Adsense

Wednesday, June 15, 2022

శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం : కుండలేశ్వరం (తూర్పు గోదావరి)


💠 తూర్పుగోదావరి జిల్లా పవిత్రమైన గోదావరి నది చెంతన కోనసీమలో పచ్చని పంట పైరులు, కొబ్బరి చెట్ల మధ్య కుండలేశ్వర ఆలయం ఉన్నది.  వృద్ధ గౌతమీనది పుణ్యజలంలో స్నానమాచరించి, ఆ తర్వాత కుండలేశ్వరుని దర్శించి, భక్తిశ్రద్ధలతో పూజలు జరిపిస్తారు.  

💠 కవి స్వారభౌముడైన శ్రీనాధమహాకవి తన భీమ ఖండం (భీమేశ్వరపురాణం)లో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి వ్రాశాడు. 
గౌతమీ మహత్మ్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమని గురించి నూట మూడవ అధ్యాయంలో ఉంది.

💠 ఈ కుండలేశ్వరం క్షేత్రం దగ్గర  చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్ర ఘోషని విని కోపంతో “మహావేగంతో పాతాళలోకంలో ప్రవేశించి ఈ సముద్రుడ్ని భేదిరించాలి అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలను సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యలను, రెండు కుండలాలను ఒక పశ్ళెంలో వుంచి గౌతమికి ఎదురెళ్లాడు. గౌతమీ నది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు సూర్యభగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ రెండు కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు. 
గౌతమీనది కరిగిపోయి, సముద్రుని కోరికమేరకు తన వేగాన్ని తగ్గించుకుని, అక్కడ ఈశ్వర ప్రతిష్ఠకి అంగీకరించింది.

💠 సముద్రుడు గౌతమీ నదికి కానుకగా రెండు కుండలములను ప్రసాదించాడు. అందులో ఒకదానిని మానవులు శ్రేయస్సుకొరకు కుండలేశ్వర క్షేత్రమును స్థాపించడం, రెండవ కుండలమును దేవతల కొరకు నదీగర్భంలో స్థాపించబడినదని ఆ గ్రామ ప్రజలు చెప్తారు.
అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది

💠 నదీ గర్భంలో స్థాపించబడిన పరమేశ్వరునికి దేవతలు కంచుతో ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం వెల్లడిస్తోంది. దేవతలు ఈశ్వరునికి ప్రతి రాత్రి  పూజాభిషేకాలు జరుపుతున్నట్లుగా తెలియచేయబడింది. 
రాత్రి సమయంలో గోదావరీ నదిలోంచి, ఆ ప్రాంతాన కంచు మ్రోగిన ధ్వనులు వినిపిస్తాయని ఇక్కడి వృద్ధులు ఎందరో నమ్మకంగా చెప్తారు  .

💠 గౌతముడు ఒక వృద్ధ స్ర్తితో కలసి ఈ కుండలేశ్వర క్షేత్రానికి వచ్చి, ఈ నదిలో స్నానం చేసిన తర్వాత, ఆ వృద్ధ మహిళ 16 సంవత్సరాల కన్యగా మారిపోయిందనీ, గౌతముడు 20 సంవత్సరాల యువకునిగా మారినట్లు, ఆ తర్వాత వారిద్దరూ దంపతులై నూతన జీవితాన్ని ఆరంభించినట్లుగాను స్థల పురాణం ద్వారానూ, గౌతమీ మహాత్యమను గ్రంథం ద్వారాను తెలియచేయబడింది.

💠 కుండలేశ్వరము దక్షిణ కాశీగా పేరుపొందింది. ఈ క్షేత్రమును గురించి, శ్రీ ఆది శంకరాచార్యులవారు రచించిన చంద్రశేఖరాష్టకంలో  తెలియచేయబడింది. 

💠 కుండలేశ్వర ఆలయ విమాన గోపురం మీద 23 శివలీలలు వర్ణింపబడి ఉన్నాయి. శివుని వివిధ రూపాలు, ఆ విమాన గోపురం మీద దర్శనమివ్వడమన్నది ఈ ఆలయపు ప్రత్యేక విశేషం.
👉 ఆ రూపాలు
1) నటరాజస్వామి  2) వీరభద్రుడు 3) లింగోద్భవమూర్తి 4) సోమాస్కందమూర్తి 5) భిక్షాటనమూర్తి  6) కిరాతమూర్తి
7) హరిహరమూర్తి 8) కల్యాణసుందరమూర్తి 9) చండశానుగ్రహమూర్తి 10) శరభసాళ్ళమూర్తి 11) అర్థనారీశ్వరుడు 12) మన్మధ సంహారి 13) గణేశానుగ్రహమూర్తి 14) ఏకపాదుడు 15) వృషభారూఢుడు 16) దక్షిణామూర్తి 17) ఆజారిమూర్తి 18) విషాన హరుణుడు 19) కంకాళుడు 20) త్రిపురాసుర సంహారుడు 21) చక్రపధానుడు 22) చండశానుగ్రహుడుతోపాటు ముఖ మంటపంపైన భక్తమార్కండేయుడు ఉంటాడు. 

💠 వ్యాస మహర్షి ఆగ్రహంతో కాశీ నుంచి వచ్చిన సమయంలో కుండలేశ్వరంను దక్షిణ కాశీగానూ, సమీపంలో ఉన్న, వ్యాసునిచే ప్రతిష్టింపబడిన వ్యాసేశ్వరుని గ్రామమున కేశవకుర్రును వ్యాసకాశీగానూ చేయాలని నిశ్చయించుకున్నాడు. కాశీలోని గంగానదిలో, అనేక వేల మంది భక్తులు స్నానమాచరించి, తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటున్నారు. గంగామాతకు అంటుకున్న ఆ పాపాలను పోగొట్టుకోలేక కాశీ నుంచి వచ్చి రాత్రి సమయంలో, కుండలేశ్వర క్షేత్రంలో ని వృద్ధ గౌతమీనదిలో మునిగి, ఆ నీటిలో స్నానమాచరించి, తనలోని మలినాలను పోగొటుకుని ఆ నీటిలో పవిత్రతను సాదించుకుంటుంది అని ఇక్కడి స్థల పురాణం.

💠ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కరసమయంలో స్నానదానపూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని స్థల మహత్యం చెప్తుంది.

No comments: