👉శ్రీ కృష్ణ దేవరాయల వారిచే నిర్మితమై ప్రకృతి ఒడిలో అలరారుతున్న అతి సుందరమైన ప్రాచీన శైవక్షేత్రం శ్రీ బుగ్గ సంగమేశ్వరం.
👉గుంతకల్లు మండలం పంచాయతీ పరిధిలో గల బుగ్గసంగాల్లో వెలసిన శ్రీ బుగ్గ సంగమేశ్వరుడి ఆలయం చూట్టూ కొండలు, పచ్చని చెట్ల మద్య వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని దక్షిణకాశీగా పిలుస్తారు. బుగ్గలో వెలసిన ఈ సంగమేశ్వరుణ్ణి స్వయంభూలింగంగా పిలుస్తారు. ఈ ప్రాంతం మహిమాన్వితమని విశ్వసించిన విజయనగర రాజులు సంగమేశ్వరునికి ఆలయం నిర్మించినట్లు ఆలయంలో ఉన్న శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది.
👉శివుని ఆలయంతో పాటు పార్వతీ అమ్మవారి ఆలయం కూడా మహిమగలదని ఇక్కడివారి విశ్వాసం. వీటికి ఎదురుగా ఎత్తైన కొండపైన ఉన్న నంది ఆలయం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఆలయం పక్కనే ఉన్న కొలనులో ప్రతిరోజూ వందలాది తామర పువ్వులు పూస్తాయి. ఆలయానికి వెళ్ళిన భక్తులంతా ఆ కొలనులో పూచిన తామర పువ్వులతో శివుడిని పూజిస్తారు.
👉ఇక్కడ బుగ్గలో ఉన్న కోనేరుకు ఒక ప్రత్యేకత ఉంది. మహానందిలో మాదిరిగానే నిత్యం కోనేరు నుంచి కాలువల ద్వారా నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి.
ఈ కోనేరులో స్నానమాచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.
ఇదే భక్తితో పలువురు ఈ ప్రాంతంలోని నీళ్ళు తీసుకువెళ్ళి తాగుతుంటారు.
👉శ్రీ బుగ్గ సంగమేశ్వరస్వామి దేవాలయం శ్రీకృష్ణ దేవరాయలచే నిర్మితమైంది. ఈ ఆలయ ప్రాశస్త్యం తెలుపుతూ ఒక కథ ప్రచారంలో ఉంది.
పూర్వము ఒక కాశీ బ్రాహ్మణుడు శాంతి ఎక్కడ దొరుకుతుందా అని దేశ పర్యటనకు అతను బయలుదేరగా అతనికి ఎక్కడ చూసినా ఆశాంతియే కనిపించడంతో ఈ విషయం తన గురువుకు విన్నవించారు. ఆ మహా ఋషి ఒక కట్టెను తీసుకుని దేవుణ్ణి ప్రార్థించి ఆ కట్టెను కాశీలోని గంగానదిలో వదులుతూ నేను వదిలిన కట్టె నీకు దేశపర్యటనలో ఎక్కడ కనిపిస్తుందో అక్కడ నీకు మనశ్శాంతి దొరుకుతుందని చెప్పాడట. ఆ బ్రాహ్మణుడు దక్షిణ దేశ పర్యటనలో కనిపించిన నదులలో స్నానాలు చేసి బుగ్గకు వచ్చాడు. ఈ ప్రదేశంలో ఉన్న కొలనులో స్నానం చేస్తుండగా ఒక కర్ర నీటిలో కనిపించింది. తన గురువు మహాఋషి చెప్పిన స్థలం ఇదేనని భావించి చుట్టూ పరికించాడట.
👉లింగమునకు ఆలయం నిర్మించి, ఒక రావిచెట్టును, ఒక జివ్విచెట్టును నాటారట. ఎదురుగా బసవన్నగుడిని కట్టించినాడు. ఇది 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయుల కాలంలో మహాలింగని ఆధ్వర్యంలో నిర్మితమైనట్లు ఇక్కడ ఉన్న శాసనముల ద్వారా తెలుస్తున్నది. ఇక్కడ నిరంతరం రెండు నీటి బుగ్గలు కలసి కాశీలోలాగా ఉత్తరం నుండి దక్షిణం వైపు ప్రవహించడం వలన ఈ దేవాలయం శ్రీబుగ్గ సంగమేశ్వర స్వామివారి దేవాలయంగా ప్రసిద్ధి చెందినది. కాగా భక్తులు నియమ నిష్టలతో శ్రీపార్వతీ సమేత శ్రీబుగ్గ సంగమేశ్వరస్వామి వారికి పూజలు చేసినచో అటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగునని భక్తులకు అపారమైన నమ్మకం.
అలాగే ఆలయంలో ఉసిరి చెట్టు, మారెడు చెట్లు కూడా ఉన్నాయి. ఇలా కలిసి ఉన్న చోట వనభోజనాలు చేస్తే చాలా పుణ్యమని కార్తీకమాసంలో భక్తులంతా ఇక్కడికి చేరుకుని సరదాగా పిక్నిక్ లాగా గడిపేస్తారు.
🔅 మొగలి పొదల సువాసనలు 🔅
👉 ఆలయ సమీపంలో వందలాది మొగలిపొదలు ఉండడంతో ఈ ప్రాంతమంతా సువాసనలు వెదజల్లుతోంది. ఈ మొగలిరేకులను జడల్లో ధరించడానికి మహిళలు చాలా ఇష్టపడతారు.
వీటిని తీసుకువెళ్ళి గ్రామాలలో విక్రయించడం ద్వారా పలువురు మహిళలు ఉపాధి కూడా పొందుతున్నారు.
👉 బుగ్గ సంగమేశ్వర దేవాలయాల ఆవరణలో ఉన్న కోనేరు నడుమ అందమైన నిర్మాణం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. పక్కనే నంది విగ్రహం నుంచి గతంలో నోటి నుంచి మంచినీరు ధారగా వచ్చేవి. అయితే ఆ విగ్రహాన్ని కొందరు నాశనం చేయడం వల్ల నీళ్ళు రావడం లేదని ఇక్కడి నిర్వహకులు తెలిపారు. ఇలా చేయడం వలన పరమశివుని కోపానికి గురయ్యే అవకాశముందని, అందుకే అక్కడ శాంతిహోమాలను ఎక్కువగా చేయిస్తుంటారు.
👉ఎలా వెళ్ళాలి ? : అనంతపురం జిల్లా గుంతకల్లుకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ బుగ్గ సంగమేశ్వరుని ఆలయం వుంది. నిత్యం ఆటోలు, ఆర్టీసీ బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అలాగే కర్నూలు పట్టణం నుండి పత్తికొండకు చేరుకోవాలి. అక్కడి నుండి మద్దికెర ఊరికి రెండు కి.మీ. దూరంలో ఉన్న ఈ ఆలయంకు చేరుకోవచ్చ.
No comments:
Post a Comment