Adsense

Tuesday, June 14, 2022

శ్రీ కోదండరామాలయం : అమ్మపల్లి, హైదరాబాద్


💠 11వ శతాబ్దానికి చెందిన రామ మందిరం ! 
హనుమాన్ విగ్రహం లేని రామ మందిరం ! 
ఒకే రాతిలో 3 విగ్రహాలు గల రామ మందిరం !
నిజాం నగరంలో 1000 సంవత్సరాల పురాతన దేవాలయం! 
1000 కంటే ఎక్కువ తెలుగు సినిమాలు & టీవీ సీరియల్స్‌లో చూపించబడిన దేవాలయం.! 

ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే  సమాధానం.. 
అదే శ్రీ కోదండరామ ఆలయం., శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని అమ్మపల్లి గ్రామం.

💠 సుగణాలకు నిలువెత్తు రూపం, తరతరాలకూ ఆదర్శ పురుషుడు,పితృవాక్య పరిపాలన, సత్పరివర్తన, సత్పాలన అన్నీ కలిస్తే శ్రీ రాముడు వెలసిన వందల ఏళ్లనాటి ఈ ఆలయమే.. అమ్మపల్లి కోదండరామాలయం.

🔔 ఆలయ చరిత్ర : 

💠 ధర్మ సంస్థాపన కోసం  శ్రీరామచంద్రుడు చాలా ప్రాంతాల్లో పర్యటిస్తూ అమ్మపల్లి వద్ద బస చేసినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. 
ఈ ఆలయంలో సీత అమ్మవారు ప్రధాన దేవతగా నివసిస్తుంది కాబట్టి, ఈ గ్రామాన్ని అమ్మపల్లి అని పిలుస్తారు.

💠 ఆకాశాన్నంటుతున్నట్లుండే గాలిగోపురం, విశాలమైన మండపాలు, ఆహ్లాదపరిచే ప్రకృతి అందాలు, అమ్మపల్లి కోదండరామస్వామి సన్నిధికి వచ్చే భక్తుల మనసును ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతాయి.

💠 పూర్వకాలంలో అమ్మపల్లి పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి సోకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారట. గ్రామంలో రామాలయం నిర్మిస్తే వ్యాధి నయం అవుతుందని కొందరు మహాత్ములు అక్కడికి వారికి ఆ సమయంలో సూచించారట. అప్పుడే ఆలయం నిర్మితమయ్యింది. ఇథమిత్థంగా ఏ కాలంలో జరిగిందన్నది చెప్పలేకున్నా, 14వ శతాబ్దానికి చెందిన ఆలయంగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.

💠 ప్లేగు వ్యాధినుంచి విముక్తి కలిగించిన అమ్మపల్లి శ్రీరాముడు ఆరోగ్యరాముడిగా ప్రసిద్ధికెక్కాడు. అనారోగ్య పీడితులైనవారు, ఇక్కడి కోదండ రామస్వామిని దర్శిస్తే, త్వరితగతిన వ్యాధి నయమవుతుందన్న విశ్వాసం భక్తులది. విద్యాబుద్ధులు ప్రసాదించే దేవుడిగా, ఆర్థిక సమస్యలను తీర్చే దైవంగా, సంతనా,అనారోగ్యసమస్యలున్నవారికి ఆపద్భాందవుడిగా వినుతికెక్కాడు అమ్మపల్లి శ్రీరాముడు.

💠 11 వందల సంవత్సరాలు పైగా చరిత్ర గలా ఏకశిలపై సీతాసమేతుడై శ్రీరాముడు ఇక్కడ దర్శనమిస్తాడు.ఇదే శిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా దర్శనమిస్తాయి.

💠 ముఖమంటపంలో 'కూర్మం' (తాబేలు) ఏర్పాటు చేయబడి వుండటం వలన ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు.

💠 అత్యంత విశాలమైన పరిసరాల్లో నెలవై దర్శించినంతనే మనసుకు ఆహ్లాదానుభూతిని ప్రసాదించే చూడచక్కని ఆలయం అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయం. 
గగనాన్ని తాకుతుందా అనిపించే ఎత్తైన రాజగోపురం, దాన్ని దాటుకుని వెళ్లగానే కనిపించే విశాలమైన మంటపాలు, చుట్టూ కోనేర్లు భక్తులకు దర్శనమిస్తాయి. పూర్వ కాలంలో వివిధ వృత్తుల వారు ఈ కోనేర్ల ఒడ్డునే తమ కుల వృత్తులు నిర్వహించేవరాట.

💠 అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయ రాజగోపుర నిర్మాణం ఆధారంగానే కుతుబ్ షాహీ సుల్తానులు చారిత్రక చార్మినార్ ను నిర్మించారట. శతాబ్ధాల క్రితం వేంగి రాజులు ప్రతిష్టించినట్లుగా భావించే అనేక శిల్పాలు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి.

💠 "మకర తోరణం" ఉన్న 3 విగ్రహాలకు ఒకే రాయి- ఇక్కడి తోరణం ప్రత్యేకం. ఈ తోరణంలో విష్ణువు యొక్క 10 అవతారాలు ఉన్నాయి. ఈ రకమైన రాతి చెక్కడం 11వ శతాబ్దానికి చెందినది. మరియు భారతదేశంలో ఈ తరహా విగ్రహాలు రెండు మాత్రమే ఉన్నాయి. ఈ ఆలయం & ర్యాలి-జగన్మోహన దేవాలయం. ఆలయ ప్రవేశ ద్వారం మీద విష్ణువు విగ్రహం మనల్ని ఆకర్షిస్తుంది.

💠 ఆలయ ప్రాంగణలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. 
ఈ గుడికి రెండు నీటి గుండాలున్నాయి. పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారని ప్రతీతి. 

💠 ఎత్తయిన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు, ఆశ్చర్యచకితులను చేసే ప్రాకార మంటపాలు అలనాటి ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా దర్శనమిస్తుంటాయి. మహారాజుల సంకల్ప బలం. వారి పర్యవేక్షణ కారణంగానే ఈ ఆలయం నిర్మాణం జరిగివుంటుందని అనిపిస్తుంది. గర్భాలయంలో సీతారామలక్ష్మణులు కొలువై వుండగా, వారికి ఎదురుగా ముఖమంటపంలో హనుమంతుడు నెలవై ఉంటాడు. ఇక్కడే గరుత్మంతుడు కూడా కనిపిస్తుంటాడు.

💠 ప్రతి ఏటా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రతి నెలా ఆలయంలో స్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, మహా శివరాత్రి పర్వదినంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

💠ఈ ఆలయం భక్తులనే కాకుండా సినీప్రముఖులను ఆకట్టుకుంటోంది. ఈ గుడి సినిమావారికి ఓ సెంటిమెంట్‌గా మారింది. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ చిత్రీకరించాలని దర్శకులు, నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. భారీ బడ్జెట్ సినిమాల కీలక సన్నివేషాలను ఇక్కడే చిత్రీకరిస్తుంటారు. అయితే ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నాటు బాంబులు పేలి ప్రహరీ కూలడంతో అప్పటినుంచి ఆలయ నిర్వాహకులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

No comments: