్రత్యేకతలుగా చెప్పబడ్డాయి.
 
*కామిక ఏకాదశి మహత్యం - వ్రత కథ*
ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణున్ని *" ఆషాఢ మాసములో కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని"* కోరగా , దానికి ఆ వాసుదేవుడు సంతోషించినవాడై  "ఓ రాజా ! ఏకాదశి యొక్క మహిమలను వివరించటం కూడా పుణ్య కార్యమే , ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మ దేవుడిని ఇలా అడిగాడు. *" ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని గురించి వివరించండి. ఆ రోజునకు అధిదేవత ఎవరు , వ్రతమును ఆచరించవలసిన విధి విధానమును గురించి దయయుంచి తెలపండి"* అని కోరాడు. 
 
దానికి బ్రహ్మ బదులిస్తూ " నా ప్రియమైన కుమారుడా ! మానవాళి సంక్షేమం కోసం నీవు అడిగిన విషయములన్నీ వివరించెద. ఆషాఢ కృష్ణ పక్షములో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి  మహిమ విన్నంతనే అశ్వమేధ యాగ ఫలం లభిస్తుంది. శంఖ , చక్ర గదాధరుడు , తామర పాదములు కలిగి ఉన్నవాడు , శ్రీధరుడు , హరి , విష్ణు , మాధవుడు మరియు మధుసూధనుడు అనే పేర్లతో పిలవబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు.  

కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలం కాశీలో గంగ స్నానం కన్నా , హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా , సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా , సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా , గురు గ్రహం సింహ రాశిలో ఉన్న పౌర్ణమి రోజు - సోమవారం , గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. 
 
కామిక ఏకాదశి రోజు పాలు ఇచ్చే గోవును , దూడ మరియు గ్రాసములతో  కలిపి దానం చేయటం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతములో చేసిన పాపములకు భయపడేవారు , పాపమయమైన జీవితంలో కూరుకపోయినవారు ఏకాదశి వ్రతమాచరించి మోక్షమును పొందవచ్చు. 
ఏకాదశి రోజులు స్వచ్చమైనవి మరియు పాప విమోచనమునకు అనువైనవి. 
 
నారదా ! ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు.  *" కామిక ఏకాదశి రోజు ఉపవసించినవారు , సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారి కన్నా గొప్పవారు."*  ఈ రోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణం చేసిన వారు ఎప్పుడూ యమధర్మరాజు కోపానికి గురికారు... 
ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షమును పొందుతారు. 
కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి.  కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు , అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. 
 
ఒక్క తులసి ఆకుతో ఆరాధించటం వలన వచ్చే పుణ్యము , బంగారం , వెండి దానం చేస్తే వచ్చే దాని కన్నా ఎక్కువ. తులసి ఆకుతో ఆరాధిస్తే శ్రీహరి , ముత్యాలు , కెంపులు , పుష్పరాగములు , వజ్రాలు , నీలం మరియు గోమధికములతో పూజించినదానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు.  లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించివేస్తుంది.
*కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి.* తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ల పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. 
ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వుల మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో , వారు శాశ్వతముగా సూర్యలోకములో నివసించే అర్హత కలిగి ఉంటారు...
కామిక ఏకాదశికి బ్రహ్మ హత్యా పాతకాన్ని , భ్రూణ హత్యా పాపమును కూడా తొలగించే శక్తి ఉంది. *" అని బ్రహ్మ నారదునితో చెప్పినట్లుగా" శ్రీకృష్ణుడు ధర్మరాజు తో చెప్పెను.*..🚩🌞🙏🌹🎻
      
  *🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏*

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments: