Adsense

Tuesday, June 14, 2022

శ్రీ దైద బిలం అమరలింగేశ్వర ఆలయం: గుత్తికొండ, గుంటూరు జిల్లా



💠 పురాతన కాలం నుండి పూజలందుకొంటున్న ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. 
అయితే అందులో చాలా వరకు కొండపైన, గుహల్లో, అరణ్యప్రాంతాల్లో వెలసినవి. 
అలా ఒక కొండగుహలో వెలసిన ఆలయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే కొండగుహలోని చిమ్మచీకట్లోనే దేవుడు దీపం వెలుగులో భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. 
మరి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ చీకటి మల్లయ్య ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

💠 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,గుంటూరు జిల్లా, గురజాల నుంచి 12 కిలో మీటర్లు, పులిపాడు, దైదా మార్గం నుంచి 5 కి.మీ
గుత్తికొండలో ఈ శైవ క్షేత్రం 
దైద బిలం అమరలింగేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. 

💠 ఈ కొండగుహనే గుత్తికొండ బిలం అని కూడా అంటారు. ఇది అంతా కూడా చుట్టూ పర్వతశ్రేణి, మధ్యలో బిల సముదాయం. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బిలం.

💠 ఇక్కడ అమరలింగేశ్వరుడు ఉత్తరవాహినిగా ప్రవహించే కృష్ణానది ఒడ్డున ప్రకృతి సిద్దమైన బిలం (గుహ) లో కొలువై ఉన్నాడు. 
ఈ ఆలయంలో శివుడు, కొండ గుహలో స్వయంభువుగా వెలసి భక్తుల నీరాజనాలను అందుకుంటున్నాడు.

💠 ద్వాపరయుగంలో కాలయవనుని బారి నుండి తప్పించుకున్న శ్రీకృష్ణుడు ఈ బిలంలోకి ప్రవేశించి అక్కడ తపస్సు చేస్తున్న ముచికుంద మహర్షి పైన తన ఉత్తరీయాన్ని కప్పి పక్కకు వెళ్తాడు. అయితే ఆయనే శ్రీకృష్ణుడు అని భావించిన రాక్షసుడు ఆ మునికి తపోభంగం కలిగించడంతో ఆగ్రహించిన ముని ఆ రాక్షసుడిని భస్మం చేసినట్లు పురాణం.
పాపపరిహారార్థం ముచుకుంద మహాముని ఈ శివలింగం ప్రతిష్టించాడు అని కూడా ఒక కథనం.

💠 ఈ బిలం యొక్క ప్రధాన ద్వారం అడుగుపెడపెట్టి లోపలి వెళుతుండగా చీకటి మల్లయ్య పూజలందుకుంటూ కనిపిస్తాడు.
ఇక ఇక్కడ ఉన్న ప్రధాన బిలం నుండి లోపలి వెళితే 101 బిలాలు ఉన్నాయని చెబుతారు. ఇలా ఇంకా కొంచం ముందుకు వెళితే అక్కడ గరళం సేవించే శివుడి విగ్రహాం ఉందని చెబుతారు.

💠 ఇక్కడ చిమ్మ చీకట్లో విద్యుత్ దీపాల వెలుగులో ముందుకు వెళుతుంటే మనకి ఒక నీటికొలను కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న నీరు అందులో రూపాయి నాణెం క్రింద పడిన కనిపించేంత స్వచ్ఛంగా ఉంటాయి. ఆ స్వామి దర్శనానికి వచ్చిన వారంతా కూడా ఈ కొలనులో పుణ్యస్నానాలు చేస్తారు.

💠 కార్తీకమాసం, ప్రతి సోమవారం భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. కృష్ణానదిలో స్నానాలు ఆచరించి తడిబట్టలతో బిలంలో 900 మీటర్లు నడచి ఈ పుణ్యస్థలంలో భక్తులు అమరలింగేశ్వరుని దర్శించుకుంటారు.

💠 ఈ బిలాన్ని అగస్త్య మహర్షి తపస్సు కోసం ఉపయోగించారని ఇక్కడి వారు చెపుతారు. 
ఆ తరువాత 100 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్థులు కాండ్ర రామయ్య, పోట్ల హనుమయ్య తదితరులు ఆ బిలం సమీపంలో పశువులు కాచుకుంటుండగా మంత్రోచ్చారణలు వినిపించాయి. 
దీంతో వారు ఆ శబ్దం వచ్చిన దిశగా వెతగగా బండరాళ్ళ మాటున బిలద్వారం కనపడింది. దీంతో గ్రామస్థుల సహాయంతో తాడులు కట్లుకుని బిలం లోపలికి ప్రవేశించారు. ఆ ఇరుకైన బిలంలో కొంతదూరం ప్రయాణించగా అక్కడ వారికి దివ్యలింగాకారం సాక్షాత్కరించింది. అక్కడ పూజలు జరిగిన ఆనవాళ్ళను వారు గమనించారు. నాటి నుంచి శ్రీ అమరలింగేశ్వరస్వామిగా భక్తుల పూజలతో ఆ క్షేత్రం విరాజిల్లుతుంది.

💠 అమరలింగేశ్వరస్వామిని దర్శంచటం కష్టంతో కూడుకుంది. బిలం లోపల వందల మీటర్ల దూరంలో కొలువైనందున వృద్దులు, మహిళలు, చిన్నారులకు స్వామిని దర్శంచిందుకునేందుకు ఇబ్బందులు పడుతారు. బిలం లోపకి వెళ్లటానికి, బయటకు రావటానికి వేరువేరు మార్గాలు ఉన్నాయి. లోపల ఇరుకైన మార్గం ఉంటుంది. 
అక్కడక్కడ ఒంగి, కూర్చుని వెళ్ళవలసి వస్తుంది. బిలం లోపలకి ప్రవేశించిన తరువాత 500 మీ. దూరంలో అమరలింగేశ్వరస్వామి కొలువైన ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఆ స్వామికి కృష్ణానది నుంచి తీసుకొచ్చిన నీటితో అభిషేకం చేసి పూజలు చేస్తారు. ఆ తరువాత మరో 500 మీ. నడక సాగిస్తే బిలం బయటకు వస్తాం.

💠 బిలం లోపల నడక దారిలో ఇతర మార్గాలు కనపడతాయి. అవి శ్రీశైలం, కాశీ, ఎత్తిపోతల, గుత్తికొండ బిలం ప్రాంతాలకు వెళ్లే మార్గాలని ఇక్కడివారు చెపుతారు. కొందరు ఈ మార్గాల్లో వెళ్ళి కనపడకుండా పోయారని చెపుతుంటారు.

💠 ఇక్కడి స్వామి కోరిన వరాలు తీర్చే కొంగుబంగారం అని భక్తుల విశ్వాసం. సోమవారం రోజున కృష్ణానదిలో స్నానం చేసి తడిబట్టలతో ఆ లింగాకారుని తాకి, కృష్ణా జలాలతో అభిషేకించి, ఆ రాత్రి నిద్రచేస్తే ఎంతటి కోరికలైనా తీరతాయని భక్తులు నమ్మకం. 

💠 బిలంలో గర్భాలయం పైన ఆరిచెట్టు ఉంది. పిల్లలు లేనివారు ఆరిచెట్టుకు ప్రదక్షిణలు చేసి ఉయ్యాలకడితే సంతానం కలుగుతుందట.


గుత్తికొండ బిలం లో పరమేశ్వరుని దర్శించి అందరూ తరించండి.

No comments: