💠 తూర్పు గోదావరి జిల్లా లోని అమలాపురానికి 14 కిలోమీటర్ల దూరంలో గోదావరి తీరాన ఉన్న ఒక గ్రామం ముక్తేశ్వరం.
30-40 సంవత్సరాల క్రితం కేవలం ఒక అగ్రహారంగా ఉండేది. ఇప్పుడు వెడల్పాటి రహదారులతో, చక్కటి ఊరు ఏర్పడింది. చుట్టూ పచ్చటి ప్రకృతి, పంట కాల్వలు, అక్కడక్కడ లంక గ్రామాలు, కొబ్బరితోటలు, మామిడి చెట్లు..వెరసి, మొత్తం కోనసీమ అందాలన్నింటిని సంతరించుకున్న గ్రామం ముక్తేశ్వరం.
ఊరికి కొద్ది దూరంలో గోదావరి తీరం. నదికి ఆవలి పక్కన కోటిపల్లి రేవు. ఈ మధ్యనే బ్రిటీషువారి కాలంలో వేయబడ్డ కాకినాడ - కోటిపల్లి రైల్వేలైను పునరుద్ధరింపబడింది.
💠 లోక కల్యాణం కోసం పరమశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు.
అనేక లీలా విశేషాలను ప్రదర్శిస్తూ పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.
ఆ స్వామి కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'ముక్తేశ్వరం' ఒకటి.
ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విలసిల్లుతోన్న 'అయినవిల్లి'కి సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది.
ఇక్కడ స్వామి 'ముక్తేశ్వరుడు' పేరుతో పూజలు అందుకుంటూ ఉంటాడు.
💠 గౌతమీ నదీ తీర అత్యంత పురాతనమై దేవాలయం.రావణ వధ తర్వాత ఆ బ్రహ్మ హత్యా పాపం పోగొట్టుకోవటానికి శ్రీ రాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు .
💠 ఒక సారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానంలో వెడుతుంటే ఇక్కడికి రాగానే విమానం ఆగి పోయింది .
అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్లితే అక్కడ పెద్ద పుట్ట కనిపించింది దానిలో ఒక దివ్య జ్యోతిర్లింగం మిరుమిట్లు గొలిపే కాంతితో దర్శనమిచ్చింది .
దానికి దగ్గరలో’’ శ్రమణి ‘’అనే తాపసి ధ్యానంలో కనిపించింది .
రాముడు ఆమెను సమీపించగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీ రామ దర్శనం చేత తనకు శాప విమోచనమైఁదని తెలిపింది .పుట్టలోని జ్యోతిర్లింగం వద్ద రాముడు పంచాక్షరి జపించాడు .వెంటనే పరమేశ్వరుడు దానినుండి ప్రత్యక్షమయ్యాడు .తాపసి శ్రమణి శివ దర్శనంతో జ్యోతిర్లింగంలో ఐక్యమై పోయింది . శ్రీ రాముని కోర్కపై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు .
💠 ఒక్కక్షణ దర్శన భాగ్యం వలన శ్రమణికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షణ ముక్తేశ్వర క్షేత్రమయింది .
శ్రీరాముడు ఈ లింగ ప్రతిష్ఠ చేసి బ్రహ్మ హత్యా పాతకం నుండి విముక్తడయ్యాడు .
కనుక ఆలయం త్రేతా యుగానికి చెందినది .సప్తమహర్షులు ఇక్కడ కొచ్చి స్వామిని అర్చించారు .క్షేత్రపాలకుడు కేశవ స్వామి .శ్రావణ ఆశ్వయుజ కార్తీక మాసాలలో, శివరాత్రికి విశేషంగా పూజలు అభిషేకాలు ఉత్సవాలు జరుగుతాయి .
💠 దర్శన మాత్రం చేతనే స్వామి ముక్తిని ప్రసాదిస్తాడు కనుక, సోమవారాల్లోను .. విశేషమైన పర్వదినాల్లోను ఈ క్షేత్ర దర్శనం చేసే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది
💠 ముక్తేశ్వరుని దేవాలయము బహు పురాతనమైనది. ఒకదానికెదురుగా ఒకటిగా రెండు శివాలయములు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
మెదటి దాని ఎదురుగ ఉండే ఆలయములో దేవుని క్షణ ముక్తేశ్వరుడు అంటారు. ముక్తేశ్వరస్వామి ఆలయములో శివలింగము చిన్నగా రుద్రాక్ష ఆకారము పోలి ఉంటుంది.
💠 ముక్తేశ్వరంలో నూతనముగా శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయము శివాలయము వద్ద నిర్మింపబడింది. ఊరికి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో అయినవిల్లి గ్రామంలో జగత్ప్రసిద్దమైన మహాగణపతి ఆలయం ఉంది.
💠 క్షణ కాలంలో వరాన్ని ప్రసాదించే ముక్తీశ్వరుడుని దర్శిస్తే మీ కోరికలు నెరవేరుతాయి.
No comments:
Post a Comment