Adsense

Wednesday, June 15, 2022

శ్రీ గంగా భ్రమరాంబికా సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి : సత్రశాల, గుంటూరు జిల్లా



💠 పల్నాటి ప్రజల ఆరాధ్యదైవం శ్రీ గంగా భ్రమరాంబికా సమేత మల్లిఖార్జున స్వామి. 
ఆ స్వామి గుంటూరు జిల్లా రెంట చింతల మండలం, జెట్టిపాలెం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో, కృష్ణానదికి దక్షిణ తీరంలోనున్న సత్రశాలలో కొలువై భక్తులను కరుణిస్తున్నాడు.

💠 త్రేతాయుగంలో బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఇక్కడ సత్రయాగం చేసినందువల్ల, ఈ ప్రదేశానికి సత్రశాలనే పేరు వచ్చిందని ఒక కథనం. 

💠 విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుండగా, యజ్ఞ గుండం పై శ్రీరామచంద్రుడు తన బాణాలతో గొడుగు (ఛత్రం) ఆకారం వంటి వలయాన్ని ఏర్పాటు చేసాడట. 
అందుకే పూర్వం ఈ ప్రాంతం శస్త్రశాలగా పిలువబడిందట. 
ఆ శస్త్రశాలే కాల క్రమంలో సత్రశాలగా పిలువబడుతోంది.


💠 పూర్వం కృష్ణానది ఈ క్షేత్రానికి దక్షిణ దిక్కులో ఉండేదట. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఎంతో శ్రమపడాల్సి వస్తుండేదట. ఈ విషయాన్ని గమనించిన శృంగిమహర్షి శివుని ప్రార్థించగా, ఆ స్వామి 'జటధార' రూపంలో నదిని ఈ క్షేత్రానికి ఉత్తరదిశకు మరల్చాడు. అందుకే ఈ గ్రామాన్ని జెట్టిపాలెం అని పిలుస్తుంటారు.

💠 ఈ ఆలయ నిర్మాణశైలిని గురించి రకరకాల అభిప్రాయా లున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణ శైలిననుసరించి, ఇది రేచర్ల రాజులచే నిర్మించబడిందని చెప్పబడుతోంది. అలాగే ఈ ఆలయ నిర్మాణశైలిలో కాకతీయ శిల్ప రీతులను కూడ చూడవచ్చు. స్వామివారి ఆలయానికి పూర్వాభిముఖంగా అమ్మ వారి ఆలయం ఉంది.

💠 గర్భాలయంలో విశ్వామిత్ర మహర్షిచే ప్రతి స్థితమైన తెల్లని పాలరాతితో చేయబడిన శివలింగరూపంలో మల్లిఖార్జున స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆల యంలో సింహవాహినియైన భ్రమరాంబికాదేవి, మహిషా సురమర్దినితో సహా భక్తులను పాలిస్తున్నారు.

💠 స్వామికి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు ఆసీనుడై ఉన్నాడు. ఈ ఆలయ ప్రాంగణంలో అన్నమేశ్వరాలయం, వేంకటేశ్వరాలయం, చీకటి మల్లయ్య ఆలయాలున్నాయి.
 
💠 చీకటి మల్లయ్య స్వామిని సంతానమల్లయ్య అని కూడ పిలుస్తుంటారు. ఈ స్వామిని సంతానం లేమితో బాధపడేవారు దర్శించుకుంటే, సంతాన భాగ్యం కలుగుతుందట.

💠 సంతానమల్లయ్య స్వామి ఆలయానికి ఎదురుగా కాశీ విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణేశ్వరీ ఆలయం, చెన్నకేశవస్వామి ఆలయాలున్నాయి. అలాగే ఆలయానికి పశ్చిమాభిముఖంగా ఉత్తరేశ్వరాలయం, ఆంజనేయస్వామి ఆలయాలు, ఉత్తరాభిముఖంగా షణ్ముఖాలయం ఉంది. 

💠 ఇక, అమ్మవారి, అయ్యవారి ఆలయాలకు మధ్య, వెనుకభాగంలో, పూర్వాభి ముఖంగా శ్రీరామాలయం ఉంది. 
ఈ శ్రీరామాలయంలో రామలక్ష్మణ,విశ్వామిత్ర విగ్రహాలున్నాయి. యాగరక్షణార్థం శ్రీరాముడు ఇక్కడకు వచ్చేటప్పటికి అవివాహితుడు. అప్పటికి ఆంజనేయుని పరిచయం ఏర్పడలేదు.
అందుకే ఈ ఆలయంలో సీతమ్మవారి విగ్రహం గాని, ఆంజనేయుని విగ్రహాలుగాని లేవు.

💠 ఆలయం నుంచి కృష్ణానదికి సోపానమార్గం ఉంది. ఈ మార్గం వెంట వెళితే కుడివైపునున్న చిన్నగుహలో అమరేశ్వర లింగం ఉంది. 

💠 ఈ ఆలయంలో ప్రతి శివరాత్రికి అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించబడతాయి. లింగోధ్భవ కాలంలో వేలాది మంది భక్తులు స్వామి దర్శనం చేసుకుని పునీతులవుతున్నారు. 

💠.తొలి ఏకాదశినాడు విశేషపూజలు, కార్తీక మాసమంతా నిత్యాభిషేకాలు, పూజలు జరుగుతాయి. తొలి ఏకాదశినాడు విశేషపూజలు, కార్తీక మాసమంతా నిత్యా భిషేకాలు, పూజలు జరుగుతాయి.

No comments: