💠 అవతారం అంటే పరమాత్మ లోకకల్యాణం కోసం మనిషి రూపాల్లో భూమికి దిగి రావడం... పురాణాలు ప్రకారం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీమహావిష్ణువు భూమిపై 21 సార్లు అవతరించాడు.
ఆయన 21 అవతారాలలో అతి ముఖ్యమైనవి దశావతారాలు.
💠 భారతదేశంలో శ్రీ మహావిష్ణువుకి చెందిన ఆలయాలు , వివిధ అవతారాలకు చెందిన ప్రముఖ ఆలయాలు ఎన్నో కలవు .
కానీ మొత్తం దశావతారాలు ఓకే విగ్రహ రూపంలో నిక్షిప్తమై దర్శనమిచ్చే అత్యద్భుతమైన ఆలయం బహుశా భారతదేశంలోనే ఒకేఒక్క ఆలయం ఆంద్ర రాష్ట్రాo లో ఉన్న గుంటూరు జిల్లాలో కలదు.
అటువంటి అత్యద్భుతమైన విలక్షణ దశావతార శ్రీ వెంకటేశ్వర ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం
💠 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలంలోని నంబూరు
సమీపంలో దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది.
విజయవాడ-గుంటూరు జాతీయ రహదారికి ఆనుకొని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా సువిశాల మైదానంలో సుందరంగా, రమణీయంగా నిర్మితమైన ఆలయం
💠 తిరుమల తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఏకరూపంలో దర్శనమిస్తే ..ఈ ఆలయంలో ఒకే విగ్రహంలో స్వామివారు దశావతారాలలో దర్శనం ఇస్తున్నారు.
ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం 11 అడుగులు ఉండగా పీఠంతో కలిపి మొత్తం 12 అడుగులు ఉంటుంది.
💠 దశావతార రూపంలో ఉండే ఈ 11 అడుగుల అద్భుత విగ్రహం కాళ్ళ నుండి నడుము వరకు వరాహ, మత్స్య, కూర్మ అవతారలలో ఉండగా మిగిలిన ఏడు అవతారాలు కూడా స్వామివారి విగ్రహంలో చాలా అందంగా భక్తులకి దర్శనమిస్తాయి.
ఇలా వేంకటేశ్వరస్వామి విగ్రహం దశావతారాలలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం, మొట్టమొదటి ఆలయం ఇదే అవడం విశేషం.
💠 ఈ ఆలయంలోని దశావతార శ్రీ వేంకటేశ్వరస్వామివారి విగ్రహ ప్రతిష్ఠను 2018, జూన్ 22న అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాన ఆలయానికి మరో నాలుగు ఉపాలయాలు మహాలక్ష్మి, గణపతి, గరుడ ఆళ్వార్, విష్వక్సేనుడు ఉండటంతో దీనిని శ్రీ దశావతార శ్రీనివాస క్షేత్రంగానూ పిలుస్తున్నారు.
ఏడుకొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని అమరావతి లో నిర్మించడానికి 18 ఏళ్ల కఠోర శ్రమతో లింగమనేని రమేశ్ కుటుంబం కృషి చేసింది.
💠 శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్య ఆశిస్సులతో ఈ ఆలయ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. లింగమనేని పూర్ణభాస్కర్, లింగమనేని వేంకట సూర్యరాజశేఖర్, లింగమనేని రమేశ్, గద్దె శ్రీలక్ష్మి గార్లు అత్యద్బుత ఆలయం నిర్మించాలన్న ఆశయంతో గణపతి సచ్చిదానంద స్వామివారిని సంప్రదించి ఈ మహత్తర సంకల్పాన్ని చేపట్టారు.
💠 మొత్తం ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రం ప్రకారం గణపతి సచ్చిదానందస్వామి పర్యవేక్షణలో జరిగింది. విగ్రహాలు మలిచే స్థపతి, ఆలయాన్ని నిర్మించే శిల్పి ఇలా ప్రతీ ఒక్కరూ ఆగమశాస్త్ర ప్రకారం పనులు పూర్తి చేశారు. శిల్పి రమణ, స్వామి వారి రూపాన్ని చిత్రలేఖనం ద్వారా గీయగా, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన శిల్పి వి. సుబ్రమణ్య ఆచార్యులు రాతితోనే ఈ ఆలయం నిర్మించడం విశేషం.
ఈ ఆలయంలో భూసమేత దశావతార వేంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి, విష్వక్సేనాళ్వార్, గరుడాళ్వార్, హయగ్రీవాచార్యుల విగ్రహాలను అద్భుతంగా మలిచారు.
💠 వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ధ్వజస్తంభం సమీపంలో గరుడాళ్వార్, గణపతి ఉపాలయం సమీపంలో విష్వక్సేనాళ్వార్ విగ్రహాలు రమణీయంగా కనిపిస్తాయి.
ఈ మండపంలో లక్ష్మీదేవి ఉపాలయం ఎదురుగా మత్స్య, కూర్మ, వరహా, నరసింహ, వామన అవతారమూర్తులను, గణపతి ఉపాలయానికి ఎదురుగా పరుశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి అవతారాల మూర్తులను, ఆలయ మండప సాలాహారంలో కేశావాది చతుర్వింశతి మూర్తులను అందంగా అమర్చారు.
💠శ్రీ వేంకటేశ్వర, నృసింహ, వరాహ ముఖాలతో వామన, పరశురామ, రామ, బలరామ, కల్కి అవతారములు ఆయుధాలుగా, నెమలి పింఛమును శిరస్సును ధరించి మత్స్య, కూర్మ అవతారములు దేహంగా దాల్చిన విలక్షణమైన ఏకశిలా విగ్రహం శ్రీ దశావతార వేంకటేశ్వరస్వామి మంగళ స్వరూపం ఇది.
💠 శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ల వరకూ మత్స్యావతారంలో, నడుము వరకూ కూర్మావతారంలోనూ దర్శనమిస్తుంది. శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖం.. విగ్రహం ఎనిమిది చేతుల్లో వామనావతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, రామావతారానికి సూచికగా బాణం, విల్లుమ్ములు, పరశురామావతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణావతారానికి సూచికగా నెమలి పింఛం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం.. విష్ణుమూర్తి చేతిలో ఉండే శంఖు, చక్రాలు మరో రెండు చేతులకు అలంకరించారు
💠 ఇటువంటి అద్భుతమైన విలక్షణమైన దశావతార రూపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం బహుశా దేశంలో ఇది ఒకటే కావడం మన తెలుగు రాష్ట్రాల భక్తుల మరియు విజశేషంగా గుంటూరు జిల్లా ప్రజల యొక్క అదృష్టం.
దర్శించండి తరించండి
🙏ఓం నమో దశావతార శ్రీ వెంకటేశాయ నమః 🙏
No comments:
Post a Comment