Adsense

Monday, August 30, 2021

కృష్ణాష్టమి ప్రత్యేకత

 


👉.శ్రావణమాసంలో వచ్చే కృష్ణాష్టమిని దేశవిదేశాలల్లోని శ్రీకృష్ణుడు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. లోకంలో ధర్మం నెలకొల్పడం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన ఈ శుభదినాన్ని కృష్ణాష్టమి, గోకులాష్టమిగా విశేషంగా జరుపుకుంటారు. 

👉ఈరోజు ప్రతి ఇంట్లో చిన్ని చిన్ని గోపికమ్మలు, బుడిబుడి అడుగులు వేసే బుడతలు బాల కన్నయ్యలు దర్శనమిస్తారు. మతాలకు అతీతంగా తమ పిల్లలను కృష్ణుడిలా రెడీ చేసి మురిసిపోతారు. గోపికమ్మలు, చిన్నారి కన్నయ్యలు చేసే సందడి అంతాఇంతాకాదు.

👉కృష్ణాష్టమని రోజున ప్రతి ఇంట్లో తల్లి తనని తాను యశోదగా భావించి పూజలు నిర్వహిస్తుంది. ఈరోజు ఎవరైతే కృష్ణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. సంతానలేమితో బాధపడే వారు ఈ రోజు కృష్ణుని పూజిస్తే బుడిబుడి అడుగుల చిన్నారి కన్నయ్య తమ జీవితంలోనూ అడుగుపెడతారని నమ్మకం.

🛎 పూజా విధానం:

👉కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి, ఇంటి గుమ్మాలకు మామిడితోరణాలు కట్టి.. కృష్ణుడుని పూజించి.. కన్నయ్యని ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్న చిన్న పాదముద్రలు వేస్తారు. చిన్ని కృష్ణుని విగ్రహాని శక్తి కొలదీ అలంకరించి పంచామృతాలతో అభిషేకం చేయాలి. 

అనంతరం కన్నయ్య విగ్రహాన్ని గోరు వెచ్చని నీటితో అభిషేకం చేయాలి. తర్వాత కన్నయ్యకు పట్టు వస్త్రాలు కట్టి, ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ముఖ్యంగా తులసీదళాలతో చేసిన మాలను అలంకరించాలి.

👉శ్రీకృష్ణుడిని ఊయలలో ఉంచి లాలిపాటలు, కీర్తనలతో పూజలు చేస్తారు. ఇక కృష్ణ లీల సమయంలో పారిజాతం పువ్వులను ఉపయోగిస్తే కృష్ణుడికి ఇష్టమని పురోహితులు చెప్పారు. ఇక పూజా సమయంలో శాకాహారంతో కూడిన ఆహారపదార్ధాలను తమ శక్తికొలదీ నైవేద్యంగా పెట్టాలి. ముఖ్యంగా అటుకులు, వెన్న కృష్ణుడి సమర్పిస్తే మంచిదని అంటారు.

👉కృష్ణలాలి- ఉట్టి కొట్టే సంబరం

👉కృష్ణలాలి కార్యక్రమం అయిన తర్వాత ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రత్యేక పూజను నిర్వహించి అప్పుడు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి.

 ఇక కృష్ణాష్టమి వేడుకల్లో అత్యంత ప్రధానమైంది ఉట్టి కొట్టే సంబరం.ఈ సంబరంలో యువత ఉత్సాహంగా పాల్గొంటారు. ఉత్తరభారతంలో దీనిని దహి హండీ అని పిలుస్తారు. ఇంటింటికీ వెళ్లి మట్టికుండలో పెరుగు పాలు చిల్లరడబ్బులు సేకరించి దానిని ఉట్టి లో పెట్టి ఆతర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకి పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు.

 ఉట్టికొడుతున్న సమయంలో వసంతం నీరు పోస్తూ చిన్న పెద్దా చేసే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఇక ఈరోజు గీతాపఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు...స్వస్తి ..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

No comments: