🔅 ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర మిత్యభిదీయతే - అంటుంది భగవద్గీత.
ఈ శరీరమే ఓ క్షేత్రమని గీతావాక్కు.
క్షేత్రం అంటే దేవాలయమన్న అర్థమూ ఉంది.
💠 భారతదేశంలో యాభై లక్షలకుపైగా ఆలయాలున్నాయని అంచనా.
స్వయంభూ ఆలయాలూ, పురాణ ప్రాధాన్యమున్న శక్తిపీఠాలూ, శంకరభగవత్పాదులు,రామానుజులు, మధ్వాచార్యులూ తదితర దివ్యపురుషులు ప్రతిష్ఠించిన మహిమాన్విత మూర్తులూ, చోళులు-పల్లవులు- కాకతీయులు-విజయనగర ప్రభువులూ...పాలకులు ప్రాణంపోసిన క్షేత్రాలూ - ఒకటారెండా ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు.
💠 అందులో ప్రధాన క్షేత్రాల నమూనాలన్నీ ఓ చోట కొలువైతే...నమూనాలేమిటి, అక్కడ జరిగే పూజాదికాలన్నీ ఇక్కడా జరిగితే... నైవేద్యాలూ అచ్చంగా అలానే ఉంటే.....
ఇంకేముంది, సంపూర్ణ యాత్రా ఫలమే, సర్వదేవతా కటాక్షమే!
💠 తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు అతి సమీపంలో గాధరాడ గ్రామంలో ఎన్నో పుణ్యక్షేత్రల నమూనా ఆలయాలు స్థాపించారు.
ఈ గ్రామంలో ఒకే ప్రదేశంలో 54 దేవాలయాలు ఉన్నాయి
💠 అందులో ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ సూర్యనారాయణ మూర్తి , శ్రీ సత్యనారాయణమూర్తి, శ్రీ వెంకటేశ్వరస్వామి, అయ్యప్ప, గాయత్రి, సరస్వతి, లక్ష్మి ,పార్వతి, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు , అష్టాదశ శక్తి పీఠంములు, నాగదేవత, అనంత పద్మనాభస్వామి వారు ఇంకా భారతదేశం లో గల ప్రముఖ పుణ్యక్షేత్రలలో అన్ని గుడులు దూపదీప నైవేద్యాలతో కడు సుందరముగా కనుల విందుగా అద్భుతం గా ఉంటుంది
💠 దేశంలోని ప్రధాన వైష్ణవ క్షేత్రాలూ, శైవ ఆలయాలూ శక్తి పీఠాల నమూనాలూ అక్కడ కొలువయ్యాయి. మూలవిరాట్టుల పూజలూ నైవేద్యాలూ నిజ క్షేత్రాల్ని తలపించేలా ఉంటాయి.
రాజమండ్రికి దగ్గర్లోని గాదరాడ గ్రామాన్ని సందర్శిస్తే సంపూర్ణ తీర్థయాత్రలు చేసొచ్చినంత సంతృప్తి.
💠 గాదరాడ గ్రామంలో కోట్లాది రూపాయల వ్యయంతో... 'ఓం శివశక్తి పీఠం' పేరుతో సకల దేవతామూర్తుల సమాహారంగా ఆలయ సముదాయాన్ని నిర్మించారు బత్తుల బలరామకృష్ణ, వెంకటలక్ష్మి దంపతులు.
బలరామకృష్ణ వ్యాపారవేత్త. చాలాకాలం క్రితమే రాజమండ్రిలో స్థిరపడ్డారు. అయినా, మూలాల్ని మరచిపోలేదు. స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.
వూళ్లో చిన్నచిన్న గుళ్లూ గోపురాలూ చాలానే ఉన్నా, చెప్పుకోదగ్గ ప్రధాన ఆలయం ఒక్కటీ లేకపోవడం లోటుగా అనిపించేది. దీంతో, వూరంతా గర్వపడేలా ఓ గొప్ప కోవెల నిర్మించాలనే నిర్ణయానికొచ్చారు
💠 'ఏ ఆలయాన్ని నిర్మించాలి?' అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఎంతోమంది మఠాధిపతుల్నీ గురువుల్నీ కలిశారు. ఒకరు వైష్ణవ క్షేత్రాన్ని నిర్మించమన్నారు, మరొకరు శివ లింగాన్ని ప్రతిష్ఠించమన్నారు, ఇంకొకరు అమ్మవారి గుడి కట్టమన్నారు.
💠 సర్వదేవతల ఆలయాల్నీ నిర్మించాలన్న ఆలోచన అప్పుడు కలిగిందే. జీవితభాగస్వామి వెంకటలక్ష్మి భర్త సంకల్పానికి మద్దతు ఇచ్చారు. మిగతా కుటుంబ సభ్యులూ మేమున్నామని ముందుకొచ్చారు.
విరాళాల కోసమో సాయం కోసమో ఎవర్నీ ఆశ్రయించకూడదనే నియమం పెట్టుకున్నారు. ఎక్కడెక్కడి శిల్పుల్నో పిలిపించారు. ఇంజినీర్లతో మాట్లాడారు. రేయింబవళ్లు శ్రమించినా, ఆలయ సముదాయానికి ఓ రూపం రావడానికి నాలుగేళ్లు పట్టింది.
💠 పీఠం ఆవరణలో మొత్తం 54 దేవాలయాలున్నాయి.
ఎనభై నాలుగు దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారు.
కైలాస మహాక్షేత్రాలుగా (21), వైకుంఠ క్షేత్రాలుగా (15), శక్తిపీఠాలుగా (18) వాటిని విభజించారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం,
ఇక్కడే ఆనందనిలయ వాసుడిని అర్చించుకోవచ్చు - భూదేవి, శ్రీదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది.
💠 ఇక్కడే షిర్డీనాథుడిని ప్రార్థించుకోవచ్చు - సద్గురు సాయిబాబా మందిరం ఉంది.
ఇదే భద్రాది, ఇదే అన్నవరం, ఇదే యాదాద్రి, ఇదే అరసవల్లి...కోదండ రామస్వామి, రమాసత్యనారాయణ స్వామి, లక్ష్మీనరసింహస్వామి, సూర్యనారాయణమూర్తి ఆలయాలు ఇక్కడున్నాయి.
💠 శివుడి పరివార దేవతలకు శైవాగమం ప్రకారమూ వైష్ణవాలయాల్లో వైఖానస ఆగమ సంప్రదాయాల ప్రకారమూ పూజలు నిర్వహిస్తారు.
మూల దేవస్థానాల్లో ఏ దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని ఆ దేవుడికి శాస్త్రోక్తంగా నివేదిస్తారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా నవగ్రహాలను సతీసమేతంగా ప్రతిష్ఠించారు.
💠 ఇక్కడి విగ్రహ ప్రతిష్ఠాపన తమిళనాడుకు చెందిన 108 మంది వేదపండితుల సారథ్యంలో జరిగింది. ఆశ్రమంలో ఓ గోశాల ఉంది. వేదపాఠశాల నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆలయంలోకి వెళ్లగానే, 32 అడుగుల ఎత్తుతో అర్ధనారీశ్వరుడు భక్తులకు స్వాగతం పలుకుతాడు.
💠 భవిష్యత్తులో నిత్యాన్నదాన పథకాన్ని ప్రారంభించాలన్న ఆలోచన కూడా ఉందంటారు ఆలయ కార్యనిర్వహణాధికారి ధర్మవరపు వెంకటనారాయణశర్మ
💠 రాజమండ్రి నుంచి కోరుకొండకు చక్కని రవాణా సౌకర్యం ఉంది. అక్కడి నుంచి గాదరాడకు ఆటోలు ఉంటాయి.
No comments:
Post a Comment