🔅 సాధారణంగా శివాలయాలు, శివుడు అంటే మనకి గుర్తువచ్చేది లింగాకారం. అందుకు భిన్నంగా ఆ హరుడు విగ్రహరూపంలో కొలువైన క్షేత్రం హేమావతి సిద్దేశ్వరాలయం.
👉అనంతపురం జిల్లా అమరాపురం మండలంలో హేమావతి సిద్దేశ్వరాయం మిక్కిలి ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. పచ్చటి ప్రకృతి నడుమ ప్రశాంత వాతావరణంలో, కాలుష్యానికి దూరంగా, ఉద్యానవనాల నడుమ ప్రాచీన శిల్పకళకు ప్రతిరూపంగా ఈ ఆలయం కొలువై ఉండి. కోరిన కోర్కెలు తీర్చి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ సిద్దేశ్వర క్షేత్రానికి ఎన్నో విశిష్టతలున్నాయి.
👉జిల్లా కేంద్రమైన అనంతపురానికి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో హేమావతి సిద్దేశ్వరాలయం ఉంది. క్రీ.శ. 7వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయమిది. ఈ ప్రాంతాన్ని అప్పట్లో నోళంబ రాజులు పాలించారు. అందుకే ఈ స్వామిని నోళంబేశ్వరుడు అని కూడా పిలుస్తారు. హెంజేరు (హేమావతి) సామ్రాజ్యంలో అనంతపురం, చిత్తూరు, కర్ణాటకలోని చిత్రదుర్గ, కోలార్, తమిళనాడులోని ధర్మపురి, సేలం జిల్లాలోని 32వేల గ్రామాలు ఉండేవని ఇక్కడ చారిత్రక ఆధారాలనుబట్టి తెలుస్తోంది. కాబట్టి సిద్ధేశ్వరుడికి హెంజెప్ప, హెంజేరు సిద్ధ, హెంజేరీశ్వర అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ స్వామి నోళంబ రాజవంశీకుల కులదైవం. వీరి వంశానికి చెందిన చిత్రశేఖర, సోమశేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. తమకు సంతానం కలిగితే విగ్రహరూపాన శివాలయం నిర్మిస్తామని వారు మొక్కుకున్నారట. అనంతర కాలంలో వారి కోరిక నెరవేరడంతో సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి.
👉సిద్దేశ్వరుడితో పాటు వారు మరో నాలుగు శివలింగాలను ( దొడ్డేశ్వర, విరూపాక్షేశ్వర, మల్లేశ్వర, సోమేశ్వర లింగాలు) ప్రతిష్ఠించారు. వాటిలో మూడు ఆలయ ప్రాంగణంలోనే ఉండగా, నాలుగోది ఊళ్ళోని మరో శివాలయంలో ఉంది
👉భైరవ రూపధారి అయిన దేవుడు సిద్ధాసనంలో కూర్చుని ఉండటం వల్ల ఈ దేవాలయంలోనికి సిద్ధేశ్వరాలయంగా పేరు వచ్చింది. గంగమ్మను తలదాల్చి జటాఝూటాన సూర్యచంద్రులూ కనిపిస్తారు. కుడిచేత బ్రహ్మకపాలాన్నీ దక్షిణహస్తాన జపమాలనూ ధరించి అర్ధనిమీలితనేత్రుడై ఉంటాడు స్వామి, ఇలా శివుడు విగ్రహరూపంలో ఆసీన స్థితిలో కొలువై ఉన్న ఆలయం భారతదేశంలో ఇదొక్కటేనంటారు స్థానికులు.
👉ఇక్కడి మరో ప్రత్యేక ఏంటంటే... ఆలయంలో సిద్దేశ్వరుడి ఎదురుగా కొలువై ఉన్న నంది ముఖం ఆ స్వామిని దర్శించుకున్నట్టుగా కాకుండా పక్కకు తిరిగి ఉంటుంది. ఆలయ కుడ్యాలపై కనిపించే చోళరాజుల శిల్పకళా చాతుర్యం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. రామాయణ, మహాభారత గాథలు ఇక్కడ జీవం ఉట్టిపడేలా చెక్కారు. ఒకానొకప్పుడు ఈ క్షేత్రంలో కోటి లింగాలు, కోటి నందులు ఉండేవని చెబుతారు. అందుకు నిదర్శనమూ అన్నట్టు ఇప్పటికీ తవ్వకాల్లో అక్కడక్కడా నందులూ లింగాలూ బయటపడుతుండటం విశేషం.
🔅సూర్యకిరణలు అభిషేకం...సిద్ధేశ్వరాలయానికి ఉన్న మరో ప్రత్యేకత... శివరాత్రి రోజున గర్భగుడిలోని మూలవిరాట్ సిద్ధేశ్వరస్వామి నుదుట సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. పడమటి ముఖద్వారం కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరు (మజ్జన బావి)లో 20 ఏళ్ల క్రితం వరకు నీరు సప్తవర్ణాల్లో కనిపించేదని, ఇందులో స్నానం చేసి స్వామి వారిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందని, సర్వరోగాలూ నయమవుతాయని భక్తులు విశ్వసించేవారు. ఇప్పటికీ అనేకమంది వ్యాధిపీడితులు ఈ కోనేటిలో స్నానం చేస్తుంటారు.
👉ఆలయ ప్రవేశ ద్వారానికి ముందు ధూపం (అగ్ని గుండం) ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు తాము పండించిన పంటల నుంచి కొంత భాగాన్ని మొక్కుబడిగా ఇందులో వేస్తారు. ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయనీ అప్లైశ్వర్యాలూ కలుగుతాయనీ నమ్మిక.
👉ఈ ఆలయాన్ని దర్శించి తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు. ఆదివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రోజూ త్రికాల పూజలు నిర్వహిస్తారు.
ఏటా శ్రావణ మాసంలో నిర్వహించే జాతరకు భక్తులు వేలాదిగా తరలి వస్తారు.
ఆశ్వయజ మాసంలో నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాసంలో 45 రోజుల పాటు విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక, మార్గశిర పౌర్ణమి దినాల్లో లక్షదీపోత్సవం, పూల రథోత్సవం, సిడిమానోత్సవం, వసంతోత్సవాలను వేడుకగా చేస్తారు.
👉ఇక, మహాశివరాత్రి సందర్భంగా అయితే... ఎనిమిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నిత్యం ఆ సిద్ధేశ్వరుడికి రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం, బిల్వార్చన, భస్మ (విభూతి) అర్చన, ఆకుపూజ తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా జరిపిస్తారు.
No comments:
Post a Comment