Adsense

Wednesday, June 15, 2022

శ్రీ అర్ధగిరి వీరాంజనేయస్వామి దేవస్థానం: అర్దకొండ/అరకొండ . చిత్తూరు జిల్లా


🔅 శ్రీరాముని ప్రధమభక్తుడైన ఆంజనేయ స్వామికి పురాణములతో ముడిపడిన పురాతన మరియు ప్రశస్తమైన ఆలయములలో అర్ధగిరి ఆంజనేయుని ఆలయం ప్రధమంగా చెప్పబడుతునది. 

👉ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన కాణిపాకం స్వయంభూః వరసిద్ధి వినాయకుడు ఆలయం నుండి 13 కి.మీ దూరంలో ఉంది.
అరగొండ అను గ్రామమువద్ద కొండపై అర్ధగిరి ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది  

🔅 చరిత్ర: 

👉 ఈ అర్థగిరి క్షేత్ర ఆవిర్భావం వెనక కమనీయమైన, రసరమణీయమైన రామాయణగాథ చరిత్రగా చెప్పబడుతుంది. 
అదేమిటంటే త్రేతాయుగ కాలంలో రామ-రావణుల మధ్య సంగ్రామం జరుగుతుండగా, రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు మూర్చబోతాడు. లక్ష్మణుడిని మేలుకొలపడానికి సంజీవిని అనే ఔషధం  అవసరమైంది. 
అంతే, సంజీవిని తీసుకురావడానికి శ్రీరామభక్తుడైన  ఆంజనేయుడు 'జైశ్రీరామ్' అంటూ వాయు వేగంతో ఆకాశంలోకి లంఘించాడు. సంజీవని ఆ పర్వతంపై ఎక్కడుందో కనుగొనలేక పర్వతాన్నే ఏకంగా పెకలించి, తన అరచేతులపై తీసుకుని వస్తుండగా, ఔషదులతో కూడిన ద్రోణగిరి పర్వతమును తీసుకొనివచ్చు ఆంజనేయుని చూచిన శ్రీరాముని సోదరుడైన భరతుడు చీకటిసమయం ఆగుటవలన తమకు హానిచేయుటకు రాక్షసులు పర్వతము తెచ్చుచున్నారని భావించి హనుమంతునిపై బాణము వేయగా ద్రోణగిరి పర్వతములో  సగభాగం విరిగి పెళ పెళరావంతో నేలమీద పడింది.

👉  ఆ కొండ పడిన ప్రాంతమే అర్థగిరి. 
ఆ ప్రాంతంలో ఒక గ్రామం వెలసింది.
 ఆ గ్రామమే అరకొండగా, కాలక్రమేణా అరగొండగా రూపాంతరం చెందిందని ఎందరో భాగవతుల కథనం, స్థలపురాణం.
ఇక్కడ స్వామి  ప్రసన్నాంజనేయునిగా ప్రసిద్ధి చెందారు.                             

👉 మిగతా ఆలయములలో వలె కాక ఈ ఆలయములో విలక్షణముగా హనుమంతుని విగ్రహం ఉత్తరంవైపు ఉంటుంది.. 
ఆలయప్రాంగణంలో కల కోనేటినీటిలో దివ్యఔషధగుణాలు ఉన్నాయని నమ్ముతారు. అందువలన ఈ కోనేటిని  సంజీవరాయ పుష్కరిణి అని పిలుస్తారు. కోనేటినందలి నీటిని తమ శరీర రుగ్మతలు తగ్గించుకోవడానికి భక్తితో స్వీకరిస్తారు.

👉దక్షిణ భారతదేశంలోని ఆంజనేయస్వామి దేవాలయాలలో అతి ముఖ్యమైనదిగా పరిగణించబడు ఈపురాతన ఆలయానికి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామిని భక్తితో ప్రార్థిస్తారు.
 పౌర్ణమిరోజు ఆంజనేయుడు మరింత శక్తివంతంగా ఉంటాడని నమ్ముతారు. అందువలన పౌర్ణమిరోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. 
ఆంజనేయుడు సౌమ్యుడు. భక్తులు తమలపాకులు మరియు తులసిదళములతో కూర్చిన దండలను స్వామికి అలంకరించడానికి సమర్పించవచ్చు. 
ఆంజనేయుడు 'శ్రీరామ జయం' అనే పవిత్ర పదాలతో కూర్చినదండతో అమిత ఆనందం పొందుతాడు. భక్తులు ఆంజనేయుడు ఇష్టపడే శ్రీరామనామం జపించడంద్వారా శ్రీరాముని మరియు ఆంజనేయుని ఒకేసారి తృప్తిపరచవచ్చు.  
ఆలయము ఉదయం 5 గం నుండి మధ్యాహ్నం 1-30 వరకు తిరిగి 2 గం.నుండి 8-00 వరకు తెరచిఉంటుంది.

🔅 మహిమాన్వితమైన  “సంజీవరాయ పుష్కరిణీ” (కొలను) : 
 
👉 ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన పుష్కరిణి  ఇటీవలి కాలంలో విశేష ప్రాచుర్యాన్ని పొందుతూ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. క్షేత్రం, పుష్కరిణీలు త్రేతాయుగం నాటివైనా, గుడి మాత్రం చోళరాజుల కాలంలో నిర్మించబడిందనే ఆధారాలున్న ఈ క్షేత్రంలో ఎందరో యోగులూ, మహర్షులు తపస్సు చేసిన గుహలు మనకు విస్మయాన్ని కలిగిస్తాయి. 
వనమూలికల ప్రభావంచే సహజంగా ఉద్భవించిన సంజీవరాయ పుష్కరిణీ తీర్థాన్ని సేవిస్తే వ్యాధులు నయమవడమే కాక మనో వాంఛలు కూడా నెరవేరుతున్నాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. 

👉ప్రతి నెలా పవిత్రమైన పౌర్ణమి రోజున విశేష పూజలు, భజనలు, హరికథలతో క్షేత్ర, భక్తి పారవశ్యంతో హోరెత్తుతూ భక్తాదులను విశేషంగా ఆలరిస్తోంది.

👉ఇప్పటికినీ సుదూర ప్రాంతములనుండి భక్తులు ఇచటగల కొనేరునుండి ఔషదగుణములున్న నీరు సేకరించుటకు వచ్చేదరు. ఈప్రాంతం పరిసరములలోని ఇతర ప్రదేశాలన్నిటిలోనూ ఈ కొలనునందు మాత్రమే నీరు తీయగాఉంటుంది. 
ఈ పర్వతంనందలి మట్టి అనేక ఔషధగుణములు కలిగి అన్ని రకాల చర్మ రుగ్మతలను పోగొడుతుందని నమ్మకం. 

👉కొలనులోని నీరు పర్వతమునందలి వివిధ మార్గములనుండి అనేక ఔషదమొక్కలను తాకుచూ ప్రవహించి ఈకొలనును చేరుతుంది.  మృతసంజీవనీ ఔషధపుమొక్క ఇచ్ఛటి కొనేరునందు పడినదని ఈ కోనేటికి చేరునీరు వేలసంవత్సరాలు గడచినను,ఇప్పటికీ మానవజాతికి సంక్రమించు దాదాపు అన్ని వ్యాధులను నయం చేయగల ఔషధ నాణ్యతను కలిగి ఉంది అని నమ్మకం. 

👉టి.బి., ఆస్తమా, క్యాన్సర్ మరియు  కీళ్లనొప్పులు వంటి తీవ్రమైన వ్యాధులను నయంచేసే శక్తి దీనికి ఉందని ప్రసిద్ధి.
ఈ నీరు బద్ధకం, అలసట మరియు శారీరక రుగ్మతలు పోగొట్టి  శరీరానికి సామర్థ్యాన్ని కలిగిస్తుంది అని నమ్మకం .

👉పుష్కరిణిలోని నీటిని భక్తులు 40 రోజులపాటు సేవించి, పక్కనే ఉన్న ఆంజనేయస్వామిని దర్శిస్తే అన్ని వ్యాధులు తగ్గిపోతాయని భక్తుల విశ్వాసం.

No comments: