⚜ అదిగో... దక్షిణ కైలాసం
దక్షణ కైలాసంగా పేరొంది కోట్లాదిమంది భక్తులను పునీతులను చేసే దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ.
👉 భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన వాయులింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది.
పంచభూత లింగాల్లో పృథ్వీలింగం, తేజోలింగం, ఆకాశలింగం, జలలింగం తమిళనాడులో ఉంటే.. ఒక్క వాయులింగం మాత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కొలువైంది.
ఈ క్షేత్రం రాహు,కేతు, సర్పదోష నివారణ క్షేత్రంగా విరాజిల్లుతోంది.
👉ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని, దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండడమే అని అంటారు.
🔔 స్థల పురాణం 🔔
👉 పూర్వం ఒక అడవిలో ఒక శివలింగం వుంది . ఏనుగు ఒకటి రోజు సువర్ణ ముఖి నదిలో స్నానంచేసి కొంతనీరు పుక్కిలిపట్టి తెచ్చి , ఆ నీటితో లింగానికి అభిషేకంచేసి , పూలు పత్రి తెచ్చి పూజ చేసేది . ఏనుగు వెళ్లిపోగానే ఒక పామువచ్చి ఆ ఆకులూ , పూలు పక్కకు జరిపి రత్నాలతో పూజించేది . ఒక సాలెపురుగు స్వామిచుట్టూ గూడు అల్లి సేవించేది . అయితే ఒకరిపూజ మరొకరికి నచ్చేది కాదట . పత్రి , పూలు తొలగించి ఎవరో రాళ్లు తెచ్చి స్వామిపై వేశారని , ఏనుగు బాధ పడితే రత్నాలు నెట్టివేసి ఆకులలములు కప్పారెవరో అని పాము కోపగించేదట .
చివరకు ముగ్గురూ స్వామి అనుగ్రహంతో ముక్తి పొందటంతో కథ సుఖాంతమైంది .
ఆ శివలింగమే శ్రీ కాళహస్తీశ్వరుడుగా పేరు పొందింది .
👉శ్రీ అంటే సాలీడు, కాళము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు.
ఈ మూడు మూగ జీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కధనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు.
ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సద్యోముక్తి క్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహా భాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామి వారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనం ఇస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు.
👉ఇదే క్షేత్రంలో కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట . వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట . అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది . భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు . స్వామి ప్రత్యక్షమై అతనికి ముక్తి ప్రసాదించాడు . భక్త కన్నప్ప ప్రతిమకూడ నేటికి మనకు ఈ దేవాలయంలో కన్పిస్తుంది .
సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీ కాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరున్ని భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం.
👉పరమేశ్వరుడికి మహా భక్తులైన రోమస మహర్షి, ధూర్జటిల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు. ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు.
⚜ రాహుకేతు శాంతి పూజలు:
👉శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్ట మొదటి గుర్తొచ్చేది రాహు కేతు శాంతి పూజలు. శ్రీకాళహస్తీశ్వరుడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహు కేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహు కేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో జరిగే ఈ శాంతి పూజల్లో ఒకే సారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు.
⚜ చెంగల్వ రాయుని ఆలయం:
👉శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీదేవసేన సమేత చెంగల్వ రాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు.
⚜ మాటలు తెచ్చే తీర్థం :
👉శ్రీకాళహస్తి దేవస్థానంలోని కంచుగడప సమీపంలో పురుషామృగంను వీక్షిస్తే మోక్షం లభిస్తోందని శాస్త్రం చెబుతుంది. ఇక్కడి సరస్వతి తీర్థాన్ని సేవిస్తే చెవిటి, మూగ వారు వ్యాధి విముక్తులవుతారని భక్తుల్లో విశ్వాసం.
👉ఈ ఆలయంలోనే పాతాళ వినాయకుని గుడి వుంది . ఇక్కడ దాదాపు 30 అడుగుల వినాయక విగ్రహం వుంది .ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుణ్ణి దర్శించుకుని తరువాత శ్రీకాళహస్తీశ్వరున్ని భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్ర లింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
No comments:
Post a Comment