Adsense

Wednesday, June 15, 2022

శ్రీ బ్రహ్మలింగేశ్వరస్వామి ( బ్రహ్మేశ్వరాలయం) - చేబ్రోలు



💠 ఆయన సృష్టికర్త. త్రిమూర్తులలో ప్రథమ స్థానం. అందరి తలరాతలు రాసేవాడు.. ఏడు కొండలవాడికి నిత్యమూ సుప్రభాత సేవలో పాల్గొని (బ్రహ్మాదయస్సువ...) తరించేవాడు... 
అన్ని దేవుళ్లకు అష్టోతర, శతనామాలతో భక్తులు పూజలు చేసుకునే అవకాశం ఉన్నా ఆయన మాత్రం పూజా పునస్కారాలకు నోచుకోని వాడు... ఎవరయ్యా అంటే ఇంకెవరూ... బ్రహ్మ అని అందరూ ఠక్కున చెప్పేస్తుంటారు.

అయితే కాశీ, రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు దగ్గర్లోని పుష్కర్‌లో,  తమిళనాడు లోని కుంభకోణం ప్రాంతాలలో మాత్రమే బ్రహ్మకు దేవాలయాలున్నాయి.
భృగు మహర్షి శాపం కారణంగా భూలోకంలో బ్రహ్మ దేవుడికి ఆలయాలు ఉండవని, పూజలు జరగవు ,ఆయన  శాపం కారణంగా కలియుగాంతం వరకు నీటిమధ్యలో ఉండిపోయినవాడు...

💠 అటువంటి బ్రహ్మకు మన రాష్ట్రంలో ఏకైక ఆలయం గుంటూరు జిల్లా చేబ్రోలులో ఓ అరుదైన దేవాలయం ఉంది.

💠ఇక్కడి చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వరస్వామి ఆలయాన్ని రెండో కాశీగా చెబుతారు. శివలింగం చుట్టూ బ్రహ్మ నాలుగు ముఖాలతో ఉండటంతో ఆలయానికి విచ్చేసిన భక్తులు, ఒకేసారి శివుడిని, బ్రహ్మదేవుడిని దర్శించుకున్న అనుభూతి చెందుతారు. 
 అంతే కాకుండా ఇక్కడ బ్రహ్మదేవుడు నాలుగు మొహాలతో ఉంటూ 2 మొహలతో  శివాలయంవైపు ఇతర రెండు ముఖాలతో వైష్ణవాలయం వైపు చూస్తూ ఉండడం ఇక్కడ విశేషం.

💠గుంటూరు జిల్లా కేంద్రానికి 14 కిమీ దూరంలో చేబ్రోలులో (పొన్నూరు మార్గంలో) 18వ శతాబ్దం లో దేవాలయాన్ని కట్టించి ధన్యుడయ్యాడు శ్రీ రాజా వాసిరెడ్డి వెంకట్రాద్రి నాయుడు.

💠రాజ్యంలో మితిమీరిన దొంగతనాల కట్టడికి, పట్టుబడిన దొంగల తలలు తీయించే చట్టం చేస్తారు వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు. సామూహికంగా మనుషులను చంపించిన పాపం తనను పట్టిపీడిస్తుందన్న భావనతో నిష్కృతి కోసం బ్రహ్మదేవుడి ఆలయం నిర్మించాలని తలుస్తారు.
 పూజార్హత లేని బ్రహ్మకు ఆలయం కట్టిస్తే, ఆ దేవతా మూర్తి దృష్టి పడ్డంతవరకు నాశనమవుతుందని పెద్దలు హెచ్చరిస్తారు. దీనికి నివారణోపాయంగా 4 దిక్కుల్లో శివ–కేశవ ఆలయాలు నిర్మించాలని సూచిస్తారు. బ్రహ్మదేవుణ్ణి లింగాకారంలో మలిచి ఆ దేవుడి దృష్టి బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేశారు. 

💠ఆలయానికి ముందు వెనుక శివాలయాలు, రెండు పక్కల వైష్ణవ ఆలయాలు నిర్మించారు. మిగిలిన 4 మూలలా ఇతర దేవతా మూర్తులను ప్రతిష్టించి ఎనిమిది దిక్కులనుంచి బ్రహ్మదేవుని దృష్టిని ముందుకు సాగకుండా అరికట్టారు. 

💠బ్రహ్మశ్వరునిగా పిలుచుకుని ఈ స్వామికి నిత్యమూ ఇక్కడ ఎటువంటి పూజాదికాలు జరుగకపోయినా లింగాకారంలో ఉన్న స్వామికి ప్రతిరోజు అభిషేకం, విభూది ధారణ వంటివి మాత్రమే జరుగుతాయి. 

💠సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మా ణమై ఉంది. 
మధ్యలో గర్భగుడి.. ముందు వైపు ధ్వజస్తంభం.
కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పున వంతెన నిర్మించారు.
-ఇక గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తున, నాలుగు అడుగు ల కైవారం ఉండే శిలపై పద్మం ఆకారాన్ని తయారు చేసి దాని మధ్యలో మూడు అడుగు ల ఎత్తున నలుచదరంగా ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడు కూర్చుని వున్న భంగిమలో భక్తులకు కనిపిస్తారు. 

💠లింగాకారంగా ఉండటంతో స్వామివారిని బ్రహ్మేశ్వరునిగా పిలుస్తుంటారు. ఎటువంటి ఉత్సవాలకు నోచుకోని స్వామిని నిత్యం ఎంతో మంది వచ్చి చూసి వెళ్తుంటారు. 

💠 దేవాలయానికి సమీపంలో మరో 9 ఆలయాలు ఉండటం విశేషం.
 గతంలో నూరు దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉండేవట. ఉన్న ఆలయాల్లో కేశవస్వామి ఆలయం ప్రాచీ నమైందిగా చెబుతారు. విశాలమైన ప్రాకారాలు... రాజగోపురాలు.. మంటపాలు... స్తంభాలు... ఏకరాతి శిల్పాలు.. శిల్ప సంపద అంతా ఇక్కడ కొలువుదీరి ఉందా అన్నట్లుగా అనుభూతి కలుగుతుంది. అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం, భీమేరాశ్వరాలయం, వేణుగోపాల స్వామి, నరసింహస్వామి, ఆంజనేయస్వామి, వీరభద్రుడు, రంగనాధ స్వామి, చంద్రమౌళీశ్వర స్వామి, సహస్ర లింగేశ్వర స్వామి, నవగ్ర హమూర్తులు, నాగేశ్వరాలయాలు పక్కపక్కనే ఉన్నాయి.

💠 విషయ మేమంటే బ్రహ్మ చూపు పడితే అరిష్టం కలుగుతుందన్న ఉద్దేశ్యంతో ఇక్కడి బ్రహ్మశ్వరాలయాలన్ని దేవతామూర్తుల ఆలయాలతో అష్ట దిగ్బంధనం చేసినట్లు పూర్వీకుల కథనం.

💠-తూర్పు, పడమర దిక్కులలో వరుసగా చంద్ర మౌళ్వేశ్వర, సహస్రలింగేశ్వర ఆలయాలు (శివాలయాలు).
 ఉత్తర దక్షిణాలలో వేణుగోపాలస్వామి, రంగనాధ స్వామి (వైష్ణవ) ఆలయాలు.
నైరుతి, వాయువ్య, ఈశాన్య, ఆగ్నేయ దిక్కులలో శక్తి స్వరూపుణులైన అమ్మవార్ల ఆలయాలను ఏర్పాటు చేసి బ్రహ్మేశ్వర ఆలయాన్ని దిగ్బంధం చేసినట్లు పెద్దలు చెబుతుంటారు. 

💠ఇన్ని ఆలయాలు ఇక్కడ కొలువుదీరి ఉండటం వల్లే తమ ప్రాంతంలో పండిన పొగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, అలాగే ఇక్కడి చేనేతలకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చేబ్రోలువాసులు గర్వంగా చెపుతుంటారు.

💠 పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలు ఉన్న ప్రదేశం.

No comments: