Adsense

Thursday, June 16, 2022

శ్రీ భాగ్యలక్ష్మి ఆలయం, చార్మినార్, హైదరాబాద్



 💠 చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు అనే విషయం లో వేరువేరు వాదనలు ఉన్నాయి....ఆ రెండు వాదనలు ఏమిటంటే...

💠 అది గోల్కొండ నవాబు రాజుల కాలం. హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర కాపలాదారులు ఉన్నారు. అప్పుడే లక్ష్మీదేవి నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. కాపలాదారులు అడ్డగించారు. దేవి తన గురించి చెప్పగా, ఆమెను లోపలికి రానివ్వడానికి అనుమతి కోసం రాజు దగ్గరకు వెళ్లారు. తాము వచ్చే వరకూ అక్కడే ఉండాలని సూచించారు.
వారు తిరిగి వచ్చే వరకూ అక్కడే ఉంటానని మాటిచ్చింది అమ్మవారు. వెళ్లిన కాపలాదారులు గోల్కొండ ప్రభువులకు లక్ష్మీదేవి రాక గురించి చెప్పారు.

💠 తమ రాజ్యానికి వచ్చింది సాక్షాత్తు లక్ష్మీదేవి అని గుర్తించిన ప్రభువులు, ఆమె తిరిగి వెళ్లిపోతే రాజ్యంలో సిరిసంపదలు మాయం అవుతాయని ఆలోచించి, ఆమెను తిరిగి వెనక్కు పంపకుండా ఉపాయం ఆలోచించారు.
ఆ కబురు తెచ్చిన కాపలదారులు వెనక్కి వచ్చే వరకూ దేవి అక్కడే ఉంటానని మాటిచ్చింది కాబట్టి, వారిని వెనక్కి పంపకుండా ఆపేశాడు రాజు. దీంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంది దేవి.
గోల్కొండ నవాబులు అమ్మవారికి అక్కడే ఒక గుడి నిర్మించారు.


💠  ఇది హైదరాబాద్‌లోని చార్మినార్‌ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలోని అమ్మవారి గురించి
ప్రచారంలో ఉన్న ఒక కథ.

💠 మరొక కథనం ప్రకారం ...విగ్రహం పెట్టక ముందు అక్కడ రాయి, ఫోటో ఉండేదన్న విషయాన్ని చార్మినార్ భాగ్యలక్ష్మి గుడి పూజారులూ చెప్పారు. అయితే ఆ రాయి పురాతనమైన అమ్మవారి రూపం అని వారి అభిప్రాయం. ''ఆ రాయి రూపంలో అమ్మవారిని 500 ఏళ్ల నుంచి ఆరాధిస్తున్నారని'' చెప్పారు పూజారి సూర్యప్రకాశ్.

💠 ప్రస్తుతం భాగ్యలక్ష్మి గుడిలో అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర రెండు వెండి రూపాలు ఉంటాయి. ''ఆ వెండి తొడుగుల వెనుక ఆ పగిలిన రాయి ఉంది. పగిలిన రాళ్లకు పూజలు చేయకూడదు కాబట్టి, మొదట్లో ఫోటో పెట్టారు. తరువాత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది'' అని ఆయన వివరించారు.

💠 వాస్తవానికి 1960 దశకం వరకు అక్కడ ఎలాంటి ఆలయం లేదు.  1955-56లలో చార్మినార్ చుట్టూ చాలా లావుగా ఉండే ఇనుప గొలుసు ఉండేది. . అందులో చిన్న ముక్క అమ్మినా బోలెడు డబ్బు వచ్చేది. అలా జనం కొందరు ఇనుప తాడు దొంగిలించేవారు. క్రమంగా అది కనుమరుగు అయిపోయింది. అప్పుడు అక్కడ ఒక మైలురాయి ఉండేది. హైదరాబాద్ జీరో మైలు రాయి అది. 
1967లో ఒక బస్సు డ్రైవర్ ఆ రాయిని గుద్దేస్తే పగిలిపోయింది. వెంటనే ఆర్య సమాజ్ వారు వచ్చి ఆ రాయి భాగ్యలక్ష్మీ దేవని చెప్పి అప్పటికప్పుడు రెండున్నర అడుగుల ఎత్తులో నాలుగు పైపులు వాడి ఒక షెడ్ లాగా వేసేశారు. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ఆ స్థలంలో పక్కా నిర్మాణం జరిగింది.

💠 చార్మినార్‌కు ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం హైదరాబాద్‌ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం అయిన తర్వాత ఉనికిలోకి వచ్చిందని, స్మారక చిహ్నం వద్ద చిల్లా ఉన్న దాఖలాలు లేవని భారత పురావస్తు శాఖ (ASI) పేర్కొంది.

No comments: