Adsense

Wednesday, June 15, 2022

శ్రీ అమరలింగేశ్వర స్వామి: అమరావతి


🌀 పంచారామాలలో మొట్టమొదటిది ‘అమరారామం’. 
అమరారామము, కొమరారామము, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో మొదటిది

💠 ఇక్కడ 'అమరేశ్వరస్వామి' కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’ ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు.

💠 శంకరుడులో ‘శం’ అంటే శుభాన్ని, ‘కరుడు’ అంటే కలిగించే వాడనే అర్థం దాగుంది. 
స్థల పురాణం ప్రకారం తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి తారకుని కంఠంలో ఉన్న శివలింగాన్ని చేధించగా ఏర్పడిన అయిదు శకలాల్లో (ముక్కలు) పెద్దది, మొదటి శకలం పడిన చోటు ఈ అమరారామం.

💠 ఇక్కడ అభించిన శాసనాలలో
అమరావతి పూర్వనామం ధష్టుకడ (ధరణికోట) లేక ధాన్యకటకం అన్న పేర్లే కాని అమరావతి అన్న పేరు కన్పించదు. 
అమరావతిలో ఒకప్పడు బౌద్ధ స్తూపం వుండేది. అది అద్భుత శిల్పకళకు పుట్టినిల్లు. మరుగున పడిపోయిన ఆ స్తూపపు అవశేషాలను వెలికి తీసి ఆంగ్లేయులు చాలవరకు లండన్ మ్యూజియానికి తరలించారు. అమరావతి శిల్పాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. మిగిలిన కళాఖండాలను ఇక్కడ నెలకొల్పిన మ్యూజియంలో భద్రపరచి ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ బుద్ధ భగవానుని ఆస్థికాశశేషాలున్న స్ఫటికపు భరిణె లభించింది. భారతీయ శిల్పకళకు అమరావతి కళ శిరోభూషణమని కళాకోవిదులు వ్రాశారు. అమరావతి కళ తనదైన ఒక బాణీని ఏర్పరచుకొని అమరావతి శిల్పరీతిగా ప్రపంచ ప్రస్థిది పొందింది.
ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం

💠 కృష్ణా నదీ తీరంలో వెలసిన మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం ఇది. 
ఈ క్షేత్రంలో అమరేశ్వర లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్టించాడు. 
అందువల్లే ఇక్కడి శివయ్య అమరేశ్వరుడయ్యాడు. 
ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంధ, బ్రహ్మ, పద్మ పురాణాలలో చెప్పారు. 

💠 ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి.  ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివలింగాలే కాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నారు.
 రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు.
మూడవ ప్రాకారంలో నైరుతిలో
కాశీ ,శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు. 

💠 భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి ఆ దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం.

💠 శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది.
దక్షిణ ముఖంగా ముఖ మండపం, తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణవేణి ప్రవాహం ఉంది. దీనినే "‘పంచాయతన క్షేత్రం"’ అంటారు. 

💠 రాక్షసులకు మరియు దేవుళ్ళకు జరిగిన యుద్ధములో దేవుళ్ళు ఓడిపోవడంతో పరమ శివుడిని ఆశ్రయించగా అప్పుడు
దేవతామూర్తులను ఈ అమరావతిలో ఉంచి రాక్షసులను ఈ ప్రాంతములోనే వధించాడు.
అమరులను ఈ ప్రదేశంలో కాపాడాడు కనుక  అమరావతి అని పిలువబడుతుంది. 

💠 ఈ అమరావతికి ఒక పురాణ కథ కూడా వుంది. దేవేంద్రుడు అహల్యా జారుడై తత్పాప పరిహారార్ధం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్టించబడినది గాబట్టి ' అమరావతి ' నామము సార్ధకంగా ప్రసిద్ధమయినది అని అంటారు. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీరామచంద్రుని చేత పూజించబడ్డ శివలింగంగా ప్రసిద్ధిగాంచింది.

💠 అమరావతి ఆలయంలో లింగం చాల పొడవుగా వుంటుంది. ఇక్కడ ప్రచారంలో వున్న కథ ప్రకారం ఈ లింగం 'పెరుగుతూ వుండేదట. అందువలన ఎప్పటికప్పుడు గుడిని పెంచవలసి వస్తుండేది. చివరకు విసుగుచెంది అర్చకులలో వొకరు స్వామిపై ఒక మేకు కొట్టారు. అంతటితో లింగం పెరుగుదల ఆగిందట. దీనిని నిదర్శనంగా తెల్లని లింగంపై ఎర్రని (నెత్తుటి) చారికలను చూపిస్తారు. మేకు కొట్టినప్పుడు కారిన నెత్తుటి చారికలన్నమాట. ఈ లింగం 3 అడుగుల చుట్టుకొలతతో 60 అడుగుల ఎత్తు వుంటుంది. 


💠 ఇక్కడ కొలువుతీరిన అమ్మవారు బాలచాముండిక.  ఈ దేవేరి శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిపబడుతోంది. భక్తుల ఈతి బాధలనుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని, సుఖసంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి అని భక్తులు భావిస్తారు.ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం.

💠 త్రిలోక ప్రసిద్ధమైన ఈ అమరేశ్వర తీర్థం ఉత్తమమైంది. అమరేశ్వరస్వామిని దర్శించడం వలన వేయి గోవులను దానమిచ్చిన ఫలితంతో పాటు, పునర్జన్మ ఉండదని పురాణ ప్రవచనం. ఇక్కడ శివుణ్ణి ప్రణవేశ్వరుడు, అగస్తేశ్వరుడు, కోసలేశ్వరుడు, సోమేశ్వరుడు, పార్థివేశ్వరుడు అనే నామాలతో కీర్తిస్తున్నారు. 
భక్తి శ్రద్ధలతో మూడు రోజులు వరుసగా కృష్ణానదిలో స్నానం చేసి అమరలింగేశ్వరుడిని పూజించిన వారు మరణానంతరం శివ సాన్నిద్యం పొందుతారని భక్తుల విశ్వాసం.

No comments: