💠శైవమునకు పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే వైష్ణవమునకు కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి.
అవి
బాపట్ల (భావపురి),
పొన్నూరు (స్వర్ణపురి),
భావదేవరపల్లి (కృష్ణా జిల్లా),
సర్పవరం (నేడు కాకినాడలో అంతర్భాగం), పట్టిసం.
వీనిలో ప్రకాశం జిల్లాలోని పెదగంజాం కూడా ఉంది అని చెప్తారు.
💠ఆంధ్రప్రదేశ్లో ఉన్న పంచ భావనారాయణ క్షేత్రాలలో ప్రధానమైన క్షేత్రం బాపట్లలో వెలసిన భావనారాయణ ఆలయం.
💠 ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్లగా, బాపట్లగా మారింది.
💠ఇది ప్రాచీన ఆలయము. ఈ ఆలయము శాలివాహం శకం 515 లో (క్రీ.శ. 594 లో) ప్రమాదీ నామసంవత్సర ఫాల్గుణ శుద్ధ పూర్ణిమనాడు ప్రతిష్ఠింప బడినదని చరిత్రకారులు తెలియజేయుచున్నారు.
💠కాని స్థలపురాణం మాత్రం, కృత, త్రేతా, ద్వాపర యుగాలలో ఇచట బ్రహ్మర్షులు సమావేశమగు చుండేవారని, వారచట ఒక యాగకుండమును ఏర్పాటు చేసి అచట నారాయణుని స్మరించుచూ హోమం చేయుచుండేవారని అప్పుడు నారాయణుడు ఆయా యుగ ధర్మముననుసరించి, వేర్వేరు రూపాలతో వారికి దర్శనమొసగుచుండే వాడని, ఆ ప్రకారం నారాయణుడు ద్వాపరయుగంలో క్షీరవృక్షంలో శేషరూపం ధరించి వారిని ఆశీర్వదించాడని, తరువాత వచ్చిన కలియుగంలో ఎవరును క్షీరవృక్షంలో ఉన్న నారాయణుని కనుగొనలేకపోయారనీ అంటారు.
💠కలియుగంలో కుళోత్తుంగచోలుడు దిగ్విజయ యాత్ర చేయుచూ ఈ ప్రాంతానికి వచ్చాడని, అపుడు వారి ఏనుగులు స్వేచ్ఛగా తిరుగుచు క్షీరవృక్షము ఆకులు తినబోగా, వాని తొండములు ఆ చెట్టుకు అంటుకొనిపోయి రాలేదని, రాజు ఆ వార్త విని అశ్చర్యం చెంది ఆ ప్రదేశానికి వచ్చి ఆ చెట్టును, ఆ చెట్టునంటుకొనిపోయి నిల్చుండియున్న ఏనుగులను చూచి, అది దైవమహిమయని గుర్తించి దైవాన్ని ప్రార్థించగా, అతడు తన విషయాన్ని తెలియజేసి, మీ ఏనుగులు చేసిన పాపానికి పరిహారంగా మీరు ఇచట ఒక ఆలయము కట్టించుమని ఇరువురు బ్రాహ్మణుల ద్వారా తన భావాలను తెలియజేసిన నారాయణుని, భావనారాయణుడన్న పేరుతో ప్రతిష్టించి ఆరాధించాడని, అప్పటి నుండి ఆ ఆలయము భావనారాయణ ఆలయముగా ప్రసిద్ధిగాంచినది ఆ పురాణం వివరించుచున్నది.
💠 ఇక్కడ భావన్నారాయణ స్వామి కాలి వేళ్ల పై నిలబడి భక్తుల కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుంది.
ఇలా ఓ దేవతామూర్తి భక్తుల కోసం ఎదురు చూడటం భారత దేశంలో మరెక్కడా కనిపించవు.
💠 ఈ ఆలయం లోపల చలికాలంలో వెచ్చగాను, వేసవిలో చల్లగా ఉంటుంది.
ఇది అప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం.
💠 ఆ ఆలయానికి రెండు ధ్వజస్థంభాలు ఉంటాయి.
ఆ స్తంభాలు గజపాద (ఏనుగు కాలు) ఆకారంలో ఉండటం విశేషం.
ఆలయ గర్భగుడి వెనుక పై కప్పు మత్స్యం అంటే చేప ఆకారంలో కనిపిస్తుంది.
దీన్ని తాకితే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
💠 ఇదిలా ఉండగా భావనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం జరిగే సమయంలో పునాదుల కోసం తవ్వుతుండగా అక్కడి వారికి జ్వాలా నరసింహ స్వామి విగ్రహం దొరికింది. దీంతో ఆ విగ్రహన్ని స్వామివారి విగ్రహం పక్కనే పెట్టి పూజించేవారు అయితే ఆ విగ్రహం అక్కడ పెట్టినప్పటి నుంచి దేవాలయానికి దగ్గరగా ఉన్న కారంచేడు అనే గ్రామం తరుచుగా అగ్నిప్రమాదాలు జరిగేవి.
ఈ విషయమై క్రిమకంఠ చోళుడు అక్కడి పురోహితులను సంప్రదించి పరిష్కారం చూపమని అడిగారు దీంతో పురోహితులు జ్వాలా నరసింహుడి ఉగ్ర రూపం వల్ల ఇక్కడ తరుచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఆయన్ను శాంతింప చేయాలని నిర్ణయించారు.
ఇందు కోసం స్వామివారి ఆలయానికి ఎదురుగా శాంత కేశవ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
అప్పటి నుంచి ఆ కారంచేడు గ్రామంలో అగ్నిప్రమాదాలు నిలిచిపోయాయని చెబుతారు.
💠 జ్వాలా నరసింహుడి విగ్రహం ఆసీన రీతిలో ఉంటుంది. నాలుగు చేతులు ఉంటాయి.
పై రెండు చేతులతో శంఖం, చక్రం ఉండగా కింది కుడి చేయి అభయ హస్తం. ఎడమ చేయి తొడపై ఉంటుంది.
💠 ఈ గ్రామంలో ఎనిమిది దిక్కుల్లో..
వల్లాలమ్మ,
కుంచలమ్మ,
శంకరమ్మ,
శింగరమ్మ,
ధనకొండలమ్మ,
మూలకారమ్మ,
నాగభూషణమ్మ,
బొబ్బలమ్మ అనే ఎనిమిది మంది గ్రామ శక్తులను ఎనిమిది దిక్కుల్లో ప్రతిష్టించారు.
💠 ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వేసవిలో జరిగే బ్రహ్మోత్సవాలకి లక్షల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు. ఇంకా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది.
💠ఈ దేవాలయంలో భావన్నారాయణుడు ఇతర పరివార దేవతలయిన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారులతో కొలువైవుండి భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తాడు.
💠 ఇక్కడి శాంతకేశవ స్వామివారి మూలవిరాట్టును ఏమి కోరుకొంటే అది నెరవేరుతుందని చెబుతారు.
💠 దేశములోనే ఎక్కడాలేనట్టుగా విఖనస మునీంద్రులకు కూడా మందిరము ఉంది. అందుకే బాపట్ల మంచి విద్యాకేంద్రంగా వెలుగొందుతున్నదని చెప్తారు.
No comments:
Post a Comment